కడప జిల్లా శిద్దవటం నుండి నాలుగు ఇండ్ల పేర్లుగల 95 మంది కోమట్లు రైల్వే కోడూరు సమీపంలోని కుంట ప్రాంతానికి వచ్చి ఇండ్లు నిర్మించుకొన్నారు. వారు దారిన వచ్చిపోయే వారికి అవసరమైన దినుసులు అమ్ముకొని జీవించేవారు. కోమట్లు ఏర్పరిచిన ఊరు అయినందున ఆ ప్రాంతానికి శెట్టి కుంట అనే పేరు వాడుకలోనికి తెచ్చారు. (కడప జిల్లాలో కోమట్లను (వైశ్యులను) ‘శెట్టి’ అని వ్యవహరిస్తుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్న తమిళనాడులో సైతం కోమట్లను ‘శెట్టియార్’ లేదా ‘చెట్టియార్’ అని వ్యవహరిస్తారు.) ఆ తరువాత వారి అనుమతితో బోయ (బోయ ముత్తరాజులు) వచ్చి అక్కడ నాలుగు ఇల్లు నిర్మించుకొన్నారు. వీరు మార్గాన వచ్చిపోయేవారికి ఒక పూట విశ్రాంతి తీసుకొనుటకు ఏర్పాటు చెెసేవారు. అలా కొన్ని రోజులు జరిగిన తరువాత చంద్రగిరి శీమలోని రేణిగుంట సమీపంలోని కరకంబాడి అనే ప్రాంతం నుండి మన్నె లేక మన్నేటి అనే గృహనామం గల ఒక కుటుంబం బోయ శెట్టికుంట ప్రాంతానికి వచ్చి దారిన వచ్చి పోతూ ఉండే ప్రజల్ని తీక్షణంగా పరిశీలించేవారు.
అలాకొన్ని రోజుల తరువాత వారికి అనుకూలమైన 12 మంది యానాదుల్ని కలుపుకొని దారిదోపిడీలు చేస్తూవున్నారు. కొంత కాలం తరువాత శ్రీమన్మహమండలేశ్వరుడైన మట్ల యల్లయరాజుకి పులుగుల నాటి సీమ అమరంగా శ్రీకృష్ణదేవరాయల వారు ఇచ్చారు. తరువాత మట్ల అనంతరాజయ్య శిద్దవటం, పొత్తపినాడు, పులుగుల నాడు ప్రాంతాల పాలన చేస్తున్నాడు. గోల్కొండ నవాడు అద్బుల్ కుతుబ్‌షాహి ప్రాంతం నుండి నవాబు మీరు జమలా సయ్యదు మహ్మద్ కర్ణాటక దేశం ప్రాంతానికి వచ్చి ఉండగా వారి తరపున సేనానాయకులైన ఉభయులను శిద్దవటం వద్ద పట్టుకొని అనంతరాజు వారి తలలు నరకి ఆ తరువాత రాజ్యం వదలి పశ్చిమ రాజ్యంలో బసవాపురం ప్రాంతానికి తరలివెళ్లాడు.
శెట్టికుంటకు వాయువ్య భాగంలో అరణ్యం మధ్య ఒక పర్లాంగుదూరాన కౌలుకి ఇవ్వబడే భూమి ఉంది. ఈ భూమి చన్నపరెడ్డి, పెద్దరెడ్డి ఆధీనంలో ఉంది, నెల్లూరి శీమ నుండి పంట రెడ్లు కొందరు ఆ ప్రాంతానికి వచ్చి ‘పంట కొత్తపల్లె’ అని ఒక పల్లె కట్టుకొని చన్నప్పరెడ్డి, పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న పొలం కౌలాచారం నిమిత్తం సాగు చేసుకొంటూ జీవనం చేస్తున్నారు. మన్నేటి తిరుమలనాయడు, పాపానాయడు, బుచ్చినాయడు అనే ముగ్గురు. అన్నదమ్ములు, వారిలో తిరుమల నాయడు మంచి వ్యవహార దక్షత కలవాడు ఇతని కుమారుడు క్రిష్ణమనాయుడు, ఇతడు పంట కొత్తపల్లెలో చెరువు (99) కట్టించవలెనని నలమారు చన్నపరెడ్డి కుమారుడైన క్రిష్ణారెడ్డి మాలెమార్పూరు యరబోయలు బుచ్చిరెడ్డి అనుమతితో పంట కొత్త పల్లె నైరుతి భాగంలో క్రిష్ణమనాయడు చెరువుకట్టించాడు.
అందుకు పాపానాయడు, బుచ్చినాయడు వడంబడిక నిర్ణయం ప్రకారం ఆ చెరువుకింద సాగు చేసిన పొలంలో సగం వంతు క్రిష్ణమ నాయడు పుత్ర పౌత్రపారం పర్యంతమున అనుభవించునట్లు కట్టడి చేయబడినది. మరియు ఆ చెరువుకింద ఉండేపెరుమాళ్ల మాన్యం రెండుకుంట- కొండమంగమ్మ మాన్యాల కుంట మాతంగమ్మ మాన్యం కుంట-బ్రాహ్మణ మాన్యాలు పది కుంటలు ఆ చెరువు తవ్విన ఉప్పర్లకు మాన్యం నాలుగుకుంటలు, చెరువు లెక్కలు రాసిన కాళాచన్నప్ప నాలుగు కుంటలు శాసనం చెక్కిన తొగశాపాపన్నకు రెండు కుంటలు- ఈ ప్రకారం (99) మాన్యాలు చక్కగా నడిపించగలవారమని నలమారు క్రిష్ణారెడ్డి, యరబోలు బుచ్చిరెడ్డి క్రీ.శ. 1684లో శిలా శాసనం చెక్కించారు. మట్ల అనంతరాజు కుమారులు కుమార అనంతరాజు, వెంకటరామ రాజు ఉభయులు తిరిగి పులుగుల, పొత్తపినాడు ప్రాంతాలను స్వాధీనం చేసుకొన్నారు. మన్నేటి క్రిష్ణమనాయడికి దాయాది తిమ్మానాయడు 20 మంది బోయ (ముత్తరాచ)లను వెంట బెట్టుకొని దారిదోపిడీలు చుట్టుపక్కల ఉన్న పల్లెల్ని దోచుకొని శెట్టికుంట నైరుతి భాగంలో పావుకోసుదూరాన అడవిలో మన్నేటి వారి పాళెం లేక మన్నెవారి పాళ్లెం అనే పల్లెకట్టించి అక్కడ కొందరు బోయలను కాపురం ఉంచాడు. ఈ పల్లెకు కురువకుంట పాళెం, రాజు చెరువుపాళెం అనే పేర్లు కూడా ఉన్నాయి.
మన్నేటి తిమ్మానాయడికి, వెంకటనాయడనే కుమారుడు యుక్తవయస్సులో ఉన్నాడు. ఇతడు తండ్రిని మించిన తనయుడు దారిదోపిడీలేకాదు చుట్టుపక్కల ప్రాంతాలైన పులుగుల నాటి సీమలోని పల్లెల్ని తిరుపతి తాలూకా గ్రామాలలో ఉన్న ప్రజలను చంద్రగిరిసీమలోని పల్లెల్ని తన సహచరులతో కలసి దోచుకొనేవాడు. దారిన పోయేవారిపై ఉరుములు లేని పిడుగులా మన్నేటి వెంకటనాయడు, ఎప్పుడు వచ్చి పడతాడోననే భయం ప్రజలను వెంటాడుతుంది. మన్నేటి వెంకటనాయడు ఒకడిని చేరదీసి తన బిడ్డ వలె ప్రాణ సమానంగా చూసుకొన్నాడు. కొన్నాల్లకు వారి మధ్య విరోధం ఏర్పడి మన్నేటి వెంకటనాయడి నుండి వేరుగా యర్రకుంట్లకోట (వై.కోట) కు వెళ్లి యర్రకుంట్లకోట పాలకుడైన అనంతరాజు దర్శనం చేసుకొని దారిదోపిడీలు గ్రామ దోపిడీలు చేస్తున్న వెంకట నాయడు ఉండేరహస్య స్థావరం శెట్టికుంట ప్రాంతంలో ఉందని చెప్పాడు. అపుడు మట్ల అనంతరాజు తన బందువు రాయరాజుని వెంటబెట్టుకొని కొంత సైన్యాన్ని తీసుకొని వెంకటనాయడు ఉండే ప్రదేశానికి దగ్గరలో ఉన్న చింత చెట్ల దగ్గర ఉన్నారు.
ఈ వర్తమానం చారుల ద్వారా వెంకటనాయడు తెలుసుకొని మాల కులస్థుడైన తనబంటుకి తెలియజేసాడు. సమర్థుడైన బంటు తుపాకీ పేల్చుటలో గురి తప్పనివాడు. తన భార్య సహాయంతో అనంతరాజు 10 మంది సైనికులను హతమార్చాడు 20 మంది సైనికులు గాయపడ్డారు. వెంటనే అనంత రాజు పోరాటం నిలిపివేసి శెట్టికుంట సమీపంలోని చింత చెట్ల వద్ద ఉన్నారు. వారికి అన్నపానాదులకు సౌకర్యం లేనందున మన్నేటి వెంకటనాయడు రాజు సైన్యానికి రాగిసంకటి, మజ్జిగను పంపించాడు. అవి ఆరగించిన రాజు సైన్యం విశ్రాంతి తీసుకొని మరునాడు మన్నేటి వారి పాళెం పై పోరాటానికి వెళ్లగా వెంకటనాయడు పాళెం ప్రజలతో కలసి అనంతరాజుపై ఎదురుదాడి చేసాడు. ఈ పోరాటంలో అనంతరాజు కాలికి గాయమైంది. కనుక అతని బంధువు రామరాజు ముందుండి సైన్యాన్ని నడిపించాడు మాటు వేసిన కొదమ సింహంలా మన్నేటి వెంకటనాయడు రామరాజుని పట్టుకొని కొండవాలు నుండి నీరు ప్రవహించే చోట తల నరికాడు. ఆ తరువాత శెట్టికుంట గ్రామాన మట్లి వెంకట్రామరాజు సేవకుడు చినవేంగు అనేవాడు చెరువు కట్టించాడు. కొండవాలు కాలువగా ఏర్పరచి చెరువులోనికి నీరు వచ్చేలా ఏర్పాటు చేసాడు. ఈ ప్రాంతంలో రామరాజుని చంపినందున ప్రజలు రామరాజు కాలువ అని వ్యవహరిస్తారు.
క్రీ.శ. 1733లో మన్నేటి వెంకటనాయడి, దోపిడీలను తెలుసుకొన్న చంద్రగిరిసీమ పాలకుడు నవాబు సాహెబ్, తన ఆజ్ఞ ప్రకారం గోలుకొండ వ్యాపారి అయిన పోలూరి వరదప్ప పంతులను తిరుపతి సుబేదారిగా పంపాడు. అతడు కొంత మన్నేటి వెంకటనాయడ్ని కలసి, ఆర్కాటు నవాబు వరదప్ప పంతులు మన్నేటి వెంకటయడ్ని కలసి, ఆర్కాటు నవాబు వారికి నిన్ను పరిచయం చేసి చంద్రగిరిసీమలో కొన్ని పల్లెలు అమరముగాను కడప సీమలో కావలి రుసుమ ఇప్పించేందుకు నిర్ణయం చేయించగలనని నమ్మించి వెళ్లాడు. మరుసటి రోజు ఒక వ్యక్తి ద్వారా శెట్టి కుంట, బొలుపల్లె, సందున కురుప పండల వద్దకు రమ్మని కబురుపంపాడు. వరదప్ప పంతులు మాటను విశ్వసించిన వెంకటనాయడు కురపబండలవద్దకు వెళ్లాడు. ఇరువు కలుసుకొని రెండు జాములవరకు ముచ్చటించు కొన్నారు.ఇక వెళదామని చెప్పిన వరదప్ప పంతులు. పథకం ప్రకారం వెంకటనాయడి వెనుక ఉండి తన వద్ద రహస్యంగా తెచ్చిన వరకత్తిని తీసి వెంకటనాయడ్ని హతమార్చాడు. తమ నాయకుడ్ని నమ్మించి ప్రాణం తీసిన వరదప్పపై కసిని పెంచుకొన్న వెంకటనాయడి బంటు, తిరుపతి నుండి ఎర్రకుంట్ల కోటకు పల్లకీలో వస్తున్న వరదప్ప పంతుల్ని బరిశతో పొడిచి చంపాడు.
ప్రాచీన కాలంలో మన్నెదొరలుగా, మన్నెనాయకులుగా పిలువబడిన బోయనాయడులకు నేడు రాయలసీమ ప్రాంతాలైన కడప ప్రాంతంలో కర్నూలులో మన్నోబోయలుగా ఆంధ్ర ప్రాంతంలో మన్నెముత్తరాసులుగా, తెలంగాణా ప్రాంతంలో ముదిరాజులుగా పిలువడుతున్నారు. వీరంతా బోయలే వారి శాసనాలలో ముత్తురాజులమని చెప్పుకొన్నారు. బోయ అంటే ఆటవికుడు, వేటగాడు అని అర్థం. ఈ వేటగాళ్లే గ్రామాధిపతుల హోదా నుండి పరిపాలకులుగా ఎదిగిన విదానాన్ని ముత్తురాజు అనే మాట సూచిస్తుంది.కళింగదేశం దట్టమైన అరణ్యాలతోనూ పర్వత శ్రేణులతోనూ నిండి ఉండేది. కళింగలోని అడవులు శ్రేష్టమైన ఏనుగులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాలకు స్థానిక రాజులైన బోయ (ముత్తరాజు) నాయకుల అధికారానికి తిరుగులేదు. ఈ నాయకులు అతిసాహసవంతులు కండ సిరి, కంటి గురి కలవారు. పర్వత యుద్ధ తంత్రాలలోనూ సాటి లేని మేటి వీరులు తమ తెగల రాజ్యాల రక్షణ అవసరాల నిమిత్తం శత్రువులు ప్రవేశించడానికి వీలుకాని విధంగా గిరిదుర్గాలు, వన దుర్గాలు నిర్మించుకొనుట వీరి ప్రత్యేకత. ఈ నాయకుల్ని మన్నె నాయకులంటారు. ఈ మన్నె నాయకులు తమ పొరుగు రాజుల భూభాగాలపై నిరంతరం దాడులు నిర్వహించేవారు. మన్నె నాయకుల్ని జయించడం అసాధ్యంగా ఉండేది. ఏ ఒక్క మన్నె నాయకుల్ని జయించడం అసాధ్యంగా ఉండేది. ఏ ఒక్కమన్నె నాయుడ్ని అణిచివేసినా ఆ రాజు మహా శూరుడని భావించేవారు.
నెల్లూరు జిల్లాలోని బోయ విహార్ దేశానికి చెందిన వారే మన్నెనాయకులు నెల్లూరులోని ఆత్మకూరు, కనిగిరి, ఉదయగిరి, తాలూకాలలోని శాసనాలలో వీరి ప్రసక్తి కనిపిస్తుంది. తెలుగు చోళవంశానికి చెందిన మన్నె నాయకులు చాళుక్యుల కాలం నుండి భూస్వామ్య శక్తిగా ఎదిగారు. కాకతీయ చక్రవర్తులకింద సైనిక జమీను (భూముల) ను పొంది సామంత రాజులుగా వ్యవహరించారు. ఇదే కాలంలో వీరికి పొరుగున ఉన్న ప్రోలయ వేమారెడ్డి మన్నె నాయకులను జయించినట్లు చెప్పుకొన్నాడు. (రెడ్డి రాజ్యాల చరిత్ర -దుర్గెంపూడి చంద్రశేఖరెడ్డి)
మన్నెం అంటే సన్మానించి ఇచ్చిన భూ భాగం లేక పర్వత ప్రాంత ప్రదేశం దుర్గ ప్రదేశం అనే అర్థాలున్నాయి. మన్నె అంటే సామంతుడు, రాజు అనే అర్థం ఉంది. నాడు సమాజంలో పటిష్టమైన సైనిక వ్యవస్థగా రూపు దిద్దుకొని ప్రభలంగా ఉన్న బోయ (ముత్తరాజు) నాయకులు తమ ప్రభువుల తరపున సమరభూమిలో పోరాడి విజయాలను సాధించిన సమర శూరులని తెలుస్తుంది. వారు సాధించిన విజయాలకు గాను ప్రభువులు వారి శౌర్య సాహసాలకు మెచ్చి ఇచ్చిన భూ భాగాలను పాలించి ఆ ప్రాంత నామాలే వంశ నామాలుగా వ్యవహరించబడ్డాయని చెప్పవచ్చు.
కడప జిల్లా కైఫియతులలో మన్నెలేక మన్నేటి వంశీయులకు సంబంధించిన సమాచారం లభిస్తుంది.
-భీమనాథుని శ్రీనివాస్