పాఠశాల ఆవరణలో మృతదేహాల్ కోసం తవ్వకాలు జరుపుతున్న పోలీసులు
మృతదేహాల కేసులో నిందితుల అరెస్టు
అనుమానమే ఆ హత్యలకు మూలకారణం
పోలీసు దర్యాప్తులో వెల్లడి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కడప నభీకోటలోని జియోన్ పాఠశాల ఆవరణలో ఈనెల 7న బయటపడిన కృపాకర్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు సంబంధించిన కేసులో నిందితులు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు వివరాలను బుధవారం కడప తాలుకా పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు వెల్లడించారు .
పోలీసు దర్యాప్తులో వెల్లడైన కథ ఇదీ…
‘కృపాకర్ భార్య మౌనిక 2013 ఫిబ్రవరి 17న రూ.13 లక్షలు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు మౌనికను వారి పిన్నీ ఇంటికి తీసుకొచ్చి పంచాయితీ చేసి కృపాకర్ ఇంటికి పంపించారు. మౌనిక ఎవరితోనో వెళ్లిపోయిందని కృపాకర్‌కు అనుమానం కలిగింది.
ఈనేపథ్యంలో 2013 ఫిబ్రవరి 22న కృపాకర్, రామాంజినేయరెడ్డి కలిసి మౌనికను ఇంటిలోనే చంపి పాఠశాల ఆవరణలో పూడ్చి పెట్టారు. విషయాన్ని కృపాకర్ తన తండ్రి రాజారత్నం ఐజాక్, రమణారెడ్డికి చెప్పగా.. ఎవరికి చెప్పొద్దు పోలీసు కేసు లేకుండ తాను చూసుకుంటానని రాజరత్నం భరోసా ఇచ్చాడన్నారు.
కృపాకర్, రామాంజినేయరెడ్డి, రమణారెడ్డి మాట్లాడుకుని మౌనికను తీసుకెళ్లిన వ్యక్తిని చంపాలని పథకం వేసుకున్నారు. ఈ మేరకు భానుప్రతాప్, రామాంజినేయనాయక్ అనే వ్యక్తులకు రూ.25 లక్షలు, ఒక వాహనాన్ని ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని ఒక్కొక్కరికి రూ.లక్ష ఇచ్చారు, తర్వాత మరో రూ.లక్ష చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేశారు.
కృపాకర్ తన పిల్లల బాగోగులు చూసుకునేందుకు రమణారెడ్డికి తన పిల్లలను అప్పగించి ఒప్పందం ప్రకారం జియోన్ పాఠశాలను రమణారెడ్డితో పాటు మరో ఇద్దరి పేరు మీద 2013 మార్చిలో రిజిస్ట్రేషన్ చేయించాడు.
కొద్ది రోజుల తరువాత రమణారెడ్డి పిల్లలను చూసుకోలేనని కృపాకర్‌కు అప్పగించాడన్నారు. దీంతో కృపాకర్ తన పిల్లలతో సహా తాను కూడా చనిపోతానని తండ్రి రాజారత్నం ఐజాక్, రమణారెడ్డితో అప్పుడప్పుడు అనే వాడు.
2013 ఏప్రిల్ 19న రాత్రి కృపాకర్ తన పిల్లలను రామాంజినేయరెడ్డి సహాయంతో చంపేసి మౌనికను పూడ్చిన స్థలం పక్కనే పూడ్చి తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కృపాకర్ మృతదేహాన్ని రామాంజినేయరెడ్డి, కిషోర్‌రెడ్డి, రత్నాకర్‌రెడ్డి కలిసి పిల్లలను పూడ్చిన గుంతలోనే పూడ్చారు. ఈ విషయాలన్ని రమణారెడ్డి, రామాంజినేయరెడ్డికి తెలియడంతో వారికి రూ.2 లక్షలు ఇచ్చి ఇక్కడ కనపడకుండా కుటుంబ సభ్యులతో సహా ఎక్కడికైనా వెళ్లిపోవాలని రాజారత్నం ఐజాక్ చెప్పాడు.
ఆ తర్వాత రాజారత్నం ఐజాక్ తన కుమారుడు కృపాకర్ పిల్లలతో సహా బెంగళూరు, పుణె, హైదరాబాద్‌లో ఉంటున్నాడని ప్రజలను నమ్మించాడు’ అని డిఎస్పీ రాజేశ్వరరెడ్డి వెల్లడించారు.
నిందితుల అరెస్టు
ఈ కేసులో ఇది వరకే రామాంజినేయరెడ్డి, రాజారత్నం ఐజాక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన ముగ్గురు రమణారెడ్డి(43), భానుప్రతాప్(24), రామాంజినేయులు నాయక్ అలియాస్ అంజినాయక్(23)ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు.