భారద్వాజస గోత్రీకుడు షేక్ బేపారి రహంతుల్లా!

1997 ప్రాంతంలో ఒకసారి వేంపల్లెకు పోయినప్పుడు అక్కడి గ్రంథాలయంలో ‘సాహిత్యనేత్రం’ అని ఒక కొత్త పత్రిక కంటబడింది. మంచి కథలు, శీర్షికలు, కవితలు ఉన్న ఆ పత్రిక కడప నుంచి వెలువడుతోందని తెలిసి చాలా సంబరపడ్డాను. ఆ తర్వాత కడపకు పోయినప్పుడు నగర నడిబొడ్డైన ఏడురోడ్ల కూడలికి అతిసమీపంలో ఉన్న ఆ పత్రిక కార్యాలయానికి వెళ్ళి సంపాదకుడిని కలుసుకుని పాత సంచికలన్నీ తెచ్చుకున్నాను. ఆ సంపాదకుడు శశిశ్రీ.

s

శశిశ్రీ
శశిశ్రీ

తర్వాత అప్పుడప్పుడూ నేత్రం ఆఫీసుకు వెళ్తూ ఉండేవాడిని. సాహిత్య నేత్రం పత్రిక అప్పటినుంచి కొన్నేళ్ళపాటు వెలువడలేదు. “నేత్రం ఎప్పుడొస్తుంది సర్?” అనడిగితే “నేత్రం తెరుచుకోవడం లేదు” అని ఒకసారి, “నేత్రానికి కలకలొచ్చినాయ్” అని ఇంకోసారి చమత్కరించేవారు. అప్పట్లో ఆయనకు ఒక యాడ్ ఏజెన్సీ కూడా ఉండేది. దాని పనులు చూసుకోవడం, ఆకాశవాణికి వార్తలు పంపడం – ఇవే అప్పట్లో ఆయన వ్యాపకాలు. ఆయనకు పెద్దగా పని ఒత్తిడి లేని ఆ రోజుల్లో కథల గురించి, మంచి కథ లక్షణాల గురించి, మంచి కవిత్వం గురించి, పత్రికల్లో వచ్చే కవిత్వం గురించి ఇలా చాలా విషయాలు చెప్పేవారు. ‘చదువరి’ శిరీష్ గారు ఒక తెలుగు వెబ్ మాగజైన్ పెడదామన్నప్పుడు “సరే” అనడానికి సరిపోయే ధైర్యాన్ని నాకు ఇచ్చింది శశిశ్రీ సాంగత్యంలో మంచి సాహిత్యం గురించి నేను తెలుసుకున్న విషయాలే. నేను ‘పొద్దు’ సంపాదకుడిగా ఉన్నరోజుల్లో, 2008లో శశిశ్రీ గారు ‘సాహిత్య నేత్రం’ పత్రికను కూడా అంతర్జాలంలో పాఠకులకు అందుబాటులోకి తేవాలని అనుకున్నప్పుడు ఆ బాధ్యతను నేను సంతోషంగా స్వీకరించాను. ఐతే నేత్రం సాఫ్ట్ కాపీల యూనికోడీకరణలో తలెత్తిన ఇబ్బందుల వల్ల, మరికొన్ని ఇతరత్రా కారణాల వల్ల అర్ధాంతరంగా ఆపెయ్యాల్సొచ్చింది.

చదవండి :  రెక్కలు (కథ) - కేతు విశ్వనాథరెడ్డి

తర్వాత్తర్వాత ఆయన ఆకాశవాణితోబాటు దూరదర్శన్ (ప్రసారభారతి) విలేకరిగా, యోగివేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడిగా, ఇతరత్రా బిజీ అయ్యారు. ఆయన వ్యాపకాలు పెరుగుతూ వచ్చేసరికి ఆఫీసుకు వచ్చిపోయేవాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అలా నేత్రం కార్యాలయంలోనే నాకు కడప నగర సాహితీవేత్తలు కొంతమందితో పరిచయం కలిగింది. పొద్దు.నెట్, పుస్తకం.నెట్ లాంటిచోట్ల నేను పుస్తక పరిచయాలు, సమీక్షలు రాసినప్పటికీ ఒక ప్రింట్ పత్రికలో నేను రాసిన ఏకైక పుస్తక సమీక్ష శశిశ్రీ కథల సంపుటి ‘దహేజ్’ గురించే కావడం ఇంకో విశేషం. కేతు విశ్వనాథరెడ్డి సారు “ఈభూమి” సంపాదకుడిగా ఉన్నరోజుల్లో ఆ సమీక్ష రాయించారు.

చదవండి :  రైళ్లకూ మొహం వాచిన రాయలసీమ!

ఒక సభలో కేతు విశ్వనాథరెడ్డి సారు ఒక సన్నివేశాన్ని ఇలా వివరించారు – శశిశ్రీ, ఆయనా కలిసి ఒకసారి ఒక దేవాలయానికి వెళ్ళారట. అక్కడి పూజారి గోత్రం చెప్పమంటే శశిశ్రీ తడుముకోకుండా “భారద్వాజస గోత్రం” అన్నారట. బయటికొచ్చాక విశ్వనాథరెడ్డి సారు అడిగారట “ఏం శశిశ్రీ, నువ్వు ముస్లిమువు కదా? నీది భారద్వాజస గోత్రమెట్లైంది?” అని. ఈయన తడుముకోకుండా “నేను పుట్టపర్తి  నారాయణాచార్యుల వారి శిష్యుణ్ణి. ఆయనది ఏ గోత్రమైతే నాదీ ఆ గోత్రమే” అని చెప్పారుట.

పుట్టపర్తివారి ప్రియశిష్యుడైన శశిశ్రీ శివతాండవం చాలా బాగా పాడేవారు. హైదరాబాదులాంటిచోట్ల సాహితీసభల్లో శివతాండవగానం మీద అప్రకటిత నిషేధం ఉన్నప్పటికీ కడప గడపలో శశిశ్రీ ధీరగంభీరంగా పాడేవారు.

చదవండి :  'శశిశ్రీ'కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి వ్యాసం

మొన్న అక్టోబర్లో ఒక సాయంత్రం వేరే పనిమీద బ్రౌన్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించారు శశిశ్రీ. అప్పటికే ఆరోగ్యం దెబ్బతిని ఉంది. కానీ ఉత్సాహంగానే కనిపించారు. జనవిజ్ఞానవేదికవాళ్ళు అదే బ్రౌన్ లైబ్రరీలో ఆరోజు ఉదయమే ఆవిష్కరించిన “ఆకాంక్షలు” అనే పుస్తకంలోని నా వ్యాసం చదివానని చెప్తూ, దాంట్లో ప్రాంతీయవాదం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. అదే నేను ఆయన్ను చివరిసారి కలవడం.

కడప గురించి అనుకున్నప్పుడు, అక్కడి ఏడురోడ్లకాడికి పోయినప్పుడు, నెలవంకను చూసినప్పుడూ శశిశ్రీ గుర్తొస్తూనే ఉంటారు.

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

తాళ్ళపొద్దుటూరు

‘తాళ్ళపొద్దుటూరు’లో ఏమి జరుగుతోంది?

2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14. 2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: