మైదుకూరు సదానందమఠం

మైదుకూరు సదానందమఠం

మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్‌ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది.

మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి శ్రీకారం చుట్టారు. తండ్రి పెద్దయార్యుల భోధనలతో పిచ్చమాంబ ప్రభావితురాలైయ్యారు . ఆశ్రమం మరింతగా అభివృద్దిచెందడానికి విశేష కృషి చేశారు.

పెద్దయార్యులు
పెద్దయార్యులు

మద్రాసులోని శ్రీ పోకలశేషాచార్యుల మార్గదర్శకత్వంతో పిచ్చమాంబ తారకయోగమార్గం అవలంబించారు . ఆ తర్వాత శ్రీ శివరామదీక్షితుల అచల గురుపరంపర మార్గానికి దృష్టి మరల్చారు. బృహద్వాశిష్ట సిద్దాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొని, ఆ భావనలకు విసృత ప్రచారం కల్పించేందుకు 1931 జూన్‌ 15వ తేదీన సదానంద ఆశ్రమ ట్రస్టును పిచ్చమాంబ ఏర్పాటు చేశారు. సదానందాశ్రమంలో పూజా మందిరం, భజన మందిరం ఏర్పాటుచేశారు.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనుమరాలైన ‘జ్ఞానబోధ’ ప్రవక్త ఈశ్వరమ్మ కటాక్షములకు పాత్రులైన కుటుంబంలో ఐదవతరం సంతానంగా జన్మించిన పిచ్చమాంబ, ఆశ్రమంలో అహర్నిశలూ ఆధ్యాత్మిక, తాత్విక కార్యక్రమాలను, ధ్యాన పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

మైదుకూరు పరిసర గ్రామాలతోపాటు జిల్లాలోని పులివెందుల, చవ్వారిపల్లె , భూమాయపల్లె, సున్నపు రాళ్ళపల్లె, పెద్దపసుపుల, సర్వాయపల్లె అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, యాడికి ప్రాంతాలనుండి గురుశిష్య పరంపర సదానందాశ్రమానికి తరలివచ్చి ఇక్కడి కార్యక్రమాలలో పాల్గొనేవారు. గురుబోధకులు రాష్ట్రం నలుమూలలనుండి ఈ ఆశ్రమానికి తరలివచ్చి బోధనలు చేసేవారు.

పిచ్చమాంబ

పిచ్చమాంబ స్వయంగా తన శిష్యులకు బోధనలు చేస్తూ వారికి తాత్విక సందేహాలను తీరుస్తూ ఉండేవారు కార్తీక మాసంలో విశేషరీతిలో జరిగే ఆశ్రమ కార్యక్రమాల్లో భక్తులూ,శిష్యులూ అధికసంఖ్యలో పాల్గొనేవారు. పిచ్చమాంబ జ్ఞానామృత బోధన కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాలేదు. అనేక తాత్విక, శతక, పురాణాలను పిచ్చమాంబ రచించారు.

* పిచ్చమాంబ రచించిన శ్రీ ప్రబోధచంద్రోదయం, శ్రీ వీరగురురాజ శతకం, తత్వరామాయణం, తత్వప్రబోధిని, అచలశతకం గ్రంథాలు అధ్యాత్మికలోకంలో ఎనలేని గుర్తింపును పొందాయి. ఇవేకాకుండా మరెన్నో రచనలను పిచ్చమాంబ చేసినప్పటికి గ్రంథ రూపంలో వెలువడకపోవడం పలువురిని విచారానికి గురిచేస్తోంది. “ శ్రీ ప్రబోధ చంద్రోదయం” గ్రంథం, శ్రీకృష్ణమిశ్రీయం అనే హిందీ గ్రంథానికి అనువాద గ్రంథంగా పిచ్చమాంబ వెలువరించారు. అలాగే “శ్రీ వీరగురురాజ శతకం” ఆధ్యాత్మిక, విద్యా పరమార్థాలనువివరించే గొప్ప వివరణాత్మక గ్రంథంగా పేరుగాంచింది. “తత్వ రామాయణం” అనే గ్రంథాన్ని పోరుమామిళ్ళ మండలం చల్లగిరిగెల గ్రామం లో వెలసిన శ్రీరామచంద్రుని దేవాలయంలో పిచ్చమాంబ రచించారు. మానవ దేహతత్వానికి రామాయణ గాథను అన్వయించి రచించిన “తత్వరామాయణం” తాత్విక సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగంగా విశేష ప్రాచుర్యాన్ని పొందింది. అలాగే” తత్వప్రబోధిని” లో కందార్థ తత్వాలను పిచ్చమాంబ హృద్యమైన రీతిలో పొందుపరిచారు. పిచ్చమాంబ లెక్కలేనన్ని తత్వాలను రచించి, శిష్యులకు పాడి వినిపించినప్పటికీ తన “తత్వప్రబోధిని”లో యాభై తత్వాలను మాత్రమే పొందుపరిచారు.

చదవండి :  కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం

సదానందమఠం

సదానందాశ్రమ నిర్వహణలో పిచ్చమాంబకు ఆమె శిష్యులు విశేష సహకారాన్నీ సేవలనూ అందించారు. మైదుకూరుకు చెందిన శ్రీనంది వేంకటపతి, బ్రహ్మంగారి మఠానికి చెందిన శ్రీ అరవ వెంకటస్వామి, పిచ్చమాంబ సోదరుడు శ్రీ గోవిందయ్య, పులివెందులకు చెందిన నాగదాసు, భూమాయపల్లెకు చెంది లక్ష్మిరెడ్డి కొట్టాలపల్లెకు చెందిన శ్రీమతి గజ్జెల నారమాంబ మైదుకూరికి చెందిన వన్నూరు గారి పెద్దవేంకటపతి, పులివెందుల ప్రాంతంలోని చవ్వారిపల్లెకు చెందిన మాడిమిద్దె చెన్నమ్మ, పిచ్చమాంబకు ప్రియ శిష్యులుగా పేర్కొనవచ్చు. శ్రీవెంకటస్వామి గీతామందిరం నిర్మించారు. వీరేకాకుండా పిచ్చమాంబ చెల్లెలు భర్త రామోజీరావు ఆశ్రమ వ్యవహారాల్లో పాల్గొని సేవలను అందించారు.

పులివెందులలోని కచేరిరోడ్డులో కూడా పిచ్చమాంబ మఠాన్ని శిష్యులు నిర్మించారు. సదానందాశ్రమంలో పిచ్చమాంబ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరగడం వల్ల కాలక్రమంలో సదానందాశ్రమానికి బదులుగా “శ్రీ పిచ్చమాంబ మఠం” గా పేరువచ్చింది. సుమారు 60 సంవత్సరాల క్రిందట హేవిళంబి నామసంవత్సరం చైత్రమాసం, బహుళ ద్వాదశి శుక్రవారం నాడు పిచ్చమాంబ పరమపదించారు.

చదవండి :  మన జయరాం, మన సొదుం

*‘జగతి జనములు మాయచే జడులు గాక
భక్తి సుజ్ఞాన సమతంబరుగుచుండి
కరుణ శాంతియు, సద్దర్మ పరులునగుచు
వేద విజ్ఞాన సత్యముల్‌ విడువకుండ
భారతదేశంబు భద్రమై వరలుగాక ‘

అంటూ తన ప్రబోధ చంద్రోదయం గ్రంథానికి తాను రాసుకున్నభరతవాక్యంలో మన దేశంపట్ల, దేశంలో ప్రజల సుఖశాంతులపట్ల అపారమైన ఆకాంక్షను పిచ్చమాంబ వ్యక్తంచేశారు. పుణ్యభూమిగా, వేదభూమిగా ప్రపంచ దేశాలలో తనకంటూ విశిష్టస్టానాన్నీ విలక్షణ వారసత్వాన్నీ సంతరించుకున్న భారతదేశంలోఎందరో సాధుపుంగవులు, సాధ్వీమాతలు, సిద్దులు, అవధూతలు అవతరించి దేశంలో ఆధ్యాత్మిక జ్ఞాన వికాసాల కోసం తమ భోధనలను ,రచనలను అందించారు. పిచ్చమాంబ అలాంటి మహనీయుల కోవకుచెందిన అమృత మూర్తిగా గణతికెక్కారు. పిచ్చమ్మమఠంలో గతంలో అందమైన పూలతోట, పండ్లతోట, మంచినీటిబావి ఉండేవి. తాత్విక ఆలోచనాపరులకు, శిష్యపరంపరకు మానసిక వికాసం కల్గించి, తన ఒడిలో చేర్చుకున్న సదానందాశ్రమం మైదుకూరు పట్టణానికే వన్నెతెచ్చిందనిచెప్పవచ్చు.

– తవ్వా ఓబుల్ రెడ్డి

ఇదీ చదవండి!

పెద్దపసుపుల - దానవులపాడు

పెద్దపసుపుల – దానవులపాడు (కురుమరి) పొలిమేర కొట్లాట

దండనాయకుడిని హతమార్చిన పెద్దపసుపుల ప్రజలు పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజు కళ్యాణీ పట్టణాన్నిరాజధానిగా చేసుకుని గండికోటసీమతో సహా పాలన …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: