కరపత్రాలను విడుదల చేస్తున్న కట్టా నరసింహులు, ధర్మ ప్రచార మండలి సభ్యులు
జనవరి1న ఒంటిమిట్టలో పోతన భాగవత పద్యార్చన
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వేలాదిగా తరలిరావాల్సిందిగా 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నిర్వాహకులు పిలుపునిచ్చారు.
బుధవారం స్థానిక తితిదే కల్యాణమండపంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను తితిదే ధర్మప్రచార మండలి సభ్యులతో కలిసి పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు ఆవిష్కరించి ప్రసంగించారు. లోకహితాన్ని తెలిపిన పోతన భాగవత పద్యాలను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమం ఇదన్నారు. తెలుగు వికాసాన్ని కోరుకునే తల్లిదండ్రులు, పవిత్ర భారతీయ సంస్కృతి పిల్లలకు అబ్బాలనుకునే పెద్దలు ఈకార్యక్రమానికి విద్యార్థులను పంపించాల్సిందిగా విన్నవించారు. జనవరి 1న ఉదయం 8.30గంటల నుండి పద్యార్చన కార్యక్రమం ఉంటుందన్నారు.
కరపత్రంలో ఇచ్చిన పది పద్యాలను చిన్నారులు నేర్చుకుని రాయగలిగితే చాలన్నారు. వారందరికి భాగవత మాధుర్యాన్ని పరిచయం చేయడమే కాక సుభాషిత పద్యాల పుస్తకం, పెద్దబాల శిక్ష , పోతన భాగవత సుమధుర పద్యాలు రాముని సన్నిధిలో ప్రసాదంగా అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా కరపత్ర ఆవిష్కరణలో తితిదే ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాధికారి కళావతి, సహాయ కార్యక్రమాధికారి హరినాథ్, ధార్మిక సలహామండలి కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సలహామండలి సభ్యులు కాల్వప్రభాకర్‌రెడ్డి, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.