వన్ టౌన్ సర్కిల్

కడప రుచుల కేంద్రం వన్ టౌన్ సర్కిల్

నేను పెద్దగా రుచులు తెలిసినవాణ్ణి కాను. రుచుల విషయంలో నాది మా నాన్న తరహా. ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుందనే దాన్ని బట్టి కాకుండా ఎంత సులభంగా గొంతు దిగుతుంది, తిన్న తర్వాత ఎంత తేలిగ్గా అరుగుతుంది, అరిగాక వంట్లో ఏం చేస్తుంది అన్నదాన్ని బట్టే ఇష్టాయిష్టాలు ఏర్పడుతాయి :-).

మా అమ్మ మా చిన్నప్పుడు ఇంట్లోనే ఎప్పటికప్పుడు రకరకాల స్వీట్లు, ఇతర చిరుతిండ్లు చేసి పెట్టేది. ఊర్లో మిగతా పిల్లలు గువ్వలచెరువు (యెస్, పాలకోవాకు ప్రసిద్ధి చెందిన గువ్వలచెరువే. మధ్యలో కొండొకటే అడ్డంగానీ మా ఊరు కూడా గువ్వలచెరువు నుంచి ఉడుకుడుగ్గా రాగలిగినంత దగ్గర) నుంచి  “గువ్వలచెరువు కజ్జికాయల్, ఉడుకుడుకు ఉడుకుడుకు కజ్జికాయల్” అంటూ అమ్మొచ్చే కజ్జికాయలు అవి వచ్చినప్పుడు మాత్రం కొనుక్కు తింటుంటే మేం మాత్రం ఇంట్లో స్టాకు చేసి పెట్టిన మైసూర్ పాక్, లడ్లు, నిప్పట్లు, కజ్జికాయలు, పాలకోవా, వాటితో బాటు ఏ చక్కిలాలో, సన్న కారాలో, బుడ్డ కారాలో తినేవాళ్ళం.

తర్వాతి రోజుల్లో క్రమక్రమంగా మిగతా స్వీట్లు చెయ్యడం మానేసినా విచిత్రంగా అటు గువ్వలచెరువులోనూ, ఇటు మా ఇంట్లోనూ పాలకోవా మాత్రం నిలబడింది. మా తరం దాటి మా పిల్లల తరంలో కూడా మా అమ్మా వాళ్ళు చేసే పాలకోవాయే ఫేవరెట్ స్వీటు. మొదట్లో నేనొక్కడినీ కడపకు పోయినప్పుడల్లా మా అమ్మా వాళ్ళు ఉడుకుడుగ్గా చేసిచ్చే కోవా తెచ్చేవాన్ని. దాంతో మా పిల్లలకు ఆ కోవా కోసం ఎదురుచూడడం అలవాటైంది.

ఆ తర్వాత కొంతకాలానికి ఊర్లో సమయానికి పాలు దొరక్కపోవడం, ఇతరత్రా కారణాల వల్ల మా అమ్మా వాళ్ళు కోవా చెయ్యడం కుదర్లేదు. ఒకసారి పేరున్న స్వీట్ షాపులో కోవా బిళ్ళలు తీసుకొస్తే మా పిల్లలు “మేమడిగింది ఇది కాదు” అని వేలు కూడా పెట్టలేదు. అప్పుడు ‘ఇక తప్పదు, గువ్వలచెరువు కోవా ప్రయత్నించాల్సిందే’ అనిపించింది. కానీ అది అనుకున్నంత సులభం కాదు. అలాంటిది నా వెతుకులాట అనుకోకుండా వన్ టౌన్ సర్కిల్ దగ్గర ఫలించింది.

చదవండి :  'సాహిత్య విమర్శ'లో రారాకు చోటు కల్పించని యోవేవి

నన్నారి షర్బత్ & లస్సీ : దాదాపు ఆ రోజుల్లోనే మా అన్న నాకు ఒకసారి అలంకార్ లస్సీని పరిచయం చేశాడు. ఒకసారంటే ఒకసారి కాదులెండి, రెండు మూడు సార్లు – అంటే, ఒకసారి లస్సీ, ఇంకొకసారి షర్బత్ అలా అన్నమాట. వై.వి.స్ట్రీట్ ఎంట్రెన్స్ దగ్గరున్న అలంకార్ లస్సీ & ఐస్ క్రీమ్స్ లో లస్సీ, షర్బతులు తాగించి “ఇక్కడ లస్సీ, షర్బత్ బాగుంటాయి, షర్బత్ బాటిళ్ళు కూడా దొరుకుతాయి” అని చెప్పాడు. మా చిన్నప్పుడు వేంపల్లెలో మా సిన్నమ్మ నన్నారి వేర్లు తెప్పించి, వాటి నుంచి షర్బతు తయారుచేసి బాటిళ్లలో నింపిపెడుతూండేది. మేం వేంపల్లెకు పోయినప్పుడల్లా దాంతో రోజూ షర్బత్ చేసిస్తూండేది. ఈ రెడీమేడ్ బాటిళ్లతో ఆ వేర్లను కాచి షర్బత్ తయారుచేసుకోవలసిన శ్రమ అవసరం లేదన్నమాట. అప్పట్నుంచి అలంకార్లో రెగ్యులర్గా షర్బత్ బాటిళ్ళు తెచ్చుకుంటున్నాను (లాక్ డౌన్ మొదలవకముందు).

కడప కోవా : ఒక ఎండాకాలంలో బెంగళూరుకు తెచ్చుకోవడానికి అలంకార్ లో నన్నారి బాటిళ్లు తీసుకుంటూ షాపతన్ని పాలకోవా ఎక్కడ దొరుకుతుందని అడిగితే అతనికి ఎందుకనిపించిందో తెలియదు గానీ “ఇక్కడే తినడానికా లేక ఊరికి తీసుకుపోవడానికా?” అని అడిగాడు.

“ఊరికి తీసుకుపోవడానికే” అని చెప్పాను.

“ఐతే సాయంత్రం ఇదే లైన్లో ఆ పక్కకు ఒక బండి వస్తాది” అని వివరాలు చెప్పాడు. అక్కడొక చిన్న రూముంది. స్వీట్లమ్మే నాలుగు గాన్ల (చక్రాల) బండి కూడా పూర్తిగా పట్టనంత చిన్నది. బండి లేనప్పుడు షట్టర్ మూసి ఉంటుంది. అక్కడ బోర్డేమీ ఉండదు. అక్కడికి రోజూ సాయంత్రం నాలుగ్గంటలకల్లా స్వీట్ల బండి వస్తాది. ఆ బండిమీద దొరికింది మా పిల్లలు మెచ్చిన కోవా!! ఈ కోవాకు, గువ్వలచెరువు కోవాకు రంగు, రుచి, చిక్కదనాల్లో తేడా ఉంది. ఈ మూడు లక్షణాల్లోనూ కడప కోవా మా అమ్మ చేస్తూండిన కోవాకు దగ్గరగా ఉంటుంది. ఆ బండి మీద కోవాతో బాటే అన్ని రకాల స్వీట్లు, కారాలు కూడా దొరుకుతాయి. విశేషమేమిటంటే ఆ బండి రాగానే కస్టమర్లతో అక్కడొక చిన్న గుంపు ఏర్పడుతుంది (కడపలో పద్ధతిగా క్యూ ఏర్పడాలనుకోవడం అత్యాశ ;-). అందులోనూ ఆ బండి దగ్గర)!

చదవండి :  వై విజయ (సినీ నటి) ఇంటర్వ్యూ

కడప కారెందోసెలు : అలంకార్ నుంచి తూర్పు దిక్కున కోవా బండి ఉంటే పడమటి దిక్కున దాదాపు నూరు మీటర్ల దూరంలో ఉంది చెన్నూరు బస్టాండ్. కడప కారం దోసెలకు ప్రసిద్ధి చెందిన రోశయ్య టిఫెన్ సెంటర్ ఉండేది అక్కడే. సోషల్ మీడియాలో ఫొటోలు తప్ప నేరుగా ఈ టిఫెన్ సెంటర్ నేనింత వరకు చూడలేదు.

కడప కవటాకులు : తమలపాకులకు దేశవ్యాప్తంగా కడప ప్రసిద్ధి. కడప రైల్వే స్టేషన్ నుంచి తమలపాకులు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతాయి. మా తాతవాళ్ల తోటలోని ఆకులు గుజరాత్ లోని “బరవాడకు” (బరోడా/వడోదరా) వెళ్ళేవి. లేత తమలపాకులను కవటాకులు అంటారు. తాంబూల సేవనానికి ఉత్తమమైన ఈ కవటాకులు వై.వి.స్ట్రీట్ మొదట్లోను, లోపల కూరగాయల మార్కెట్లోను దొరుకుతాయి.

అడవి పండ్లు : అంటే రేగుపండ్లు, ఈతపండ్లు, బలుసపండ్లు మొదలైనవన్నమాట. సీజన్లో రేగుపండ్లు ఎక్కడైనా దొరుకుతాయిగానీ ఈతపండ్లు రెగ్యులర్గా కాకపోయినా ఎక్కువగా అలంకార్ ఎదురుగా వాహనాలు నిలిపేచోటగానీ అక్కడికి దగ్గర్లోనే కళాక్షేత్రం ముందు గానీ దొరికే అవకాశం ఉంది. బలుస పండ్లు రైతుబజార్లో దొరుకుతాయని ఎవరో చెప్పారు. ఈసారి కడపకు పోయినప్పుడు ప్రయత్నించాలి. ఇంకా మేం చిన్నప్పుడు తిన్న కొన్ని అడవి పండ్లు బిక్కి పండ్లు, కలే పండ్లు, కుందేరుకొమ్ములు, కాకి పండ్లు. చివరి రెండూ ఎవరూ అమ్మరుగానీ మిగతావి ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవాలి. (బిక్కిపండ్ల గురించి సగిలేటి మొగలాయి బత్తుల ప్రసాద రావు గారి మాటల్లో: “మాగిన వెలగ పండుకు ఉన్న మాధుర్యం దీని సొంతం. అడవిలోని దుప్పులకు, కోతులకు, కుందేళ్లకు ప్రధాన ఆహారం. వర్షాలు బాగా కురిసి పనులు దొరకని కాలంలో వీటిని అడవి నుంచి సేకరించి ఊళ్ళల్లో అమ్ముతారు. గుజ్జును సేకరించి దాంట్లో కాస్త బెల్లం కలిపి కాసిన్ని నీళ్ళు పోసి కుండ మీద వుడకబెట్టి ముద్దగా తయారు చేసి తింటే అబ్బా… దాని రుచే వేరు సామీ… నల్లమల అడవిలో ఇట్లా చెంచులు తయారు చేసినప్పుడు తిన్న అనుభవం… జీవిత మాధుర్యాన్ని అనుభవించాలాంటే ఇలాంటివి రుచి చూడాల్సిందే”: https://www.facebook.com/bathulaprasada.rao/posts/10213835924132359)

చదవండి :  ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

అట్లా మధ్యలో నన్నారి షర్బత్ & లస్సీ, దానికి నాలుగు పక్కలా 1. కారం దోసెలు, 2. కోవా, 3. అడవిపండ్లు, 4. తమలపాకులతో వన్ టౌన్ సర్కిల్ కడప రుచులకు కేంద్రస్థానంగా చెప్పవచ్చు. వై.వి. స్ట్రీట్లో ఇంకేమైనా ఉన్నాయేమో నాకు తెలీదు :-)!

ఇంకొక విషయం: మొన్నటిదాకా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండడం వల్ల దీన్ని వన్ టౌన్ సర్కిల్ అంటున్నాంగానీ ఆ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు అక్కడ లేదు.

పైన ఫొటోలో ఉన్నది వన్ టౌన్ సర్కిల్. ఎడమ పక్కన SBI కిందున్నదే అలంకార్. కుడి పక్కన చిట్టచివర, బాంబే రెడీమేడ్స్ కు అటుపక్కనున్నది స్వీట్స్ బండి.

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో (వికీపీడియా సహా) వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. ‘ఈ-మాట’ అంతర్జాల పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

బస్సు ప్రయాణం

తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’

మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: