ఎంచక్కని దొరసాని శాంతకుమారి

ఎన్నాళ్లని నా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
ఎంతపిలిచినా ఏం వేడినా
ఈనాటికి దయ రాదేలా?
గోపాలా… నందగోపాలా…

ఓ భక్తురాలు భగవంతుని దర్శనం కోసం వేచివేచి ఈనాటికి నీకు దయరాదేలా అని ప్రశ్నిస్తూ తన బాధని, ఆయన్ని చూడాలన్న తపనని ఆయనకే నివేదించుకుంటుంది… అయితే ఆమె ఆ గోపాలుడికోసం ఎందుకు వేచిచూస్తోందో చరణంలో ఇంకా స్పష్టమవుతుంది-
”వీనుల విందుగ వేణుగానము
విని తరింపగా వేచితిరా”
ఎంతోమంది భక్తులు ఆ వేణుగానాన్ని వినితరించారు. మరి అటువంటి వేణునాదం కోసం ఆమె ఎన్నోఏళ్లుగా వేచిచూస్తోంది. కానీ
”వేచి వేచి ఈ వెన్నముద్దవలె
కరగిపోయెరా నా బ్రతుకు…”
ఆమె జీవితం కరిగిపోయింది కానీ ‘ఆయన’ మనసు మాత్రం ఇంకా కరగలేదు. అయితే రెండో చరణంలో ఆ భక్తురాలు మాతృదేవతగా తన కొడుకు ఇతరుల చేతుల్లో దెబ్బలు తినడం ఇష్టంలేక బాధపడుతోంది-
”వెన్న మీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మన యింట?
పాలను ముచ్చిలి పరుల చేతిలో
దెబ్బలు తినకురా కన్నయ్యా-
ఈ తల్లి హృదయము ఓర్వలేదయా-”
వకుళ ఎన్నో జన్మల అనుభవాల్ని మననం చేసుకొంటూ పాడుతూ ఉంటే శ్రీనివాసుడు ప్రవేశిస్తాడు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఆ గీతాన్ని గానం చేసిన నటి, గాయని పి.శాంతకుమారి. ఆత్రేయ సాహిత్యానికి పెండ్యాల కూర్చిన సంగీతం ఒక ఎత్తయితే శాంతకుమారి స్వరం పలికించిన భావ ఝరి మరోఎత్తు! భగవంతుడి దయ రాలేదన్న బాధ, తన ‘అమ్మ’తనాన్ని పండించుకోవాలనే తపన, ఆర్తి అన్నీ శాంతకుమారి వెండితీగెలా సాగే గొంతులో ఇప్పటికీ అడపాదడపా వినిపిస్తుంటుంది. తెలుగు మాటలు కూడా మాట్లాడలేని దిగుమతి చేసుకొన్న కథానాయికల కాలంలో చేరి తమ పాటలు తామే పాడుకోవలసిన అలనాటి కథానాయికల గురించి ఆలోచిస్తే ఆతరం వాళ్లెంత ప్రతిభావంతులో అర్థమవుతుంది. వి.ఎ.కె.రంగారావు అన్నట్లు ”సన్నటి గొంతు, వెండితీగెలా సాగే గొంతు, వినుకట్టు కట్టి వినువరిని మంత్రముగ్ధుని చేసే గొంతు…” ఇక నటపరంగా చూస్తే కథానాయికగా నటించినా, సోదరిగా, కుమార్తెగా, తల్లిగా నటించినా ఏ పాత్రలోనైనా ఒదిగి నిలిచే నటవ్యక్తిత్వం ఆమెది.
కన్నుల్లో కరుణ చిలికిస్తూ, శాంత స్వరూపిణిలా వెండితెర మీద నాలుగు దశాబ్దాలుగా విరాజిల్లిన విశిష్టనటి ఆమె. 1920 మే 17న పొద్దుటూరు సమీపంలో ఉన్న వెల్లాల అనే కుగ్రామంలో జన్మించారు శాంతకుమారి. ఆమె తల్లిదండ్రులు పూలదాస పెద్దనర్సమ్మ, శ్రీనివాసరావులు. ఆమె అసలు పేరు సుబ్బమ్మ. రాయలసీమ అనే కాక అప్పటికీ ఇప్పటికీ ఆంధ్రదేశంలో సుబ్బమ్మ, సుబ్బయ్య, సుబ్బారావులు అధికమే. సుబ్బమ్మకి చిన్నతనంలో సంగీతం అంటే ప్రేమ. అందువల్ల సంగీత రాజధాని అయిన మద్రాసు చేరుకొని ప్రొఫెసర్‌ సాంబమూర్తి శిష్యరికం చేశారు. శాస్త్రీయ సంగీతంలో తానేమిటో నిరూపించుకోవాలని తపన పడుతూ ఎక్కడ కచేరీలు చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు పరిశ్రమిస్తున్న రోజుల్లో సంగీత టీచరమ్మ కావాలంటే థర్డుఫారం వరకూ చదవాలన్న నియమం ఉండడంతో దాన్ని కూడా పూర్తి చేశారు సుబ్బమ్మ. సుప్రసిద్ధ గాయని డి.కె.పట్టమ్మాళ్‌ వంటివారు సహాధ్యాయినిగా ఉన్నపుడు మరి ఆ విధమైన ఆలోచనలే వస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. పట్టమ్మాళ్‌ వలె సంగీత విద్వన్మణి కావలసిన సుబ్బమ్మ వెండితెర మీద నటీమణి అయ్యారు. అప్పట్లో సంగీతం, నృత్యం వచ్చిన వారికే నటనలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. అలా శాంతకుమారి అందచందాలు, గానకళా విన్యాసం, వాచకం, హావభావాలు ఇవన్నీ ఆనాటి దర్శకులు గుర్తించి మా సినిమాలో నటించమ్మా అంటూ వెంటపడేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. 1936లో ”మాయాబజార్‌”లో శశిరేఖ పాత్రకోసం దర్శకులు పి.వి.దాస్‌ సుబ్బమ్మను ఎంపిక చేశారు. ఆమెని ఒప్పించడం కష్టమే అయినా చివరికి సుబ్బమ్మ ఆ పాత్ర ధరించక తప్పింది కాదు. చిత్రమేమిటంటే ఆ సినిమా తర్వాత ఆమె ”సారంగధర”లో నటించారు. అందులో ఆమె పాత్ర సౌందర్యాన్ని రక్తి కట్టించాల్సిన పాత్ర. అప్పట్లో సినిమాల్లో నటించడం అంటే పాడడం అని కూడా మరచిపోకూడదు. వి.ఎ.కె.రంగారావు మాటల్లో చెప్పాలంటే- ”మాయాబజార్‌ 1936, సారంగధర 1937 పాటలు అయిపు లేవు. రుక్మిణీ హరణ్‌ 1937 పాటలంత గొప్పవేం కావు. కాని కృష్ణప్రేమ 1943లో ఆమె పాడిన రెండు పాటలు ఆణిముత్యాలు. అపురూపాలు”. ”మాయలోకం(1945)లో ‘మోహనాంగ రారా’ పాట పాడుతూ ఉంటే తల్లికొడుకుల్లా తెరపై కనబడుతున్న వారినీ (శాంతకుమారి, ఎ.నాగేశ్వరరావు) ప్రేయసీ ప్రియులుగా భావించగలిగారు ఆనాటి ప్రేక్షకులు”… ఇదీ ఆమె ప్రత్యేకత! పాటలోనూ మాటలోనూ నటనలోనూ ఆమె మెప్పించగలిగారు.
శాంతకుమారి జీవితాన్ని మలుపుతిప్పిన ప్రధానాంశం ప్రసిద్ధ దర్శకులు పి.పుల్లయ్యతో వివాహం అనే చెప్పాలి. 1939లో శ్రీ వేంకటేశ్వర మహత్యంలో పద్మావతిగా ఆమె నటించారు. అప్పుడే వారిమధ్య ప్రేమ మొగ్గతొడిగింది. కొందరు విమర్శకుల దృష్టిలో సొంత సినిమాల్లో ఆమెకు పాడే అవకాశాలు ఎక్కువగా రాలేదని కూడా అంటారు. నటిగా ఆమె కథానాయిక పాత్రలు ధరించినట్లే దుష్టపాత్రలు కూడా పోషించారు. సారంగధరలో వాంపువేషం, అర్ధాంగిలో మూతివిరిచే దుష్ట పాత్ర, ప్రేమనగర్‌లో రాక్షసత్వం నిండిన పాత్ర… ఇవన్నీ నటిగా ఆమె బహుముఖీనతను నిరూపించాయి. ఏ నటుల సరసన ఆమె హీరోయిన్‌గా నటించారో అదే నటులకు తల్లిగా, వదినగా, అక్కగా ఎన్నో భూమికలను పోషించారు. 1939లో ”శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం”లో పద్మావతిగా నటించిన శాంతకుమారి 1960లలో అదే చిత్రంలో తల్లిగా, అంటే వకుళగా నటించారు. ఆ చిత్రంలోని చిరు చిరునగవుల చింతే తండ్రి, గోపాలా నందగోపాలా వంటి పాటలు ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. ఆ చిత్రం తమిళ అనువాదంలో శాంతకుమారికి పి.లీల పాడారు. అయితే హిందీ డబ్బింగ్‌ ‘భగవాన్‌ బాలాజీ’లో శాంతకుమారే స్వచ్ఛమైన ఉచ్ఛారణతో పాడారని విమర్శకులు అభినందంచారు. ఆ సినిమా తర్వాత 1962నాటి ‘సిరిసంపదలు’, 1967లో వచ్చిన ‘ప్రాణమిత్రులు’ వంటి చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. తల్లాపెళ్లామా?, చిన్ననాటి స్నేహితులు, రాముడు-భీముడు, జయభేరి, షావుకారు, గుడిగంటలు- ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమె హుందాగా నటించారు. సంప్రదాయ సంగీతంలో శిక్షణ పొందడంవల్ల ఎన్నో రాగాలు ఆమెలోని లయను నిద్ర మేల్కొల్పేవి. ముఖ్యంగా తోడి, శంకరాభరణం, భాగేశ్వరి వంటివి ఆమెను మౌనంగా ఉండనిచ్చేవి కావంటారు. 1980లలో ఓ పర్యాయం పి.పుల్లయ్య, శాంతకుమారి ఇద్దరికీ మద్రాసులో సన్మానం చేస్తూ వారిద్దరిని వేదిక మీదికి ఆహ్వానించినపుడు శాంతకుమారి గానం చేసిన ”మోహనాంగారారా” అనే గీతాన్ని లీలగా వినిపించారట. ఆ సన్నివేశం ఆనాటి సభికుల్లో చెరగనిముద్ర వేయడం ఒక విశేషమైతే… భార్యాభర్తలిద్దరూ సిగ్గుతెరల మధ్య నిశ్శబ్దంగా ఆనాటి సంగతుల్ని మననం చేసుకొని మురిసిపోవడం మరో విశేషం.
శాంతకుమారి తన పుట్టిన రోజైన మే 17న తన అభిమానుల ఇంట్లోనో, తనకు నచ్చిన వారింట్లోనో సంగీత నృత్యాల్లో గడిపే సంప్రదాయాన్ని కాపాడుకోవడం ఎంతయినా ప్రశంసనీయం పి.శాంతకుమారిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. సంగీతం పట్ల, నటనపట్ల, చిత్రకళపట్ల తనకున్న బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కానీ కేంద్రప్రభుత్వం మాత్రం ఒక్క ‘పద్మశ్రీ’ని కూడా ఇవ్వలేకపోయింది. ‘గుణసుందరికథ’లో పాటలాగా ఆమె ‘చక్కని దొరసాని’ (దొరవేలె చందమామా)!

చదవండి :  ‘విజయ’ సామ్రాజ్యాధీశుడు నాగిరెడ్డి - పులగం చిన్నారాయణ

ఇదీ చదవండి!

పాత కలెక్టరేట్

పాత కలెక్టరేట్ వయసు 132 ఏళ్ళు

కడప నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ పాత భవనాన్ని 1889 సంవత్సరంలో బ్రిటీషువారు నిర్మించారు. అంటే ఈ భవనం వయసు : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: