కడప జిల్లా రంగస్థల నటులు

అది క్రీ.శ 1895 ప్రాంతం – శ్రీ వనారస సోదరులు రాయచోటి తాలూకా సురభి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ప్రప్రధమంగా ‘కీచకవధ’ నాటకం ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రగిరి నుండి వలస వచ్చిన శ్రీ సుబ్బదాసు గారు ఈ వనారస సోదరుల తోడ్పాటుతో సురభి గ్రామంలో ‘శ్రీ శారదా మనోవినోదినీ సంగీత నాటక సభ’ స్థాపించారు.

వనారస గోవిందయ్య
వనారస గోవిందయ్య
వనారస చినరామయ్య
వనారస చినరామయ్య

అప్పటి నుండి క్రమశిక్షణతో ‘హరిశ్చంద్ర’, ‘శకుంతల’ నాటకాలు తయారుచేసి ఇటు రాయలసీమ. అటు సర్కారు జిల్లాలలో విశేషంగా ప్రదర్శనలిస్తూ నాటక కలకు నాంది పలికిన కీర్తి ప్రధానంగా ‘సురభి’ వారికే దక్కింది.

కడప మండలంలో నటులకు ఏనాడూ కొరత లేదు. నాటక కలోద్దారణకై తమ జీవితాలను అంకితం చేసి అందులో పరాకాష్ట పొందిన వారూ లేకపోలేదు.

కాని కాలం ఖర్మం కలిసి రాక ఎందరెందరో మహానటులు కాలగర్భంలో కలిసిపోయారు. మరికొందరు చావు బతుకుల మధ్య మిలమిలా మెరుస్తున్నారు.

గుత్తికొండ వీరాస్వామి

అట్టివారిలో గుత్తికొండ వీరాస్వామి ముందుగా చెప్పదగినవారు. వీరు కడప జిల్లా పులివెందుల తాలూకా, సంతకోవూరులో జన్మించి – తర్వాత రాయచోటి తాలూకా వీరబల్లిలో నివాసమేర్పరచుకొని, ఒకవైపు వైద్య వృత్తి, మరోవైపు నటనానుభవం గడించారు. నెల్లూరు శ్రీ నాగరాజారావు దగ్గర శిక్షణ పొంది – రాజరాజు, హరిశ్చంద్ర, రామదాసు – మొదలైన పాత్రలు ధరించి సంగీత సాహిత్య నటనా విశేషాలు సమపాళ్ళలో మేలవింపజేసి ప్రదర్శనలిస్తూ 80 సంవత్సరాల వయసులో, 8 సంవత్సరాల క్రితం (1965లో) అమరులయ్యారు. సుమారు పది మూగ సినిమాలలో శ్రీ రాజాశాండో హయాంలో నటించారు కూడా. వీరి సోదరులు సుబ్బయ్యగారు సినిమాలలో, నాటకాలలో నటించిన మంచి నటకులు – కర్ర, కత్తి సాములలో మంచి ప్రావీణ్యం కలవారు.

శ్రీ బైరెడ్డి నరసింహా రెడ్డి

జమ్మలమడుగు తాలూకా పెద్దముడియంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. చక్కని వాక్చతురత గల నటుడు. స్థానం వారి పక్కన రాజరాజు పాత్ర ధరించి వారి మన్ననలు పొందిన అదృష్టశాలి. నెల్లూరులో ‘బాహుక’ పాత్రకు ఉత్తమ బహుమతి పొందినారు. ‘వీరాభిమన్యు’, ‘జయప్రద’, ‘సుమంగళి’ చిత్రాలలో సినిమాలలో కూడా నటించారు. వీరి నటనలోని అభినయ గాంభీర్యం గొప్పది. కళారాధనలో 65 సంవత్సరాలు జీవించి పది సంవత్సరాల క్రితం (1963) నటరాజులో ఐక్యమయ్యారు.

శ్రీ పొన్నతోట చిన్న వేంకటసుబ్బయ్య ఉరఫ్ చిన్నన్న

సుమారు 15 మూగ సినిమాలలో నటించిన వీరు శ్రీ రాజాశాండో గారి పర్యవేక్షణలో తన నటజీవితం ప్రారంభించారు. తర్వాత రంగస్థలంపై కంసుడు, హిరణ్యకశిపుడు లాంటి గంభీరమైన పాత్రలు ధరించి పేరు సంపాదించారు. ఎందఱో శిష్యులను, శిష్యురాండ్రను తయారు చేసిన గొప్ప హార్మోనిస్టు కూడా. ‘జయభేరి’, ‘వెంకటేశ్వర మహత్యం’ సినిమాలలో కూడా నటించారు. వీరి అంగసౌష్టవం వీరి పాత్రలకు ఎంతో న్యాయం చేకూర్చింది. ఇటీవల 60 సంవత్సరాల వయసులో వీరు దివంగతులయ్యారు.

శ్రీ డి.వి.నరసింహా రావు

వీరు నెల్లూరు మండలంలో పుట్టీ, కడప మండలంలో మెట్టే 40 సంవత్సరాలుగా నాటక రంగానికి తన జీవితం అర్పించిన కళాజీవి. వీరు ప్రధానంగా ‘చింతామణి’, ‘సత్యభామ’, ‘దమయంతి’ వంటి స్త్రీ వేషాలు వేస్తూ వాచికాభినయాలకు చక్కని చుట్టరికం ఏర్పరచుకొని నటించేవారు. వీరి గాత్ర ధర్మం అంతకంటే ప్రసన్నమైనది. ప్రఖ్యాత సత్యభామ వేషధారి శ్రీ కొండపేట కమాల్ వీరి శిష్యుడే! ప్రస్తుతం వీరి వయస్సు 70 సంవత్సరాలు. అనారోగ్య కారణంగా నిస్సహాయ స్థితిలో ప్రోద్దటూరులోనే జీవితశేషాన్ని (శేష జీవితాన్ని) గడుపుతున్నారు. వీరిని ఆదుకోవలసిన అవసరం ప్రభుత్వానికి, ప్రజా సంస్థలకూ ఎంతైనా ఉంది.

చదవండి :  రాయలసీమ వాసులూ - సినీ రసజ్ఞత

శ్రీ సాదల రామస్వామి

కడపలో, న్యాయవాద వృత్తిలో జీవనం గడుపుతూ, పూజ్యులు బళ్ళారి రాఘవాచార్యులు శిష్యరికంలో నటనానుభవం సంపాదించారు. ఆ ఉత్సాహంతో ‘బిల్వమంగల’, ‘నారద’ వంటి పాత్రలు ధరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల అకాల మరణానికి గురి అయ్యారు.

శ్రీ నాగలింగం భాగవతార్

కడపలో జన్మించి శ్రీ టి.రామకృష్ణశాస్త్రి, శ్రీ సూరిబాబు, కె రఘురామయ్య వంటి ప్రసిద్ధ నటులతో పాటు తానూ ప్రఖ్యాతి వహించారు. ‘తారాశశాంకం’లో లంభుకౌశ్వర పాత్ర మొదలుకొని ‘తులాభారం’లో కృష్ణ పాత్ర వరకూ విభిన్న పాత్రలు పోషించారు. హైదరాబాదులో వీరి కృష్ణ పాత్రకు వెండి శ్రీకృష్ణ విగ్రహం బహుమతి పొందిన సమయంలో – 22సార్లు గౌరవ సూచకంగా రాజు కృష్ణప్రసాద్ గారు ఫిరంగులు పేల్చారు. వీరి వాచకంలో స్పష్టత, గానంలో వైవిధ్యం భాసిస్తూ వుండేవి. చివరి దశలో నాటక రంగం నుండి విరమించి హరికధాగానం చేస్తూ లింగైక్యం పొందినారు – శ్రీ నాగలింగం గారు.

శ్రీ మధ్య గుండూరావు

కడప నివాసి – స్త్రీ పాత్రలతో పాటు హాస్య పాత్రలు ధరించేవారు. ‘కడప రామవిలాస సభ’ కార్యవర్గంలో ఒకరుగా పనిచేస్తున్నారు. శ్రీ జె వి సుబ్బారావు కూడా పై సభలో సభ్యుడుగా నాటక కళాసేవ చేస్తున్న నటుడు.

శ్రీ కొండపేట కమాల్

కొండపేట కమాల్
కొండపేట కమాల్

కడప తాలూకా కొండపేట వాస్తవ్యులు. చిన్నతనంలో తురిమెల్ల నాటక కంపెనీలో ప్రవేశించి కృష్ణ, కనకసేనుడు, ప్రహ్లాద మొదలైన పాత్రలు ధరిస్తూ వచ్చారు. క్రమేణా శ్రీ డి.వి.నరసింహా రావు గారి శిక్షణలో ‘సత్యభామ’ పాత్రకు కొత్తగా రూపురేఖలు దిద్దుకొన్నారు. డానికి స్వయం ప్రతిభ తోడైంది. “రాయలసీమ స్థానం” అను బిరుదు వహించారు. తాడిపత్రిలో, స్థానం వారి ఎదుట ‘సత్యభామ’ పాత్ర ధరించి వారి ప్రశంసలు అందుకున్నారు. చిత్రాంగి, చింతామణి పాత్రలలో కూడా ప్రశంసనీయంగా నటించేవారు. పద్యం చదవడంలో, భావం వ్యక్తం చేయడంలో ‘వీరికి వీరే సాటి’ అనిపించుకొన్నారు. ప్రస్తుతం స్వగ్రామంలో వైరాగ్య జీవితం సాగిస్తున్నారు.

శ్రీ బడబాగ్ని నారాయణ రాజు (బి ఎన్ రాజు)

రాయలసీమ “వజ్రపుతునక”గా ప్రసిద్దిగామ్చినారు. పండిత వంశంలో, ప్రొద్దుటూరులో జన్మించినారు. శ్రీ పారుపల్లి సుబ్బారావు, శ్రీ బి ఎల్ శాస్త్రి వంటి మహానటుల వద్ద శిక్షణ పొందారు. గౌలగాత్ర సౌభాగ్యంతో రంగస్థలంపై గానభాస్కరుడుగా ప్రకాశించేవాడు. సినీనటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ‘శ్రీ సీతారామ జననం’ లో లక్ష్మణ పాత్ర ధరించి అదృష్టం వక్రించి వచ్చినారు. నారద పాత్రలో వీరి పాటల గాంభీర్యం, మాటల సౌకుమార్యం ప్రేక్షకులను ఎంతో ఆకర్షించేది. ఇటీవలనే సుమారు 40 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా మరణించారు.

శ్రీ చెమికీ నారాయణరావు

ఆల్రౌండ్ ఆక్టర్ శ్రీ చెమికీ నారాయణరావు – పుట్టినది కృష్ణానది ఒడ్డున – బ్రతికినది పెన్నా నది తీరాన.  ప్రొద్దుటూరులో 40 సంవత్సరాలు నాటక రంగాన్ని అంటిపెట్టుకొని శ్రీహరి, నలిని, సక్కుభాయి అత్త – మొదలైన కామెడీ వేషాలు ధరించి ఆ పాత్రలకు సాటిలేని ప్రాముఖ్యం తెచ్చిపెట్టారు. కపిలవాయి రామనాధశాస్త్రి గారి దగ్గర శిక్షణ పొందినారు. మైలవరం కంపెనీలో చాలా కాలం పనిచేసినారు. 65 సంవత్సరాల వయసులో తనువు చాలించి స్త్రీ హాస్య పాత్రలకు కరువు దెచ్చిపెట్టారు.

చదవండి :  అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

శ్రీ పాలకోట రామిరెడ్డి

ఈ వ్యాసకర్త అన్నగారైన వీరు మంచి హాస్యనటుడు . ‘పద్మావతీ విజయం’లో వెంగిశెట్టి, ‘రామదాసు’లో ఆహమ్మద్ షా వీరి అభిమాన హాస్యపాత్రలు. వీరు కీర్తి శేషులై సుమారు ఇరవై సంవత్సరాలు గడిచాయి.

శ్రీ రాజన్న కవి

అటు సాహిత్య రంగంలోనే కాకుండా ఇటు నాటకరంగంలో కూడా సమాన కీర్తి గడించారు శ్రీ రాజన్న కవి గారు. సంస్కృతీ నిలయమైన ప్రోద్దుటూరులోనే సంగీత వంశంలో జన్మించారు. శ్రీ పుట్టపర్తి వారి శిష్యరికంలో సాహిత్యజ్ఞానం ఆర్జించారు. గాత్రయష్టి, గాత్రపుష్టీ సమపాలంలో అమరిన అదృష్టవంతులు కావడం వల్ల 1960 -1970 సంవత్సరాలలో గుంటూరులో జరిగిన నాటక పోటీలలో పాల్గొని ఉత్తమ నటుడుగా బహుమతులు పొందినారు. వీరి గయుడు,భవాని, ధర్మజ, నక్షత్రక పాత్రలలో విలక్షణత కనిపిస్తుంది. శ్రీ పి సూరిబాబు వీరి నటనకు, పద్యపఠనానికి ముగ్దుడై తమ ’తారాశశాంకం’లో  చంద్రుని పాత్రను ధరింపజేసి – గోదావరీ పుష్కరాల సమయంలో రాజమండ్రి పౌరులకు పరిచయం చేశారు. వీరు మధుర రేడియో గాయకులు కూడా.

శ్రీ అన్నపురెడ్డి కొండారెడ్డి

ప్రొద్దుటూరు తాలూకా అర్కటవేముల గ్రామంలో శ్రీమంతుల ఇంట జన్మించారు. భాష, భాషకు తగిన భావం, భావానుగుణ్యమైన రాగాజ్ఞానం అమరిన నటశేఖర బిరుదాంకితులు. రాయబారంలో శ్రీకృష్ణ పాత్రను ధరించి గుంటూరులో వెండి కిరీటం బహుమతిని పొందినారు. ఎంతో అభివృద్దికి రావలసిన శక్తిసంపన్నుడు విధి వంచితుడై ఇటీవలనే అకాల ఆకస్మిక మరణానికి గురి అయ్యారు.

శ్రీ కె బాలదాసు పిళ్ళై – శ్రీ గురవలూరు మాబూసాబ్

బాలగంధర్వ బిరుదాంకితులు – ప్రొద్దుటూరు తాలూకా గోపాయపల్లె వాస్తవ్యులు – వీరి వయస్సు 40 సంవత్సరాలు. వీరి నారద, ఆంజనేయ పాత్రలు ఎన్నదగినవి. మధురమైన గానంతో ప్రేక్షకులను ముగ్ధులను చేయగల గాయకుడు. ఫిడేలు వాద్యంలో మంచి ప్రవేశమున్న వారు. వీరితో చక్కని కాంబినేషన్ ఏర్పరుచుకొని రామ,కృష్ణ,అర్జున పాత్రలు వేస్తూ ప్రశంసలన్డుకొంటున్న నటుడు శ్రీ గురవలూరు మాబూసాబ్ – మైదుకూరు వాస్తవ్యుడు.

శ్రీ అల్లాడుపల్లి ఎల్లారెడ్డి

అల్లాడుపల్లె పుణ్యక్షేత్రంలో జన్మించి భారత భాగవతాలు బాగా పఠించి – దుర్యోధన పాత్రను చక్కగా భావించి – ఆపాత్రకు న్యాయం చేకూర్చిన వారు శ్రీ అల్లాడుపల్లి ఎల్లారెడ్డి గారు. “రాయలసీమ ఏకైక దుర్యోధన” అను కీర్తినార్జించారు. పులివెందుల తాలూకా బలపనూరు గ్రామంలో వీరి దుర్యోధన పాత్రకు మెచ్చి వెండిగదను బహూకరించారు – రేనాటి రెడ్లు.

విద్వాన్ శ్రీ అవధానం సుబ్బరాజు

నాటక కళామతల్లిని అర్చించి విభిన్న పాత్రలలో రంగస్థలంపై నటించిన కవి, గాయకుడు – ప్రొద్దుటూరు తాలూకా అనంతపురం వాస్తవ్యులు.

కలాసేవాతత్పరతతో నాటక కలాభివృద్దికి తోడ్పడిన నటీమణులు ఎందరో కడప మండలంలో అవతరించారు.

శ్రీమతి రామాయణం యశోదాదేవి

ప్రొద్దుటూరు నివాసి – వీరు జంత్రవాద్య విశారదులైన శ్రీ పెద్ద జమాలప్ప, శ్రీ పొన్నతోట పెద్దన్నల దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. శ్రీ పొన్నతోట చిన్నన్న, శ్రీ పారుపల్లి సుబ్బారావు, శ్రీ సూరిబాబు పర్యవేక్షణలో నటనానుభవం పొందారు.ఈమె చంద్రమతి, సక్కుభాయి, మండోదరి మొదలైన పతివ్రతా వేషాలు ఆంధ్రదేశమంతటా ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నది. ప్రస్తుతం వీరి వయస్సు 58 సంవత్సరాలు. సంగీత నాటక అకాడమీ వీరి శ్రమను గుర్తించి నెలకు 50 రూపాయల “వృత్తి పించను”  మంజూరు చేస్తున్నది.

చదవండి :  జయమాయ నీకు - అన్నమయ్య సంకీర్తన

అట్లే సుశీలారాణి, వనారస కమల, కె వరకుమారి ప్రధాన పౌరాణిక పాత్రలు వేస్తూ ప్రొద్దుటూరు కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు.

శ్రీమతి శాంతకుమారి

వీరిని అదృష్ట దేవత వరించింది – చిన్నతనమంతా ప్రోద్దటూరులోనే గడిపింది. మహా విద్వాంసులు ఫిడేలు జమాలు శిక్షణలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నది. రంగస్థలంపై వీరి సావిత్రి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేది. నృత్యంలో కూడా ప్రావీణ్యం సంపాదించి సినిమా రంగంలో ప్రవేశించి ఒక ఉన్నతమైన స్థానాన్ని   అలంకరించడం కడప మండలానికే గర్వకారణం.

శ్రీమతి పి రాజ్యం

శ్రీకాళహస్తిలో జన్మించినా 20 సంవత్సరాలుగా ప్రొద్దుటూరులో శాశ్వత నివాసం ఏర్పరచుకొని తన సంగీత నటనా వైదుష్యంతో దేశమంతటా గజ్జల రవళి మ్రోయించింది.

సినిమారంగంలో హాస్యనటచక్రవర్తిగా ప్రకాశిస్తున్న శ్రీ పద్మనాభం గారు పులివెందుల తాలూకా సింహాద్రిపురం వాస్తవ్యులే!

కళారాదనే సర్వస్వంగా భావిస్తూ బతుకు తెరువు బరువుగా సాగిస్తూ వస్తున్న “శ్రీమతి శ్యామలా హుశేన్ బ్రదర్స్” వారి నాటక బృందం రాజంపేటలో వెలిసింది. వీరి తోడ్పాటుతోనే శ్రీ మంటపంపల్లె వేంకట సుబ్బయ్య, ఖాదర్ రెడ్డి ప్రఖ్యాతులు నాటక రంగంలో ప్రవేశించి హరిశ్చంద్ర, తారాశశాంక,బాలనాగమ్మ నాటకాలు ప్రదర్శిస్తున్నారు.

సాంఘిక నాటక రంగంలో కూడా కడప మండలం ముందంజ వేసింది. రచయితా, నటుడూ అయిన శ్రీ మండ్యాల శ్రీనివాసులు ప్రొద్దుటూరు వారే! వీరి త్యాగమయి నాటకానికి అకాడమీ బహుమతి లభించింది. ‘అమరాత్యాగి’ నాటిక వీరికి ఎంతో కీర్తి సంపాదించి పెట్టింది. శ్రీ ఆకుమల్ల శివరామ శాస్త్రి, శ్రీ ఆరవేటి శ్రీనివాసులు, విద్వాన్ శ్రీ రాళ్ళబండి శ్రీనివాసాచార్యులు ప్రొద్దుటూరు వారే! ఆరవేటి శ్రీనివాసులు సంగీత విశారదలో  ఉత్తీర్ణులయ్యారు – వీరి ‘రంగమహళ్ రహస్యం’ నవల ఆధారంగా సినిమా కూడా తీశారు.

పొన్నతోట సోదరులు కూడా ఈ కోవకు చెందిన నటులు. శ్రీ పొన్నతోట సుబ్బారావు శకుంతల నాటకం రచించారు. పైన పేర్కొన్న నటులందరూ సాంఘిక నాటకాల్లో పాల్గొని బహుమతులందుకొన్న ప్రతిభాశాలురు.

మహాకవి అన్నట్లు నాటకం ఒక క్రతువు. దీనికి శాశ్వతమైన భావనాబలం, దానిని మించిన సాధనాబలం ఎంతైనా ఆవసరం. ఈ గుణాలను కడప మండల నట రత్నాలకు ఆ నటరాజస్వామి ప్రసాదించుగాక!

ఇంకా ఎందఱో నటీనటులు అజ్ఞాతంగా జీవిస్తున్నారు. క్రమంగా వారి సంక్షిప్త జీవిత విశేషాలు సేకరించి త్వరలో ప్రకటించడానికి చేస్తున్న నా ప్రయత్నానికి భగవంతులు సహకరింతురు గాక||

(మూలం: విశేష సంచిక, కడప జిల్లా రచయితల మహాసభలు – ఆగష్టు ౧౧, ౧౨ – 1973 (౧౯౭౩))

రచయిత గురించి

ప్రొద్దటూరుకు చెందిన పి.కృష్ణారెడ్డి గారు కళాభిమాని. చిన్నతనం నుండే నాటకాలకు అంకితమైనారు. రెడ్డిగారు హాస్యనటుడిగా తనదైన గుర్తింపు పొందారు. వీరు “సుబ్బిశెట్టి” పాత్రకు తనదైన శైలిలో ప్రత్యేక రూపకల్పన చేసినారు. పారుపల్లి సుబ్బారావు, గగ్గయ్య, బందా, స్థానం మొదలైన వారితో కలిసి యావదాంధ్రలో అనేక ప్రదర్శనలిచ్చినారు. నాటక సంస్థలు నెలకొల్పి ఎందఱో వర్ధమానులకు ప్రోత్సాహమిచ్చినారు.

ఇదీ చదవండి!

మాలెపాడు శాసనము

అరకట వేముల శాసనం

ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: