
నో డౌట్…పట్టిసీమ డెల్టా కోసమే!
తేల్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
వేమూరి రాధాకృష్ణ – ఆంధ్రజ్యోతి మీడియా గ్రూపుకు అధిపతి, ఆం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తుడు, ఆంతరంగికుడు అని తెదేపా వర్గాలు చెబుతుంటాయి. రాధాకృష్ణ గారు ‘కొత్తపలుకు’ పేర ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన సంపాదకీయంలో ‘పట్టిసీమ’ అసలు గుట్టు విప్పినారు. ఇదే విషయాన్ని కడప.ఇన్ఫో రాస్తే అదంతా ఊహే అని తీసిపారేశారు కొంతమంది.
‘వాస్తవానికి, పట్టిసీమ అనేది తాత్కాలికంగా చేస్తున్న ఏర్పాటు మాత్రమే! పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా ఏడెనిమిదేళ్లు పడుతుందని వారికి కూడా తెలుసు. అంతవరకైనా, కృష్ణా డెల్టాను ఆదుకోవచ్చునన్న ఉద్దేశంతో 1300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు ఎదురవుతున్నందున.. వాటినుంచి నీరు సాఫీగా రాకపోయినా కృష్ణా డెల్టా దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో తాత్కాలికంగా చేస్తున్న ఈ ఏర్పాటుతో జాతీయ స్థాయిలో యాగీ చేయడంలోని ఔచిత్యం ఏమిటో జగన్‌కే తెలియాలి. ‘ అని రాధాకృష్ణ గారు విస్పష్టంగా వ్యాఖ్యానించారు.
ఏ ప్రాంతం ఎటు పోయినా పర్లేదు, కృష్ణా డెల్టాకు నీళ్ళకు ఇబ్బంది లేకుంటే చాలు అన్నది తెదేపా ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది. అందుకే డెల్టా ఆయకట్టుకు ఎక్కడా ఇబ్బంది రాకూడదని చాలా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. మరి ప్రతిపక్షమైనా సీమ పక్షాన గొంతు విప్పుతుందా?
మొత్తానికి ఇన్ని రోజులూ ‘పట్టిసీమ’ రాయలసీమ కోసమే అంటూ తెదేపా నేతలు, తెలుగు మీడియా, తెలుగు మేధావులూ చెబుతూ వచ్చింది ఉత్తిమాటే అని రాధాకృష్ణ గారు కూడా అభిప్రాయపడుతున్నారు అన్నమాట. మరి సీమలోని నాలుగు జిల్లాలకు చెందిన తెదేపా నేతలు, కడప జిల్లాలో పట్టిసీమ పేర ప్రదర్శనలు చేసిన నేతలూ ప్రజలకు ఇప్పుడేమి చెబుతారో?