వండాడి శాసనము

వన్డాడి (వండాడి) శాసనము

శాసనము : వండాడి శాసనము

ప్రదేశం : వండాడి, రాయచోటి తాలూకా

శాసనకాలం: ఎనిమిదవ శతాబ్దం

రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను. వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక), కలకడ (వాయల్పాడు తాలూక) నగరములు కూడ వీరికి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె వైదుంబులు కూడ తెలుగు మాట్లాడు రాజవంశమువారు. వీరి శాసనములనేకము తెలుగు లోను కొన్ని కన్నడములోను కలవు. వాటిలో అధిక భాగము యుద్ధములను గూర్చి బేర్కొనుచు అందు మృతినొందిన వీరుల స్మారకములుగ వేయించబడిన వి.వీటినిబట్టి యుద్ధ ప్రియులగు రాజులని తెలియుచున్నది.9,10 శతాబ్దు లలోని వీరిశాసనములు ప్రాచీన శాఖకు చెందినవి.11,12 శతాబ్దులవి ఆర్వాచీన శాఖకు చెందిన రాజులని చరిత్ర కారులు చెప్పుదురు.ఈ రాజుల చరిత్ర నిర్మాణమునకు తగిన శాసన సామగ్రి యింకా కభించక పోవుటచే వీరి ఉభయ శాఖల చరిత్ర సరిగా తెలియదు.

ప్రాచీన వైదుంబులు బాణరాజులతో కలసినోళంబ,గంగ,చోళ రాజులపై యుద్ధము లనేకము చేసిరి. అట్టి యుద్ధములలో సుమారు క్రీ.830 ప్రాంతములో జరిగిన సొరమే డి యుద్ధమతి ముఖ్యమైనది.ఈ సమరములలో ననేక వీరులు మరణించి నట్లు శాసనములనుబట్టి తెలియుచున్నది.పెనుకొండ తాలూకాలోని చోళెమరి యనునది ‘సొరమెడి’యగునని నిర్ణయించిరి.ముదిమడువను వేఱొక గ్రామము వద్ద కూడ యుద్ధము జరిగెను.వైదుంబ మహారాజు గణ్డత్రిణేత్రుడిందు పాల్గొనెను. ఈ క్రింది శాసనము అతని సేనాపతియు వైదుంబాన్వయమునకు చెందినట్టియు కలిగ త్రిణేత్రుడను రాజు రేనాంటి పోదన్డు(డ=θ)రవద్ద యుద్ధములో మృతినొందినట్లే క్రిందిశాసనమున కలదు.

చదవండి :  కలమళ్ళ శాసనము

వండాడి శాసనము :

స్వస్త అనేక సమర సంగట్టణో
పల్ధ(ఫల)జయలక్షుమీ సమలింగిత
వక్షస్త[ళ]కలిగె త్రిణేత్ర శ్రీసింగ
[మర]సేనాపతి వీరమహార(రా)జ స్వస్తి శ్రీ మహా
ర(రా}జు రేనాణ్టి పోదన్డ(డ=θ)ర స్వగ్గ೯ంబెక్కిన కణ్ణ-
నూఱు అణివెట్టి కీఱుగుణ్టసొ[చ్చి]
రి[I*]గణ్డ త్రిణేత్రున్డు(డ=θ)కల్చి పుల్కవే
ళ్పు సాసనంబు ఇచ్చె.ఎణ్భయి
వెట్టి పురి[పురాచ]వెట్టిరి[|]కణ్ణ నూడ్ల(డ=θ)
గొలంబున వరికి వయ్ధుంబ వసంబున వారు[దే]నికి
వక్రంబు వచ్చినవాన్డు(డ=θ)వారణాసి పాఱను కవిలళాను ఱచ్చిన
వన్డు(డ=θ)[|]గట్టులి[ఖి*]తమ్[||]*

‘అనేక సమర సంఘట్టనో పలబ్ధ జయలక్ష్మీ సమాలింగిత వక్షస్థల’అనునది వైదుంబ రాజుల ప్రశస్తి. ఇచట చనిపోయినది, వైదుంబాన్వయమున రాజపుత్రుడును,యువ రాజును కావచ్చును. కనుక ఆ ప్రశస్తి యితనికి చెప్పబడెను. అతని పేరు కలిగె త్రిణేత్రుడు.సంగ[మర],సేనాపతి వీరమహారాజు అని అతని బిరుదనామములు. అతడు రేనాడులోని పొదన్డు(డ=θ)ర (స్థలముపేరు)వద్ద మరణించెను.రేనాటి రాజుల రాజధాని పొదిలి యనునది యొకటి కలదు.అచట ఈతడు యుద్ధమున మరణించి యుండును లేక ఈ శాసనమున్న ‘వన్ధడి’ పొదన్డి(డ్=θ)దాని వికృతియయినను కావచ్చును. స్థల నామమని చెప్పుటయే యుక్తమని తోచుచున్నది.’పొదన్డుర(θ)’అనుపదములో ‘ఊర’అని తుదివర్ణము పలుక వీలగుచున్నది.’రేనాంటి’అని ముందున్నది. కనుక రేనాంటిలోని’పొదండి’యునుచోట అనిచెప్పిన బాగుండునని తోచుచున్నది. అచట యుద్ధమున కలిగె త్రిణేత్ర సేనాపతి మరణించగా,అతనిని ఖననము లేక దహనము చేయునప్పుడు అతనితోపాటు కీఱుగుణ్ట సొచ్చినవాడు కణ్ణవూద్లు అనువాడు.

చదవండి :  పెద్దపసుపుల - దానవులపాడు (కురుమరి) పొలిమేర కొట్లాట

రాజులుగాని,యువరాజులుగాని యితర ముఖ్యులుగాని చనిపోయినపుడు వారి దహనమప్పుడుగాని లేక ఖనమప్పుడుగాని మరియొక సజీవునికూడ ఆ మృతదేహముతో కలిపి తుది సంస్కారము చేసెడివారు.సహగమనములో భార్యయే అట్లు భర్త యొక్క మృతదేహము ననుసరించిపోయెడిది. ఇచట అట్లుకాక రాజకళే బరముతో వేఱొకనిని బలవంతముగ జంపువారు.’రాచ పీనుగ తోడు లేనిదే పోదు’ అనెడి సామెతకు ఇదియే మూలము. యుద్ధములందు చనిపోయిన రాజులకు మాత్రమే యిట్లు చేసెడివారో లేక సామాన్యముగ రాజులెట్లు చనిపోయినను చేసెడివారో తెలియదు.ఇప్పటికి మనకు తెలిసిన ఆధారములనుబట్టి యుద్ధమృతులగు రాజులకే యూ కీఱుగుణ్ట సంస్కారము జరిగెడిదని తెలియుచున్నది.ఇట్టి శాసనములు మఱి కొన్నిగలవు.

ప్రస్తుతమున కణ్ణనూద్లు అనువ్యక్తి సజీవుడుగనే త్రినేత్రుని మృతదేహముతో కలిపి కీఱుగుంట (అనగా రెండు విధములగు శరీరములను కలిపి గుంటలో పాతిపెట్టబడు) సంస్కారమును పొందెను.ఈ సందర్భమున మృతుడగు రాజుయొక్క వస్త్రములు ,అలంకారములు మున్నగునవి యీ సజీవవ్యక్తికి తొడిగి ఆ వేషముతో నతనిని మృతదేహముపై గూర్చుండబెట్టి పూడ్చెడి వారు. అణివెట్టుట అనగా ఈ యర్థమే కావచ్చును. కిటెల్-కన్నడ నిఘంటువులో అణి=to come near:to touch,etc.to put on jewels and ornaments, toembellish అని యున్నది. మృతదేహమునకు అలంకారముండదు గనుక జీవదేహమునదిచేసి తృప్తిపడుట దీని ఉద్దేశ్యమై యుండును.

చదవండి :  మాలెపాడు శాసనము

ఇట్టి త్యాగము చేసినందులకు ప్రతిఫలముగ వాని సంతతి వారికి మాన్యము లిచ్చెడి వారు. ఈ శాసనమట్టి మాన్యమును తెలుపుచున్నది. రెండవ భాగమున రాజగు గణ్డత్రిణేత్రుడు కల్చి(కాల్చి)(దహనమే జరిగేననిపించుచున్నది) పుల్కవేళ్ళు (=పునుక తాలుపు?) అనగా యుద్ధములందు మారణక్రియకు ఆధి దైవము. వీర మరణము బొందువారికి ఆవేల్పుపేర సాసనమిచ్చుట, ఆ వేల్పుపేర పూజ సేయుట, మున్నగునవి కలవు. పుల్కవేల్పుని సేవించుట ఆచారము తరువాత మైలార, బేతాళ దేవులను సేవించుట యైనది.ఇది వీరుల మారణ హోమమునకు సంబంధించిన తంతు. సొరమేడి యుద్ధమున చనిపోయిన వీరులనేకులకు ఇట్టి సంస్కారములు చేయబడి యుండును. రెండు,మూడు శాసనములట్టివి కనిపించుచున్నవి. ప్రస్తుతము ఎణ్బయి(మర్తురులు)కీఱుగుంట సొచ్చినవాని వారికిచ్చి పురివు(=అర్థమగుట లేదు)రాచవెట్టిరి. గణ్డత్రిణేత్ర వైదుంబ మహారాజు రాచమర్యాదలతో కాల్చిరి అని యర్థము.’ పురిపు’అనుచోట అక్షరములు సందిగ్ధ ముగ నున్నవి.’చితి’ యను అర్థము గల పదమగుననిపించుచున్నది. తరువాత వాక్యములో,కీఱుగుంట సొచ్చిన కణ్ణనూడ్ల(డ-θ)వంశము వారికి వైదుంబ మహారాజులు వనంబున ఉందురు. అనగా కృతజ్ఞలుగా నుందురు. ఈ మాన్యమును చెడగొట్టువారు వారణాసిలో బ్రాహ్మణుని,గోవులను చంపినవారు. గట్టులితమ్ అనితుది లో వ్రాసినవాని పేరేమో స్పష్టముగ లేదు. ఇట్టిదే మఱియొక శాసనము అచటనే కలదు.

– జివి పరబ్రహ్మ శాస్త్రి
(తెలుగు శాసనాలు (1975), ప్రపంచ తెలుగు మహాసభ ప్రచురణ నుండి)

ఇదీ చదవండి!

tirunaalla

రేపటి నుంచి మల్లూరమ్మ జాతర

రాయచోటి: చిన్నమండెం మండల పరిధిలోని మల్లూరమ్మ జాతర గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: