ఆదివారం , 22 డిసెంబర్ 2024
మనువు

మనువు (కథ) – సొదుం జయరాం

సొదుం జయరాం కథ ‘మనువు’

ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా బాధపడవలసిన ఘోరవిపత్తు ఏదీ ముంచుకు రాలేదు. ఆ ఇంటి పెద్దమ్మాయి విమల లేచిపోయింది. ఆ ఇంటిల్లిపాదీ బాధకు కారణం అదీ.

దానికి రోగమో రొస్టో వచ్చి చచ్చిపోయి ఉంటే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకొనేవాళ్లం. పరువు ప్రతిష్టలు గంగలో కలిపి పాడుపని చేసి చచ్చింది.” అంటూ విమల చెల్లెలు సుధ ఉదయం నుంచీ వెక్కి వెక్కి ఏడుస్తున్నది. మెదడ్లో రక్తనాళాలు తెగిపోయేంతగా ఉద్రేకపడిపోతున్నదా అమ్మాయి.

సుధ పెళ్లికావలసిన పిల్ల. విమల అట్లా లేచి పోవడం వల్ల తన భవిష్యత్తుకు దెబ్బ తగిలిందని ఆమె భావన. ఎవరి స్వార్థం వాళ్లది కదా మరి.

“ఇంటా వంటా లేని పనిచేసి తలవంపులు తెచ్చి పెట్టింది. ఇక నలుగురిలో తలెత్తుకొని తిరిగేదెట్టా,” అంటూ రాజిరెడ్డి ఒకవైపు బాధపడుతున్నాడు. లేచి పోయిన పిల్లకు తండ్రిగా ఊహించుకోవడమంటే అతనికి మింగుడుపడడం లేదు.

నిర్లిప్తంగా ఉన్నది విమల తల్లి పార్వతమ్మ మాత్రమే. ఇంటిల్లిపాదికీ పిడుగులాంటి ఈ దుర్వార్త ఉదయం తెలిసింది. అప్పట్నుంచీ ఆ ఇంట్లో ఇదీ వరస.

ఈ వార్తకు చలించకుండా ఉన్నది పార్వతమ్మ ఒక్కర్తే. ఆమె హృదయంలో బడబానలం ఉందో, మరొకటి ఉందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

చిన్నకూతురు సుధనూ, మొగుణ్ణీ కూడా ఓదార్చడానికే ఆమె ప్రయత్నిస్తున్నది.

సుధ నాగుబాములా కస్సున లేచింది. “అదంటే నీకు వల్లమాలిన అభిమానం. నీకు తగిన శాస్తి జరిగింది అనుభవించు,” అంది.

వాళ్లను సముదాయించడం తనవల్ల అయ్యే పని కాదని పార్వతమ్మ గ్రహించింది. గమ్మున ఉండిపోయింది. తండ్రీ కూతుళ్లిద్దరూ చెరొక మంచం కర్చుకొని పడుకున్నారు. బయట నుంచి అడపాదడపా ఎవరో ఒకరు ఆత్మీయుల ముసుగు తొడుక్కొని పరామర్శకని వస్తూనే ఉన్నారు. ఇంట్లో ఎవరన్నా ఛస్తేనో, జబ్బు పడితేనో పరామర్శకని వస్తే దాన్ని భరించవచ్చు. ఇది అట్టాంటిది కాదు. ఈ సానుభూతిని సహించడం పార్వతమ్మ చేతకాలేదు. మధ్యాహ్నం ఆమె ఒక మంచం తీసుకొని ముసుగుతన్ని పడుకుంది పరామర్శకు ఆస్కారం లేకుండా.

పొద్దుగూకుతుంటే పార్వతమ్మ ముసుగుతీసి మంచం మీద కూర్చుంది. ఉదయం కాఫీ తాగలేదు. మధ్యాహ్నం అన్నం తినలేదు. ఆమె పేగులు ఒకటే రొద చేస్తున్నవి.

“సుధా! ఇక లేచి కాసిని బియ్యం ఉడకబెట్టవే,” అంది పార్వతమ్మ.

“నీ కూతురు చేసిన పనికి కడుపు నిండిపోయింది. ఆకలిగా లేదు. నీకు ఆకలిగా ఉంటే వెళ్లివండుకో,” అంది సుధ కట్టె విరిచి పొయిలో పెట్టినట్లు.

పార్వతమ్మ దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. ఏ పాటుపడ్డా సాపాటు తప్పదు. పార్వతమ్మ వెళ్లి వంట ప్రయత్నంలో మునిగిపోయింది. వంటయితే చేసింది కానీ సుధ ఎంగిలి పడలేదు. మొగుడు ఎంగిలి పడలేదు. ఎంగిలి పడమని అడగడానికి పార్వతమ్మకు ధైర్యం చాల్లేదు. పిలిస్తే మరో నాలుగు అక్షింతలు వేయించుకోవాలి. ఇంకా చీకటిపడక ముందే పళ్లెంలో నాలుగు మెతుకులు పెట్టుకొని మజ్జిగ పోసుకొని తింది.

ఏమీ జరగనట్టు ఆమె అన్నం ముందు కూర్చోవడం చూస్తుంటే సుధకు అరికాలిమంట నెత్తికెక్కింది. తల్లి వైపు ఛీత్కారంగా ఒక చూపు చూసి ఈత చాప ఒకటి తీసుకొని నిచ్చెన మీదుగా మిద్దె మీదికి వెళ్లి పడుకుంది. తండ్రి కూడా కూతుర్ని అనుసరించాడు.

పార్వతమ్మ ఒక్కతే మిగిలిపోయింది. ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తున్నది. చాలాసేపు అక్కడే తచ్చాడి ఆమె ఒక చాప, దుప్పటీ తీసుకొని మిద్దె మీదికి వెళ్లింది. రాజిరెడ్డి ఆకాశంలోని నక్షత్రాల్ని లెక్క పెడుతున్నట్లుగా వెల్లకిలా పడుకొని ఉన్నాడు.

సుధ మోచేతి మీద ఒక చెంప ఆన్చి ఒత్తిగిలి పడుకుంది. ఆమె కళ్ల నుంచి కారే కన్నీటితో చెయ్యి తడిసిపోతున్నది. పార్వతమ్మ వాళ్లిద్దరి పొడా గిట్టనట్టు అలా దూరంగా వెళ్లి చాప పరుచుకొని పడుకుంది.

ఆకాశంలో అప్పటికే చంద్రుడు ఉదయించాడు. పిండారబోసినట్టు వన్నెల కాస్తున్నది. ఉన్నట్టుండి ఎక్కడో కుక్కలు మొరుగుతున్నవి. పార్వతమ్మ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నది. ఆమెకు పక్కా కుదరలేదు, నిద్రా రాలేదు. అటూ ఇటూ దొర్లుతూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఆమె గతాన్ని తలపోసుకోసాగింది.

నలుగురూ చూడడానికి తన జీవితం చాలా సాఫీగా సాగిపోయినట్లు అగుపిస్తుంది. ఒకరి జీవితం లోతుపొడుగులు మరొకరికి తెలియవు. అందులో ఉన్న అగాధాలు, నీలినీడలు మరొకరికి అర్థం కావు. భార్య అంతరంగం మొగుడికి తెలియదు. మొగుడి అంతరంగం భార్యకు తెలియదు. బిడ్డల అంతరంగాలు కనిపెంచిన తల్లిదండ్రులకే తెలియవు. అంతా కలిసి ఒకే కప్పు కింద జీవిస్తున్నట్లే ఉంటుంది. ఒకరి గుండె చప్పుళ్లు మరొకరికి వినిపించవు. తన ఆశలు ఏమిటో, తన అభిరుచులు ఏమిటో తన తలిదండ్రులకే తెలిసి ఉంటే రాజిరెడ్డితో తన పెళ్లి జరిగేదే కాదు. ముప్పయి అయిదేళ్ల జీవితం గడిచిపోయి, పెళ్లి అయి ఇరవైరెండు ఏండ్లు గడిచింది.

చదవండి :  అంజనం (కథ) - వేంపల్లె షరీఫ్

పెళ్లినాటికి పదమూడేళ్లు తనకు. అభం శుభం తెలియదు. అప్పటికింకా ఓణీలు వేసుకుంటున్నది. పెళ్లిచూపుల రోజు చీర కట్టారు. ఆ చీర తనకు ఇరుకు అనిపించింది. కొయ్యబొమ్మలా వెళ్లి పెళ్లిచూపులకు కూర్చున్నది. ఆ తతంగమంతా అయిదు నిమిషాల్లో అయిపోయింది. తాను లేచి ఇంట్లోకి వెళ్తూ అలవోకగా అలా ఒకసారి రాజిరెడ్డి వైపు చూసింది. కడుపులో దేవినట్టయింది. గొంతులో శ్వాస గొంతులోనే సుళ్లు తిరిగింది. ఒకక్షణం పాటు నిర్విణ్ణురాలయిపోయింది. రాజిరెడ్డి మరీ అంత ముతకగా ఉంటాడని పార్వతమ్మ ఊహించలేదు.

రాజిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత కనీసం అమ్మయినా తన ఇష్టాయిష్టాలు కనుక్కోదా అని పార్వతమ్మ మనసులో అనుకుంది కానీ, అలాటిదేం జరగలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు.

గొర్రె నడిగి దేవర చెయ్యరు. ఆడపిల్లల అభిప్రాయాలడిగి పెళ్లిళ్లు చెయ్యరు. పాపం పార్వతమ్మకు ఈ విషయం తెలియదు.

రాత్రి భోజనాలయ్యాక తల్లి ఆరుబయట అరుగు మీద పడుకొని ఉంది. పార్వతమ్మ మెల్లగా పిల్లిలా వెళ్లి తల్లి దగ్గర కూర్చుంది.

“ఏం పాపా?” అంది తల్లి అనునయంగా.

“నాకు ఈ సంబంధం ఇష్టం లేదమ్మా” అంది గొణుగుతున్నట్ట్లుగా.

నిజానికి ఈ సంబంధం బాలమ్మకూ ఇష్టం లేదు. పిల్లకాయను చూసినప్పటి నుంచీ ఆ తల్లికి కడుపులో ఆవాలు పోసినట్టు బాధ కలిగింది. ఆ సంబంధం తెచ్చిన మొగుని మీద కుతికెలదాకా కోపం ముంచుకొచ్చింది. ఆ కోపాన్ని వెళ్లగక్కబోతే కుటుంబ పరిస్థితులు జ్ఞాపకం వచ్చాయి. తమది పదెకరాల వ్యవసాయం. ఆస్తికి మించిన అప్పులున్నవి. ఇక అప్పులు పుట్టే స్థితికాదు. ఇంతకుమించిన సంబంధం తేవడం ఆయనకు మాత్రం ఎలా సాధ్యమవుతుందిలే అన్న ఆలోచన వచ్చి కోపాన్నిదిగమింగింది. సర్దుకుపోవాలనుకుంది. కాలం తప్పితే కందులు గుగ్గిళ్లు అవుతాయన్న సామెతగా, తమది మంచికాలం కాదులెమ్మని తనకు తాను సర్ది చెప్పుకుంది.

“మంచి మనువెే పిచ్చిపిల్లా. పిల్లకాయకు కాలొంకర లేదు. కన్నొన్కర లేదు. ఆడబిడ్డలు లేరు. అత్త మామలు లేరు. ఏ దురలవాట్లు లేవు. కడకు బీడీ కూడా కాల్చని బుద్ధిమంతుడు. అంతకన్నా ఏం కావాలమ్మా” అంటూ అబ్బాయి క్వాలిఫికేషన్ల గురించి దండకం చదివింది.

“అక్షరం ముక్క పోబడి కూడా తెలియదు. కూలి చేసుకొని బతుకుతున్నాడు. ఇంత దరిద్రపు మనువు కంటే మీ కండ్లకు ఇంకో మంచిది కనబడలేదా? ఒక అడవిలో మృగాన్ని తెచ్చి నాకంటగడుతున్నారు,” అంది ఆవేశంగా పార్వతమ్మ.

“మన ఊరికి దగ్గరే టౌనుండబట్టి రోజూ నడిచి వెళ్లి పదిదాకా సదువుకోగలిగావు. ఆ సదువు కూటికి రావాలా? కూరకు రావాలా? నువ్వేదో పెద్దింట్లో పుట్టినట్టు వగలుపోకు. దగ్గర్జోనే మనమూ కూలికి వెళ్లవలసిన రోజులున్నాయి,” అంది ఆమె తల్లి బాలమ్మ.

ఆ సమాధానం పార్వతమ్మకు సంతృప్తినివ్వలేదు. తల్లిని చూస్తే ఆమెకు అసహ్యం కలుగుతున్నది. “కుతి తీర్చుకుంటే సరిపోదమ్మా అందుమూలంగా బిడ్డలు పుడతారని, వాళ్లకి ఉన్నంతలో కాస్త మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయాలనే ఇంగిత జ్ఞానముండాలి. పోనీ పుట్టగానే ఉగ్గులో సానవ గింజంత విషం కలిపి అంగిట్లో పొయ్యకపోయావా పీడా విరగడయ్యేది,” అంది జీరబోయిన గొంతుతో పార్వతమ్మ. కల్లాకపటం లేని పార్వతమ్మలాటి పిల్లలు మాత్రమే అలా కుండబద్దలు గొట్టినట్లు మాట్లాడగలరు. కానీ, ఆ తల్లికి గుండెల్లో బాకుతో కుమ్మినట్టయింది. నోటమాట రాలేదు. ఈ వివాహవ్యవస్థకు నేపథ్యం ఆ పసిబిడ్డకు తలియదు. ఎదురుగా ఉన్న తల్లి మీద కసి తీర్చుకుంది.

కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగిపోదు. పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి ఆగిపోతే బాగుండునని చివర నిమిషం వరకు పార్వతమ్మ అనుకుంటూనే ఉన్నది. ఒకరోజు రాత్రి పార్వతమ్మకు ఒక కల వచ్చింది. పెళ్లి కొడుకు చచ్చిపోయినట్టు! మెలకువ వచ్చి కల చెదిరిపోయింది. తర్వాత ఆమెకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. కుమిలి కుమిలి ఏడ్చింది. పార్వతమ్మ కన్న కలలు ఏవీ నిజం కాకుండానే పెళ్లి జరిగిపోయింది. ఆమె కన్న కలల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా ఆమె మెడలో రాజిరెడ్డి తాళి కట్టాడు. వివాహంతో స్త్రీకి కష్టాలు మొదలవుతాయన్నది పాక్షిక సత్యం. పార్వతమ్మ విషయంలో మాత్రం ఇది అక్షరాల నిజం.

చదవండి :  సీమ బొగ్గులు (ముందు మాట) - వరలక్ష్మి

రాజిరెడ్డి ఇంట్లో కాలు పెట్టగానే నాలుగువైపులా ఒకసారి పరకాయించి చూసింది, పార్వతమ్మ. ఆమెకు ఒళ్లు జలదరించింది. మూడంకణాల గూడమిద్దె. ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు పార్వతమ్మ సమస్య. పరమ అసహ్యంగా ఉన్నది. ఇల్లంతా కొక్కులు తవ్వి బండలకింద మన్ను పైకి వచ్చింది. ఆ మట్టి నుంచి దుర్వాసన వస్తున్నది. ఎన్నో ఏళ్లుగా బూజు దులిపినట్టు లేదు. దంతెలనిండా, గోడలనిండా బూజు! వాటికి తోడు ఆ చిన్న ఇంట్లో ఒక జత పొట్టేలు పిల్లలు. ఒక పిల్లల కోడి. అవి ఇల్లంతా స్వేచ్చగా తిరిగేవేమో ఎక్కడ చూసినా పొట్లి పెంటికలు. కోడిపెంట. పార్వతమ్మకు డోకు వచ్చినంత పరైంది. ఈ ఇంట్లో ఈ మనిషికి నిద్ర పడుతున్నదంటే ఆ మనిషి వట్టి జడపదార్థమని పార్వతమ్మ నిశ్చయించుకుంది.

“ఆడదిక్కు లేకపోతే కొంప ఇలాగే ఉంటుంది,” అన్నది వెంట వచ్చిన తల్లి సమర్థింపుగా.

“నిజమే కదా మరి,” అన్నది వెటకారంగా పార్వతమ్మ. ఆ ఇల్లు ఒక కొలిక్కి రావాలంటే మూడు రోజులు పట్టింది.

రాజిరెడ్డిని కొంచెమైనా సంస్కరించగలనేమోనని పార్వతమ్మ మూడు సంవత్సరాలు ప్రయత్నించింది.

రోజూ స్నానం చేసి ఉన్నంతలో మంచి బట్టలు వేసుకోమని, తల దువ్వుకోమని సతపోరేది.

“కాయకష్టం చేసుకొనేవాడికి షోకులెందుకు,” అంటూ విసుక్కొనేవాడు రాజిరెడ్డి.

“మరి కాయకష్టం చేసుకొనేవారికి పెండ్లాలెందుకు?” అందామనుకొనేది పార్వతమ్మ. ధైర్యం చాలక ఊరుకొనేది.

ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మరమనిషిలా కుతి తీర్చుకొనేదానికి మీదపడేవాడు. పార్వతమ్మకు ఆముఖం చూడాలంటే అసహ్యం. అతని స్పర్శ అంటే అసహ్యం. గట్టిగా కళ్లు మూసుకొని పడుకునేది.

చిత్రమైన విషయమేమిటంటే, మూడేళ్ల తర్వాత ఆమె కూడా ఒక జడపదార్దంలా మారిపోయింది. తల దువ్వుకొనేది కాదు. బట్టలు మార్చుకొనేది కాదు. శూన్యంలోకి చూస్తూ కూర్చొనేది. ఏదో అసంతృప్తితో వేగిపోయేది.

ఆమె కడుపున ఒక కాయ కాసి ఉంటే అదోరకం. కానీ, దానికీ నోచుకోలేదు.

ఆమెకు తన బతుకు తెల్లవారని రాత్రిలా కనిపించసాగింది.

ఒకరోజు మధ్యాహ్నం రాజిరెడ్డి కలబందనారతో పేనుకుంటున్నాడు. పగ్గాలు, మోకులు పేనడమన్నది అతనికి అదనపు రాబడి. సాయంత్రం వరకు తలొంచుకుని అలా పేనుకుంటూనే ఉంటాడు. పార్వతమ్మ కింద చాప పరుచుకొని పండుకొనేది. నిద్రపోదామంటే నిద్ర రావడంలేదు. అప్పుడు వచ్చాడు విశ్వనాథరెడ్డి అక్కడికి. ఆ అబ్బాయి రాజిరెడ్డి సేద్యానికి వళ్లే రంగారెడ్డిగారి అబ్బాయి. అతని బియ్యే పూర్తయి ఉద్యోగం దొరక్క ఇంటి దగ్గరే ఉంటున్నాడు. సాధారణంగా ఆ అబ్బాయి రాజిరెడ్డి ఇంటికి రాడు. ఎప్పుడో రాజిరెడ్డితో పనిబడితే తప్ప.

“పడమటి చేను పొద్దున్నే ధనియాలు విత్తాలంట. నాన్న నీతో చెప్పమంటేనూ….” అన్నాడు విశ్వం.

“సరే. అట్లనే,” అన్నాడు రాజిరెడ్డి.

“తూర్పు చేను దుక్కి బాగా వస్తున్నదా?” విశ్వం అడిగాడు.

“దుక్కికేం బాగా వస్తున్నది. ఈ ఎద్దులతోనే నా తాడు తెగుతున్నది. దాపటిదేమో పెడసరి గొడ్డయిపోయే. వలపటిదేమో బండరాయి గొడ్డయిపోయే. రెంటికీ జత పాటు కలవడంలేదు. వలపటి దాన్ని మార్చకపోతే లాభంలేదు.” అన్నాడు రాజిరెడ్డి.

పడుకొని ఉన్న పార్వతమ్మకు మొగుడి మాటల్లో ఒక జీవిత సత్యం స్ఫురించింది. జతపాటు కలవకపోతే గొడ్లను కూడా మారుస్తారు. కానీ మనుషుల మాటేమిటి?

“పార్వతక్కా కొంచెం మంచి నీల్లిస్తావా” అన్నాడు విశ్వం.

పార్వతమ్మ గబుక్కున లేచి పైట సవరించుకొని ఇంట్లోకి వెళ్లి ఒక చేత్తో మంచినీళ్ల చెంబూ, మరోచేత్తో గ్లాసూ పట్టుకొని వచ్చింది.

గ్లాసు అందిస్తుంటే అతని చేతివేళ్లు తగిలాయి.

కావాలనే తగిలించాడని ఆమెకు అర్థమైపోయింది. కానీ, పార్వతమ్మ ముఖంలో ఏ భావమూ వ్యక్తం కాలేదు. చెంబూ, గ్లాసూ ఇంట్లో పెట్టి యథాస్థానంలో వచ్చి కూచుంది.

రాజిరెడ్డి తలొంచుకొని పగ్గాలు పేనుకుంటూనే ఉన్నాడు. విశ్వం మాటిమాటికీ పార్వతమ్మ వైపు దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. ఆ చూపులకు పార్వతమ్మ సిగ్గుతో కుంచించుకుపోయింది.

చదవండి :  ఇచ్ఛాగ్ని (కథ) - కేతు విశ్వనాథరెడ్డి

ఆ తర్వాత అతను పార్వతమ్మ ఇంటికి చాలా సార్లు వచ్చేవాడు. కల్పించుకొని ఆమెతో మాట్లాడేవాడు. పర్యవసానంగా ఆమెలో అణగారిన కోర్కెలు నిప్పు కణికల్లా జ్వలించసాగాయి. కానీ బయటకు కనిపించనీయలేదు ఆమె కోర్కెల్ని.

ఒకరోజు రాజిరెడ్డి లేని సమయంలో వచ్చాడు విశ్వం. అతను ఎందుకు వచ్చాడో పార్వతమ్మకు అర్ధమయింది. గబగబా వచ్చి తలవాకిట్లో నిలబడి బజారుకేసి చూస్తున్నది. విశ్వానికి చాలా నిరాశ కలిగింది.

“ఇంట్లోకి రానా?” అతను చాలా మంద్రస్వరంతో అన్నాడు.

ఆమె బజారుకేసి చూస్తూనే, “నడివూర్లో పట్ట పగలు ఏమిటిది? కొంచెమన్నా ఇంగిత జ్ఞానముండాలి,” అంది.

విశ్వానికి పెద్ద ఊరట కలిగింది.

“పోనీ… ఎక్కడ… నువ్వే చెప్పు?”

“సాయంత్రం నాలుగింటికి మీ తోట దగ్గరికి వస్తాను. ఇంట్లో నుంచి బయటకు రా” అంది.

“నిజం” అన్నాడు.

“నిజం” పార్వతమ్మ అంది.

అతను బయటకు వెళ్లిపోయాడు. ఆమె లోపలికి వచ్చింది. ఆమె లోపల ఒక అంతర్మథనం ఆరంభమైంది. కోర్కెలు ఒకవైపు బుసలు కొడుతున్నాయి. తప్పు చేస్తున్నానేమో అనే అపరాధభావన మరొకవైపు.

కట్నాలతో ముడిపడి ఉన్న ఈ వివాహవ్యవస్థలో ప్రేమకు, శృంగారానికి తావులేదు. అవి పుస్తకాల్లో మాత్రమే లభ్యమవుతాయి. ఈ వివాహవ్యవస్థలో చాలా మటుకు ఉన్నది వ్యభిచారం.

కంటికి రెప్పచాటుగా ఆ వ్యభిచారం జరిగిపోతే సమాజం పెద్దగా పట్టించుకోదు. ఈ విషయాలు పార్వతమ్మకు తెలియవు. అందుకే సాయంత్రం వరకు ఆమెలో అంతర్మథనం జరుగుతూనే ఉంది. కానీ, ఆమె ప్రమేయం లేకుండా కాళ్లు సరిగ్గా నాలుగింటికి విశ్వం తోటవైపు లాక్కెళ్లాయి.

మనువు

“వచ్చావా? రావేమో అనుకున్నాను.”

ఆమె మౌనంగా ఉండిపోయింది.

విశ్వం ఎంత తమకంలో ఉన్నాడో ఒక్క ఉదుటున ఆమెను ఎత్తుకొని తోటలోకి పరిగెత్తాడు. ఆమె ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది.

మూడు సంవత్సరాలుగా ఆమెలో ఉన్న డొల్లను అతను అర్ధగంటలో పూడ్చాడు. ఎండిన గుండె మీద తొలకరి జల్లు కురిసినట్టయింది. అతనితో మూడేళ్లు ఆ సంబంధం కొనసాగించింది. ఇద్దరు కూతుళ్లూ అతని వల్లే పుట్టారు. ఆ తర్వాత అతను ఉద్యోగంలో చేరిపోయాడు. మళ్లీ ఆమెకు మామూలు జీవితమే.

తీగ కదిపితే డొంకంతా కదిలినట్టు విమల లేచిపోవడంతో గతం తాలూకు కథ ఇవాళ ఒకసారి మళ్లీ ఆమె మనోనేత్రం ముందు మెదిలింది. కళ్లు చెమ్మగిల్లాయి. లేచి కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంది. అప్పటికి చంద్రుడు బాగా వాటాలాడు. తొలిజాము కోళ్లు కూస్తున్నవి. సుధ ఇంకా నిద్రపోలేదు. పార్వతమ్మ లేచి వచ్చి సుధ దగ్గర కూర్చున్నది. సుధ ఇంకా వెక్కివెక్కి ఏడుస్తూనే ఉన్నది.

“ఏడ్వడం ఎందుకే? ఏమైందని ఇప్పుడు?” అంది పార్వతమ్మ మందలింపుగా.

“ఇలాంటి పని చెయ్యడానికి సిగ్గూ శరమూ లేకపోయిందే అని ఏడుస్తున్నాను,” అంది ముక్కు చీదుతూ సుధ.

పార్వతమ్మ ఒక నిట్టూర్పు విడిచి, “అది తనకు నచ్చినవాడి వెంట ఈ పంజరం నుంచి లేచిపోయింది. మంచి మనువు కుదర్చడం మాకు ఎలాగూ సాధ్యం కాదు. ఆ పనేదో ఆ పిల్లే చేసింది. నా మటుకు నాకు నెత్తి మీది నుంచి ఒక బరువు దించినట్లుగా ఉంది. నా బాధంతా ఇప్పుడు నీకోసం. నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టగలమో లేదోనన్నది నా బాధ. నీ బతుకు నా బతుకు లాగా అయిపోతుందేమోనని నా బాధ,” అన్నది.

సుధకు తల్లి మాటల్లో ఒక చేదు నిజం స్ఫురించింది. ఒక అనిర్వచనీయమైన భీతి వన్నుపూస గుండా జరజరా ప్రవహించినట్టయింది. ఒక క్షణం అయోమయంగా తల్లివైపు చూసి పసిబిడ్డలా పార్వతమ్మను గట్టిగా వాటేసుకుంది.

(ఇండియాటుడే ౩ ఫిబ్రవరి 1998)

రచయిత గురించి

స్వర్గీయ సొదుం జయరాం గారు కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీరి ప్రసిద్ధ కథలు. వీరి కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి. 2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్).

ఇదీ చదవండి!

సాహిత్య ప్రయోజనం

ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: