రెండు జిల్లాల కోస్తా ప్రభుత్వానికి రుణపడాలి

రెండు జిల్లాల కోస్తా ప్రభుత్వానికి రుణపడాలి

విభజన తరువాత తెదేపా ప్రభుత్వ దాష్టీకాన్ని చూస్తూ మదనపడిన సీమవాసులు బాబు గారు విడుదల చేసిన చీకటి జీవో 120 కారణంగా ఇప్పుడు నిరసన గళాన్ని వినిపించేందుకు స్వచ్చందంగా వీధుల్లోకి వస్తున్నారు.

సీమకు జరుగుతున్న మోసాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా తొక్కిపెట్టినా,కోస్తా వారి ఆధిపత్యంలో కొనసాగుతున్న మీడియా సంస్థలు ఒక ప్రాంతం కోసమే విలపిస్తున్నా, ప్రభుత్వం బరి తెగించినా…స్థానిక నాయక గణాలు, విపక్షాలు నోరు మెదపకపోయినా, గుంపులు గుంపులుగా/సంస్థలుగా ఉద్యమకారులు విడిపోయినా…ఇప్పుడు అంతా ఒకే ఆకాంక్షతో బయటికొస్తున్నారు.

తిరుపతి వేదికగా పోయిన శనివారం కదం తొక్కిన విద్యార్థి సంఘాలు వాడిన ఘాటైన పదజాలం మీడియా చెవులకు వినపడకపోయినా, ప్రభుత్వానికి కనపడక పోయినా  చేరాల్సిన వారికి చేరింది. యావత్తు సీమ ఇప్పుడిప్పుడే చైతన్యమవుతోంది. ఆ చైతన్యానికి సజీవ సాక్ష్యంగా వారికి తెలంగాణ కనిపిస్తోంది. రేపటి తరంలో అదో కొత్త ఆకాంక్షను రగులుస్తోంది. ఇన్నాళ్ళూ జనాలను జోకోట్టిన పార్టీలు, నాయకులు ఇప్పుడు ఈ సెగను గుర్తించారు. ఉద్యమం పూర్తిగా ప్రజల చేతుల్లోకి వెళితే పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే వారు ప్రజలతో గొంతు కలుపుతున్నారు. ఫలితమే కాంగ్రెస్, వైకాపా నాయకుల ప్రెస్ మీట్లు, వామపక్షాల పోరాటాలు. మూడు రోజులలోనే తేడా సుస్పష్టం.

చదవండి :  జీవో 120కి నిరసనగా హైకోర్టులో న్యాయవాదుల నిరసన

ఉద్యమకారులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్నారు. భవిష్యత్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాయలసీమ జనార్ధన్, బొజ్జా దశరధరామిరెడ్డి, నవీన్, లెక్కల వెంకటరెడ్డి, అశోక్, రాధారావు, హరినాధరెడ్డి అప్పిరెడ్డి, శ్రీనివాసరెడ్డి గోపిరెడ్డి, ఆదిమూలం శేఖర్, మల్లెల భాస్కర్, దస్తగిరి, అరుణ్, శివ రాచర్ల, తిరుమలప్రసాద్, మదన్, శ్రీకాంత్ సొదుం లాంటి సామాన్యులు ఉద్యమ గొంతుకలవుతున్న చిత్రం సుస్పష్టం. వీరిలో ఎవరికీ ఈ రాజకీయ పక్షాలతో అనుబంధాలు లేవు. వీరంతా రేపటి తరం సీమ అన్ని ప్రాంతాలకు ధీటుగా ఎదగాలని నిండైన ఆత్మవిశ్వాసంతో  ఆకాంక్షిస్తున్నవారే. ముదిమి మీద పడుతున్నా సీమ కోసం గొంతెత్తున్న జస్టిస్ లక్ష్మణరెడ్డి, భూమన్, డాక్టర్ గేయానంద్  లాంటి వాళ్ళు ఈ సామాన్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ మధ్య అనంతపురం జిల్లాకు చెందిన రచయితలు ముందుండి రాయలసీమ రచయితలతో ఏర్పాటైన ‘రాయలసీమ మహాసభ’ ఎందుకో మరి స్తబ్దుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ఆ మహాసభ తరపున బలమైన గొంతుక వినపడినట్లు గుర్తు లేదు.

చదవండి :  జీవో120ని తక్షణమే ఉపసంహరించుకోవాల...

ముందు నుంచీ రాయలసీమవాణిని బలంగా వినిపిస్తూ విద్యార్థులను చైతన్యం చేస్తున్న ‘రాయలసీమ విద్యార్థి సమాఖ్య’ (RSF) అన్ని జిల్లాలలో, తాలూకాలలో బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంత అస్తిత్వం కోసం తపన పడుతున్న ఈ విద్యార్థుల సంఘం రాబోయే రోజుల్లో సీమ ఉద్యమాలకు ఊపిరి కానుంది.

జీవో 120 రద్దయ్యేదాకా రాజధాని ముసుగులో ఒకే ప్రాంతానికి జరుగుతున్న పందేరం ఆగి అభివృద్ది వికేంద్రీకరణ జరిగేదాకా, నీటి వాటాలు తేలేదాకా ఈ సెగ తగ్గకపోవచ్చు. ఇంతటి చైతన్యాన్ని, ఆవేశాన్ని, అసంతృప్తిని ఒక్క ఏడాది కాలంలో రగల్చడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు సీమ ప్రజలు రెండు జిల్లాల కోస్తా ప్రభుత్వానికి… కాదు కాదు తెదేపా ప్రభుత్వానికి రుణపడాలి.

చదవండి :  కడప గడపలో సీమ ఆకలి 'కేక' అదిరింది

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *