రాయలసీమ కథా సాహిత్య ప్రాభవ వైభవాలు -డాక్టర్ వేంపల్లి గంగాధర్

రాయలసీమలో వైవిధ్య భరితమైన సాహిత్య ప్రాభవ వైభవాలు  కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అల్లసాని పెద్దన, ప్రజాకవి వేమన, కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం, పదకవితా పితామహుడు అన్నమయ్య వంటి మహానుభావులు ఎందరో ఈ ప్రాంతంలో సాహితీ సేద్యం చేశారు. కవిత్వం, అవధానం, నవల, విమర్శ, కథ వంటి సాహితీ ప్రక్రియలన్నీ ఆనాటి పునాదుల పైనే నిర్మితమవుతూ వచ్చాయి.

ఆధునిక కథా సాహిత్యం 1901లో బండారు అచ్చమాంబ రాసిన ధనత్రయోదశి కథతో ప్రారంభమైందని భావిస్తే, రాయలసీమలో మొదటి కథ 1941 వరకు పుట్టనే లేదు. కథ కోసం సీమ ప్రాంతం 40 సంవత్సరాలు ఎదురు చూడక తప్పని పరిస్థితులు.1941 మార్చి 26న ప్రచురితమైన అనంతపురం జిల్లాకు చెందిన జి. రామకృష్ణ రాసిన చిరంజీవికథ మొదటికథగా వెలుగులోకి వచ్చిం ది. సీమలో ఆధునిక జీవితమే ఆలస్యంగా మొదలు కావడం ఇందుకు మరో కారణం.

మొదటితరం కథకులు: రాయలసీమ నుంచి కథారచయితలుగా కీర్తి పొందిన ‘మొదటితరం కథకులు’ మధ్యతరగతి జీవితాలను కథావస్తువులుగా స్వీకరించి కథలను నిర్మింతం చేశారు. ఆర్ధికంగా మారుతున్న జీవన వైరుధ్యాలను కథాంశాలుగా మార్చారు. 1941 నుంచి 1970 వరకు కె. సభా, జి. రామకృష్ణ, మధురాంతకం రాజారాం, రాచమల్లు రామచంద్రారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, సోదుం జయరాం, వల్లంపాటి వెంకట సుబ్యయ్య, పి. రామకృష్ణారెడ్డి, కలువకొలను సదానంద, పులికంటి కృష్ణారెడ్డి, భారతం నాదమునిరాజు, ముంగర శంకర రాజు తదితరులను పేర్కొనవచ్చు. కథాశిల్పంపై రాచమల్లు రామచంద్రారెడ్డికి ఉన్న పట్టు, నమ్మకం ఎటువంటిదో వారి ‘అలసిన గుండెలు’ కథా సంకలనంలోని కథలు చదివితే అర్ధమవుతుంది. మధ్యతరగతి జీవితాల్లోని మార్పులను కేంద్రంగా స్వీకరించి అత్యుత్తమ కథలకు ప్రాణం పోశారు. తన కథల గురించి తానే రాసుకున్న వ్యాసాన్ని చదివితే రారా దృష్టిలో కథఃటే ఎంతటి బలమైన సాధనమో మనకు విశదమౌతుంది.
తర్వాత మనకు అదే స్థాయిలో శక్తిమంతమైన కథకుడిగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కన్పిస్తారు. వీరి జప్తు, ఇచ్ఛాగ్ని, అమ్మవారి నవ్వు కథాసంకలనాల్లోని కథలు ప్రపం చ స్థాయి కథానికల కోవకు చెందినవిగా చెప్పుకోవచ్చు. పీర్లసావిడి, గడ్డి, దాపుడుకోక, జప్తు, ఇచ్ఛాగ్ని, నమ్ముకున్న నేల, విరూపం కథలు చారిత్రాత్మకమైన హోదాను కలిగి ఉండి పాఠకుడి మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని ఏర్పరచుతాయి. బలమైన కథా మూలాల్లోంచి పాఠకుడు సాంఘిక, సామాజిక చరిత్ర కోణాన్ని చూస్తాడు.
తర్వాత చిత్తూరు జిల్లానుంచి కథలందించిన కె. సభా స్థానికత, ప్రాంతీయతకు పట్టం కట్టారు. వీరు దాదాపు 300కు పైగా కథలు రాసినట్టు తెలుస్తోంది. వాటిలో కొన్ని- బంగారు, పాతాళగంగ, నీటి దీపాలు పేరుతో కథాసంకలనాలుగా వచ్చాయి. వీరు పిల్లల కథలు కూడా ఎన్నో రాశారు. ‘దామల చెరువు పెద్దాయన’గా గుర్తింపు పొందిన మధురాంతకం రాజారాం చిన్న వయస్సులోనే ‘వీరోచిత వర్తకం’ అనే కథ రాశారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఎదురైన అనుభవాల ఆధారంగా ఎన్నో పాత్రకలు రూపం పోసి కథలు రాశారు.
వర్షించిన మేఘం (1961), తాను వెలిగించిన దీపాలు (1963), పునర్నవం (1968), కళ్యాణ కంకిణి (1968), కమ్మ తెమ్మెర (1968), వక్రగతులు (1968), వగపేటికి (1977), వినోద ప్రదర్శనం (1978), రేపటి ప్రపంచం (1975), నిర్వచనం (1995), పాఠశాల (1993), హాలికులు కుశలమా (1994), కూనలమ్మ కోన (1995), కథా సంపుటాలు వెలువడ్డాయి. సీమ కథకు కొత్త అర్ధం చెప్పిన కథకులుగా మధురాంతకం పేరొపొందారు. కడప జిల్లాకు చెందిన సోదుం జయరాం అపారమైన జీవితానుభవం ఉన్న రచయిత. వాడిన మల్లెలు, సింహాద్రి స్వీట్‌ హోం, సోదుం జయరాం కథలు అనే మూడు కథా సంపులాలు వెలువడ్డాయి. కొకు, రారా వంటివారి ప్రశంసలు అందుకున్నారు వీరు.
వాడిన మల్లెలు శీర్షికతోనే జయరాంతో పాటు రారా, ఆర్‌. వెంకటేశ్వరరావు (ఆర్వియార్‌) కూడా సంవేదన పత్రికలోనే వేర్వేరు దృక్కోణాలతో కథ రాసి ప్రయోగం చేశారు.

చదవండి :  మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

అలాగే పెన్నేటి కథలు, మనిషీ- పవువూ కథా సంపుటాల ద్వారా పి. రామకృష్ణారెడ్డి సీమ కథలకు అక్షర రూపం ఇచ్చారు. కడప మాండలికంలోని యాస, వేగం, కారుణ్యాన్ని వీరి కథల్లో చూడొచ్చు. విమర్శకుడిగా గుర్తింపు పొందిన వల్లంపాటి వెంట సుబ్యయ్య 1962లో ‘అన్యధా శరణం నాస్తి’ కథ ద్వారా కథకుడుగా కూడా సాహిత్యరంగానికి పరిచయమయ్యారు. రైల్వేలో ఉద్యోగిగా ఉంటూ ‘గూడు కోసం గువ్వలు’ కథ ద్వారా పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లానుంచి ముందుకొచ్చారు. కోటిగాడు స్వతంత్రుడు, పులికంటిథావాహిని, పులికంటి దళిత కథల ద్వారా సీమ కథా సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను పులికంటి సాధించారు.
వస్తువులో నవ్యత్వం, శిల్పంలో వైవిధ్యంతో కలువ కొలను సదానంద (చిత్తూరు జిల్లా) పిల్లల పుస్తకాలతో పాటు, రక్తయజ్ఞం (1965), పైరు గాలి (1967), ఓండ్రింతలు (1975), నవ్వే పెదవులు- ఏడ్చే కళ్ళు (1975), రంగు రంగుల చీకటి (1995), అనే ఐదు కథా సంపుటాలు వెలువరించారు.

చదవండి :  ముక్కొండ కథ

రెండవ తరం కథకులు: 1970 నుంచి 1995 వరకు సీమ నుంచి రెండవ తరం కథకులు రంగ ప్రవేశం చేశారు. వీరు రైతులకు సంబంధించిన ఇతివృత్తాలతో పాటు కరవు, గ్రామీణ కక్షలు (ఫ్యాక్షన్‌), వ్యవసాయ సంక్షోభాల పైన విస్తృతంగా కథలు రాశారు. సామాజిక చరిత్రను నమోదు చేశారు. ఇనాక్‌, సింగమనేని నారాయణ, నామిని సుబ్రహ్మణ్య నాయుడు, ఎంవిఆర్‌, శశిశ్రీ, డా కేశవరెడ్డి, మధురాంతకం నరేంద్ర, మహేంద్ర, చిలుకూరి దేవపుత్ర, శాంతి నారాయణ, రాసాని, దాదా హయత్‌ తదితరులను రెండవ తరం సీమ కథకులుగా పేర్కొనవచ్చు. మార్క్సిస్టు తాత్వికత కోణం నుంచి ఆధునిక సీమ కథకు శ్రీకారం చుట్టిన కథకులు సింగమనేని నారాయణ. జూదం (1988), కథలు (1999) పేర్లతో రెండు సంపుటాలు వచ్చాయి. వీరి మొదటి కథ 17 ఏళ్ళ వయస్సులో రాసిన ‘న్యాయం ఎక్కడ?’ 1960 జూలై 2న ఒక పత్రికలో ప్రచురితమయింది.
ఉచ్చు, ఊబి, అడుసు, ఫిరంగిలో జ్వరం, అగాధం, మకర ముఖం, నిషిద్ధం, హింస కథలు మళ్ళీ మళ్ళీ చదవాలనే భావనను కలిగిస్తాయి. మానవ సంబంధాలను ఆవిష్కరించే కథలుగా వీరి కథలు గుర్తింపు పొందాయి. ఎనిమిది కథా సంపుటాలు వెలువరించడం ద్వారా కీర్తి పొందిన కొలకలూరి ఇనాక్‌ ఊరబావి (1983), సూర్యుడు తలెత్తాడు (1988), కట్టడి (2007) కథాసంపుటాల్లోని కథలు దళిత కోణం నుంచి సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. దళిత కథళకు కొత్త ఊపిరిగా, కుల వివక్షను, సాంఘిక దోపిడీని, జీవన సంఘర్షణను వీరు కథల్లో బలంగా చిత్రించారు. చిలుకూరి దేవపుత్ర ఆరు గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు, బందీ, వొకర టింకర ఒ కథలు విలువైనవి. బండి నారాయణ స్వామి ‘వీరగల్లు’ కథా సంకలనం ప్రకటించారు.వీరి చమ్కీదండ, పద్దపాదం, రంకె, పల్లె మాదిగ, సావుకూడు, నీళ్ళు, నడక, ఇరుసు… వంటి కథలు ప్రతిష్ఠాత్మకం. శక్తిమంతమైన కథలు రాసిన కథకుడు స్వామి.
1970లో తొలి కథా సంకలనంగా ‘రక్తపు ముద్ద పిలిచింది’ ద్వారా శాంతి నారాయణ కథా క్షేత్రంలోకి అడుగు మోపారు. చిత్తూరు జిల్లాలో నామిని తన మొదటికథ ‘మళ్ళీ జన్మించు మహాత్మా’ ద్వారా పరిచయమయ్యారు. 1985లో పచ్చనాకుసాక్షిగా కథల ద్వారా, 1986లో పాలపొదుగు కథలు,1987లో సినబ్బ కథ లు, 1988లో మునికన్నడి సేద్యం, 1990లో మిట్టూరోడి కథల ద్వారా నామిని సీమ కథా సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. మధురాంతకం రాజారాం కుమారుడు నరేంద్ర కుంభమేళా, అస్తిత్వానికి అటు ఇటు, ప్రహేళిక, వెదురు పువ్వు కథా సంపుటాల ద్వారా పేరు పొం దారు. ‘కనుపించని కోయిల’ కథా సంపుటి ద్వారా మహేంద్ర కూడా ఉత్తమ కథకుడిగా కీర్తి పొందారు. పూతలపట్టుకు చెందిన డా కేశవరెడ్డి సీమ కరవు నేపథ్యంలో ‘వక్ర ప్రకృతి’ కథ రాశారు. ది రోడ్‌, భగవాన్‌ వాచ కథలను కూడా వీరు అందించి కథాసాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారు.

చదవండి :  వేంపల్లి గంగాధర్‌కు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం

మూడవ తరం కథకులు: 1995 నుంచి నేటి వరకు సీమ మూడవ తరం కథకులుగా విభజించుకుంటే పాలగిరి విశ్వప్రసాద్‌, సన్నపు రెడ్డి వెంకట్రామిరెడ్డి, నాగప్పగారి సుందర్రాజు, రాప్తాడు గోపాల కృష్ణ, సుంకోజి, ఎం. హరికిషన్‌, తుమ్మల రామకృష్ణ, గీపినీ, జి.ఆర్‌. మహర్షి, తవ్వా ఓబుల్‌రెడ్డి, జి.వెంకట కృష్ణ, చక్రవేణు, డా వేంపల్లి గంగాధర్‌, ఎస్‌.వి. ప్రసాద్‌, షరీఫ్‌ వంటివారు కనుపిస్తారు. మూడవ తరం కథకులు ప్రపంచీకరణ ప్రభావాన్ని, దళితుల ఆవేదనల్ని, స్ర్తీల అభ్యుదయ భావాలను అక్షర బద్ధం చేశారు. కరవు, కక్షల కథలతో పాటు ఎన్నో సామాజిక సమస్యలపై విస్తృతంగా కథలు రాస్తున్నారు. ఇవాళ రాయలసీమలో దాదాపు మొత్తం 220 మంది కథకులు ఉన్నారు. వీరిలో 177 మంది కథారచయితలు కాగా, 43 మంది రచయిత్రులున్నారు.
వీరి కథలన్నీ సేకరించి, విశ్లేషించి వీరి జీవిత విశేషాలతో పాటు- నా పరిశోధన గ్రంథం ‘రాయలసీమ కథా సాహిత్యం’లో పొందుపరచే అవకాశం నాకు దక్కింది. రాయలసీమ ప్రాంత జీవితాలను, జీవనాన్ని ఈ కథలు రికార్డు చేశాయి. తెలుగు కథా సాహితీ చరిత్రలో సీమ కథ తగిన ప్రాధాన్యతను, గుర్తింపును, హోదాను కలిగి ఉంది. సీమ కథ ఆలస్యంగా మొదలైనప్పటికీ అత్యద్భుతమైన పరిణతి సాధించింది. ఇదొక గొప్ప ప్రయత్నం. సీమ కథలో పరిపూర్ణత ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. ‘కోటి గొంతుల కిన్నెర- కోటి గుండెల కంజరి’కి ఇవే కథా కుసుమాల అభినందన చందనాలు.

-సూర్య దినపత్రిక

ఇదీ చదవండి!

కడుపాత్రం

కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో …

ఒక వ్యాఖ్య

  1. DR. vempalli gangadhar gaaru
    bathulaprasad ane nenu kooda 1997 nundi kathalu raasthunnanu SAGILETIKATHALU
    pera o kathasankalanam kooda prachurinchanu
    adi mee drustiki rakapoyi vundavachu anukuntunnaanu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: