శనివారం , 7 డిసెంబర్ 2024
sriramireddy

రాయలసీమకు ఏం చేసింది?

    • నికర జలాలతో స్వాతంత్య్రం అనంతరం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు
    • రెండు దశాబ్ధాలుగా గడిచినా పూర్తి కాని మిగులు జలాల ప్రాజెక్టులు
    • పోతిరెడ్డి పాడును వ్యతిరేఖించిన కోస్తా, తెలంగాణ నాయకులు
    • కోస్తాంధ్రకు పోలవరాన్ని ప్రకటించిన కేంద్రం మనకేమిచ్చింది?
    • తెలంగాణ వారిలాగా మనం కూడా ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం మంచిది

ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమఘట్టంలో వున్న రాయలసీమ వాసులకు ఇప్పుడు రాష్ట్రవిభజన మరింత ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రం వీడిపోతే జలయుద్ధాలు తప్పవని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు శ్రీ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం విడిపోతే రాయలసీమకు పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుందని, తెలంగాణతో పాటు కోస్తాతో కూడా నీటి సమస్యపై గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాట్రిబ్యునల్ మిగులు జలాలను చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకునేందుకు అవకాశం కల్పించిందని, దీని ఆసరాగా పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అయితే తాజాగా కొత్త కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా నీరివ్వడంలేదని, ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు.

నికర జలాల విషయానికి వస్తే 1975లో ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా, తుంగభద్ర నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో రాయలసీమకు 122 టీఎంసీలు కేటాయించారన్నారు. వీటిలో తుంగభద్రకు 40 టీఎంసీలు, హెచ్ఎల్‌సీకి 32 టీఎంసీలు, లోలెవెల్ కెనాల్ 28 టీఎంసీలు, ఇతర ప్రాజెక్టులకు 22 టీఎంసీలను కేటాయించారన్నారు. ఈ నీటిని వాడుకునేందుకు కూడా అనేక సమస్యలు, వివాదాలు ఎదురవుతున్నాయని ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.

చదవండి :  కడప జిల్లాపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది: గేయానంద్

రాయలసీమలో ఇంతకు మించి ఒక్క భారీ ప్రాజెక్టుకు కూడా నికరజలాలు కేటాయించలేదని, నికర జలాలతో స్వాతంత్య్రం అనంతరం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో 1981-82లో రాయలసీమ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టు కోసం ఆందోళన జరిపితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ ఫలితంగా కృష్ణా మిగులు జలాల ఆధారంగా రాయలసీమకు కొన్ని ప్రాజెక్టులు ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఆ మేరకే గాలేరు నగిరి, తెలుగుగంగ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులు రూపొందించారన్నారు. సుమారు రెండు దశాబ్ధాలుగా గడిచినా ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.

ప్రాజెక్టుల పరిస్థితి ఇలావుంటే మిగులు జలాలను రాయలసీమకు ఇచ్చే ప్రతిపాదనను తెలంగాణ రాజకీయ నాయకులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మిగులు జలాలతో తమకు వాటా కావాలని ప్రభుత్వంతో పట్టుబట్టి 180 టీఎంసీల నీటిని నింపుకునే సామర ్థ్యం కలిగిన బీమా-1, బీమా-2లతోపాటు పలు ప్రాజెక్టులను మంజూరు చేయించుకున్నారని తెలిపారు.

చదవండి :  కడపలో ఏర్పాటు కావాల్సిన ఉక్కు కర్మాగారం తరలించేందుకు కుట్ర

రాయలసీమ వాసులకు మిగులు జలాలు దక్కేందుకు కూడా తెలంగాణ నేతలు అడ్డుపడుతూనే వస్తున్నారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు వద్ద హెడ్‌రెగ్యులేటర్‌ను విస్తరించి గాలేరు నగిరి, గండికోటకు నీరిచ్చే ప్రతిపాదనను కూడా తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాన్నిఆయన గుర్తు చేశారు. ప్రత్యేకరాష్ట్రంవస్తే దానిని మూసేయిస్తామని కూడా తెలంగాణా నాయకులు మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసిన ఆయన  ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రాజోలిబండ వద్ద కూడా నీటి పంపిణీ విషయమై ఇటీవల కాలంలో కర్నూలు, మహబూబ్‌నగర్ రైతాంగం వద్ద పెద్దఎత్తున ఘర్షణలుజరిగిన సందర్భాన్ని గుర్తు చేశారు.రాష్ట్రం సమష్టిగా ఉన్నప్పుడే ఇలాంటి గొడవలకు తావునిస్తుంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణా వారితో జలయుద్ధాలు అనివార్యమని పేర్కొన్నారు.

జలయుద్ధాలు

తుంగభద్ర, కృష్ణా నదుల వెంబడి తెలంగాణకు, సీమకు ఐదు చోట్ల ఘర్షణలు తలెత్తాయని శ్రీ రామిరెడ్డి తెలిపారు. వీటిలో రాజోలి బండ, సుంకేసుల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్,శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద ఈ పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. వారి మనోభావాలను బట్టి చూస్తే జల వివాదాలు అనివార్యమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చదవండి :  ఔను..వీళ్ళు కూడా అంతే!

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జలవివాదాలు లేకుండా వుండేందుకు క్రిష్ణావ్యాలీ (రివర్) అథారిటీ ఏర్పాటు చేసినా వాటిపై బోర్డు కంట్రోల్ వుంటుందే తప్ప మన చేతుల్లో ఏం ఉండదని, ఎవరు శక్తిమంతులు అయితే వారు నీటిని తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కోస్తా ప్రాంతం వారు రాజకీయంగా మనకంటే బలవంతులు, సంఖ్యాపరంగా ఎమ్మెల్యేలు ఎక్కువ కాబట్టి ప్రభుత్వాలు వారికే తలొగ్గే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ పట్ల చిన్న చూపే చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ కూడా రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉందని రిపోర్టు ఇస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా రాయలసీమకు అన్యాయం చేసిందన్నారు.

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన కేంద్రం కోస్తాంధ్రా ప్రాంతానికి పోలవరాన్ని ఇచ్చిందని, మరి రాయలసీమకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

పోతిరెడ్డిపాడును విస్తరించేందుకు తెలంగాణతో పాటు కోస్తాంధ్రాలు కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమకు న్యాయం జరగాలంటే తెలంగాణ వారిలాగా మనం కూడా ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం మంచిదని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంతో గొడవపడి ఒత్తిడి తెచ్చిఅయినా మన నీటి సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి!

రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: