బ్రహ్మణి స్టీల్స్‌ను ఆపొద్దు …

కడప: రాయలసీమ ప్రజల ఉపాధికి అవకాశాలున్న బ్రహ్మణి స్టీల్స్‌ను రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని రాయలసీమ కార్మిక, కర్షక సమితి డిమాండ్ చేసింది. వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్దేశించిన ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి ఆరోపించింది.

స్థానిక ప్రజల ఉపాధి కోసం తలపెట్టిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా పార్టీలకు అతీతంగా అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి గురువారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ… వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఈ ప్రాజెక్టును జిల్లాలో ఏర్పాటుకు సంకల్పించారని, అయితే ఇప్పుడు రాజకీయాలతో ముడిపెట్టి ఆ ప్రాజెక్టును రాకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

చదవండి :  6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి

రాయలసీమలాంటి ప్రాంతాల్లో ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఎవరు తలపెట్టినా స్వాగతిస్తామని, ప్రస్తుతం బ్రహ్మణి స్టీల్స్ వల్ల 10 వేల మందికి ప్రత్యక్షంగా మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2007 జూన్‌లో ఈ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించారని, తొలి దశ పనులు వేగంగా జరిగినప్పటికీ వైఎస్ మరణానంతరం అనేక అడ్డంకులు కల్పించిన కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ బతికి ఉంటే ఆ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి ఉత్పత్తి ప్రారంభమయ్యేదని చెప్పారు. అప్పట్లో తొలి దశ పనులు చూసిన తర్వాత జిల్లా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆశించామని, అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడంతో ఆ ప్రాజెక్టు కోసం సీమ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

చదవండి :  కిడ్నాపైన కాంట్రాక్టర్ విడుదల

ఈ ప్రాజెక్టులో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే ఓఎంసీపై చర్య తీసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టును రాకుండా అడ్డుకోరాదని కోరారు. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టు పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే జిల్లాకు, రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన వారవుతారని చెప్పారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతంలో ఒక భారీ ప్రాజెక్టు రాకుండా అడ్డుకోవద్దన్నారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టడానికి ఎవరు ముందుకొచ్చినా ప్రోత్సహించడమన్నది రాజశేఖరరెడ్డి నైజమని, ఇలాంటి ప్రాజెక్టులను రాష్ట్రంలో అంగీకరించని పక్షంలో మరోచోటికి తరలివెళ్లేవని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చదవండి :  ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

ఎంతో వెనుకబడిన జిల్లా అయినందునే విశాల దృక్పథంతో ఇక్కడ ఆ భారీ ప్రాజెక్టు రావాలని వైఎస్ ఆకాంక్షించారని, ఇందులో ఆయనకు ఎలాంటి ఉద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లా ప్రజల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఈ భారీ ప్రాజెక్టు పూర్తయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు.

ఇదీ చదవండి!

Steel Authority of India

ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

కడప: జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు ఉన్న అనుకూల, అననుకూల పరిస్థితులపరిశీలకై జిల్లాకు వచ్చిన 8 మంది సెయిల్‌(Steel Athority …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: