థామస్ మన్రో

సర్ థామస్ మన్రో – 2

ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్‌కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్‌కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు.

ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్‌లతో జరిగిన రెండు, మూడు మైసూరు యుద్ధాలలో పాల్గొని గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించి బ్రిటీష్ పార్లమెంట్ సత్కారాలను అందుకొన్నాడు. తరువాత అంతకన్నా ఎక్కువ తన పరిపాలన దక్షత వల్ల సంపాదించుకొన్నాడు. మన్రో 1780 నుంచి 1792 వరకు ఈ పన్నెండేళ్ల కాలంలో సైనిక జీవితాన్ని గడిపాడు. 1792లో కుదిరిన శ్రీరంగపట్నం సంధిలో మూడో మైసూరు యుద్ధం ముగిసింది. దీని ప్రకారం టిప్పు తన రాజ్యంలోని దాదాపు సగ భాగాన్ని కంపెనీకి, మిత్రుడైన హైదరాబాదు నవాబు అయిన నిజాంకు, మహారాష్ట్రులకు దత్తత చేశాడు.

పశ్చిమ తీరంలోని మలబార్ జిల్లాను, భారా మహాల్‌ను, ధర్మపురిని, మదురై జిల్లాలోని కొంత భాగాన్ని కంపెనీ తన వాటాగా స్వీకరించింది. భారా మహాల్ పాలనా బాధ్యతల్ని నిర్వహించేందుకు అప్పటి గవర్నర్ అయిన జనరల్ కార్న్ వారీస్ కెప్టెన్ రీడ్‌ను రెవిన్యూ సూపరిండెంటుగా నియమించారు. రీడ్‌కు సహాయకులుగా థామస్ మన్రో 1792 నుంచి 99 వరకు ఈ బాధ్యతను నిర్వహించాడు.

తనకు సంక్రమించిన భూబాగాన్ని హైదరాబాదు నవాబు కంపెనీకి దత్తత చేశాడు. అందువలన దానికి దత్తమండలాలు అని పేరు వచ్చింది. అటు తరువాత ఈ ప్రాంతానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాయలసీమ అని నామకరణము చేశారు.

పాళెగాళ్లను అణచిన వైనం

మన్రో కలెక్టరుగా వచ్చిన తరువాత అస్తవ్యస్తంగా ఉన్న పాలనా వ్యవస్థను చక్కదిద్దడం, ఈస్టిండియా కంపెనీ వారి ఆదాయాన్ని పెంచడం తన ప్రధాన కర్తవ్యమని భావించాడు. తన అభివృద్ధి కార్యక్రమాలకు పాళెగాళ్లు అడ్డు అని మన్రో భావించాడు. అయితే నేరుగా పాళెగాళ్లను తొలగించడానికి మద్రాసు గవర్నరు గాని, కంపెనీ బోర్డు డైరెక్టర్లుగానీ సుముఖంగా లేరని గ్రహించాడు. పాళెగాళ్లను తొలగించనిదే కంపెనీ పాలన సుస్థిరపరచుకోవడం అసాధ్యమని మన్రో గ్రహించాడు. పాళెగాళ్లను అణచుటకు పథకమును సిద్ధం చేసుకున్నాడు.

ముందుగా పాళెగాళ్లు కంపెనీకి చెల్లించాల్సిన కప్పాన్ని భూమిశిస్తుగా మార్చాడు. తరువాత భూమిశిస్తును హఠాత్తుగా పెంచాడు. మన్రో ఎంత పెంచాడంటే మంచి ఆదాయపు వనరులు ఉన్న పాళెగాళ్లు సైతం చెల్లించలేనంత స్థాయికి భూమిశిస్తును పెంచాడు. దాంతో పాళెగాళ్లలో కలవరం బయలుదేరింది. ఇలాంటి పరిస్థితులలో మన్రో ఒక తీర్మానాన్ని జారీ చేశాడు. కంపెనీకి తెలియకుండా రైతుల నుంచి ఎవరు శిస్తులు వసూలు చేసినా, కంపెనీ తరపున శిస్తు వసూలు చేసేవారిని ఎవరైనా అడ్డగించినా ప్రైవేటు సైన్యాలు ఎవరు తయారుచేసుకున్నా వారిని తిరుగుబాటుదారులుగా పరిగణిస్తామనేది ఆనాటి ఉత్తర్వు సారాంశం. ఈ ఆజ్ఞలను ధిక్కరించిన పాళెగాళ్లను క్రూరంగా అణచివేశాడు.

చదవండి :  వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

1802 నాటికి దత్త మండలంలో ఉన్న పాళెగాళ్ల వ్యవస్థను మన్రో తుడిచిపెట్టాడు. ఒకరిద్దరు పాళెగాళ్లు, అడపాదడపా తిరుగుబాటు చేసి తప్పించుకుని తిరుగుతున్నవారు పెద్ద సమస్య కాలేదు. (తిరుగుబాటు చేసిన వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖుడు) మన్రో వేముల పాళెగాని పట్ల ప్రవర్తించిన వైఖరిని కంపెనీ డైరెక్టర్ తప్పు పట్టారు. అయితే మన్రో తన వైఖరిని సమర్థించుకున్నాడు. పాళెగాళ్లు ఉన్నంతవరకు కంపెనీ పాలన స్థిరపడటం గానీ, కంపెనీ ఆదాయం పెంచుకోవడం గాని సాధ్యపడదని వాదించాడు.

రైత్వారీ విధానం

మన్రో ఒకవైపు పాళెగాళ్ల అడ్డు తొలగించాడు. మరోప్రక్క రైత్వారీ విధానాన్ని ప్రవేశ పెట్టడానికి ఏర్పాటు ప్రారంభించాడు. 1802వ సంవత్సరములో జిల్లాలోని భూములన్నింటినీ సర్వే చేయమని ఆర్డరు జారీ చేశాడు. గతంలో రీడ్ నాయకత్వంలో పని చేసినప్పుడు రైత్వారీ శిస్తు విధానాన్ని అమలు చేయడంలో మన్రో అప్పటికి కొంత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్మ మండలంలో కూడా రైత్వారీ పద్ధతిని అమలు చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు.

మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో కడప జిల్లాలో భూమి సర్వే ప్రారంభమైంది అప్పుడే. ఆ సర్వేని అప్పట్లో వైమైఫ్ అని పిలిచేవారు. భూమిని కొలవడానికి 33 అడుగులు ఉన్న గొలుసును ఉపయోగించారు. 40 చదరపు అడుగులు గొలుసుల ప్రాంతాన్ని ఒక ఎకరంగా పరిగణించాడు. పర్వతాలు, గుట్టలు లెక్కించక మొత్తము జిల్లాలోని భూములన్నింటిని కొలిపించి, పొలాలన్నింటిని సర్వే నెంబర్లు కేటాయించాడు. ఏ సర్వే నెంబరు గల పొలం ఎవరు సాగు చేస్తున్నారో తెలిసేవిధంగా ఒక జాబితాను తయారుచేశాడు. భూమి కొలతలు పూర్తి అవగానే భూములను వర్గీకరింపచేసే పనిని చేపట్టాడు. సాగుబడి అయిన భూమి ఎంత అందులో సాగు చేయని భూమి ఎంత అని లెక్క కట్టాడు. 1806 నాటికి ఈ కార్యక్రమము పూర్తి అయింది. దత్త మండలాలలో 120 లక్షల ఎకరాలు సాగులోనికి ఉన్న భూమి. అందులో కేవలం 32 లక్షల ఎకరాలు మాత్రమే సాగు అవుతున్న భూమి.

చదవండి :  శివరామకృష్ణన్ కమిటీ నివేదిక

సాగు అవుతున్న భూములను ఆయా గ్రామ కరణాల సహాయంతో మెట్ట, మాగాణి భూములుగా వర్గీకరించాడు. పంట దిగుబడులను బట్టి మెట్ట భూములను, మాగాణి భూములను తరగతులుగా వర్గీకరించాడు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క జిల్లా నుంచి ఎంత ఆదాయం వస్తుందో ముందుగా అంచనా వేసి అప్పుడు శిస్తు నిర్ణయించేవాడు. ఆ శిస్తును గ్రామాల వారిగా పంపకం చేసి, ఒక్కొక్క గ్రామంలో ఏ రైతు ఎంత చెల్లించాలో నిర్ణయించేవాడు. పంటలు సరిగా పండని భూములకు గ్రామాలకు శిస్తు విషయంలో మినహాయింపు ఇచ్చాడు.

ఇలా రైత్వారీ పద్ధతిని అమలు జరిపిన తరువాత 1806, 1807లో వసూలు అయిన భూమి శిస్తుల మొత్తం 17 లక్షల రూపాయలు. రైత్వారీ పద్ధతిని అమలు చేయడం ద్వారా కంపెనీ ఆదాయాన్ని 5 లక్షల రూపాయలు అదనంగా పెంచాడు. ఆర్థికంగా కంపెనీకి లాభదాయకమైన ఈ అంశాన్ని చూపెట్టి మన్రో రైత్వారీ పద్ధతికి అనుకూలంగా తన వాదనను బలపరచుకున్నాడు. ఈ పద్ధతే అటు తరువాత 1920 వరకు కొనసాగింది. ఈ శిస్తు విధానాన్ని ముందుగా ప్రొద్దుటూరు, కడప తాలూకాలలో అమలు చేశాడు. 1824లో కడప జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి రైత్వారీ పద్ధతిని ఖచ్చితంగా అమలు జరిగేటట్లు చేశాడు.

భారతీయ సంస్కృతితో అనుబంధం

భారతీయ హిందూమతం, హిందూ సంస్కృతిని మన్రో అభిమానించేవాడు. కడప జిల్లాలో పులివెందుల తాలూకాలో ఉన్న వీరన్నగట్టుపల్లెలో గండి క్షేత్రం ఉంది. ఇక్కడ వీరాంజనేయస్వామి భక్తాభీష్ట వరప్రదుడు. ద్వాపరయుగమున రామభద్రునకు స్వాగతం చెప్పడానికి వాయుదేవుడు రెండు కొండలకు బంగారు తోరణము కట్టెను. వాయుదేవుడు కట్టిన బంగారు తోరణము అవసానదశలో ఉన్న మహాభక్తులకు కనిపిస్తుందని నమ్మకము. మన్రోకు ఈ తోరణము 1824లో కనిపించింది. కనిపించిన ఆరు మాసములలో ఆయన చనిపోయారు.

సిద్ధవటమునకు 5 మైళ్ల దూరములో ఉన్న పేరూరు అన్న గ్రామంలో ఓబులేశుని కోనలో ఒక తెల్లటి అశ్వముపై ధవళకాంతులతో ఒక మహా పురుషుడు కనిపించెను. ఆయన భగవంతుడు అని మన్రో నమ్మకం. కడప జిల్లాలోని దేవాలయ మరమ్మత్తులకు దైవిక పూజలకు, పర్వదినములలో జరిగే వేడుకలకు మాన్యాలను ఏర్పాటు చేశారు. కమలాపురం తాలూకాలోని పెద్దచెప్పలి వద్ద ఉన్న అగస్త్యేశ్వర దేవాలయము, చెన్నకేశవాలయములకు మరమ్మత్తులు చేయించాడు. 1804 పినాకిని వరదలలో జమ్మలమడుగు తాలూకాలో ఉన్న రామేశ్వరము ఆలయము కూలిపోగ దానిని మన్రో పునర్‌నిర్మించెనని ప్రతీతి. తిరుమల తిరుపతి దేవస్థానమునకు మన్రో పెద్ద గంగాళమును సమర్పించాడు. దానినే మన్రో గంగాళము అని పిలుస్తారు. కర్నూలు జిల్లాలోని రాఘవేంద్రస్వామి దేవాలయమును సందర్శించాడు. తరువాత స్వామి తన కలలో కనపడి అక్షింతలు చల్లినాడని స్వయంగా తన డైరీలో వ్రాసుకున్నాడు. ఈ విధంగా హిందూమతంపై తన అభిమానమును చాటుకున్నాడు.

చదవండి :  Report of a Tour in the Cuddapah & North Arcot Districts

కలెక్టరుగా ప్రజా సేవ చేసిన తరువాత 1807 నుంచి 1814 వరకు తన మాతృదేశంలో గడిపాడు. 1814 నుంచి 1820 వరకు సైన్యాధ్యక్షునిగా పని చేశాడు. న్యాయం అందరికీ అందవలెనని సిఫార్సు చేశాడు. ఈ శాఖకు మన్రో ఎంతో వన్నె తెచ్చాడు. 1820, జూన్ 8 నుంచి 1827 జూలై 7 వరకు మన్రో మద్రాసు గవర్నర్‌గా పని చేశాడు. గవర్నరుగా 7 సంవత్సరాలు పదవీకాలంలో మరికొన్ని సంక్షేమ కార్యక్రమములు అమలు చేసెను.

పదవీ విరమణ చేసే సమయమున తనకు అభిమాన పాత్రమైన రాయలసీమలో పర్యటిస్తూ కర్నూలు జిల్లాలోని పార్వతీ కొండ వద్ద (దానినే నేడు పత్తికొండ అందురు) కలరా వ్యాధి సోకి 1827, జూలై 6వ తేదీన కన్నుమూశాడు. అతను మరణించినప్పుడు రాయలసీమ ప్రజలు తమ ఆత్మబంధువు మరణించినట్లు తల్లడిల్లిపోయారు. మన్రోను గుత్తిలో భూస్థాపితం చేశారు. మరు సంవత్సరమే శవాన్ని తీసి మద్రాసులో ఖననం చేశారు.

థామస్ మన్రో
గుత్తిలోని థామస్ మన్రో సమాధి

ముగింపు

బ్రిటిష్ పార్లమెంటులో భారత నాణ్యతను గురించి తెలుపుతూ భారతీయులు ఉత్తమమైన పరిశ్రమ కలవారు అని తెలిపాడు. అందుకు ఉదాహరణగా ఇండియాలో ఒక శిలువను బహుమతిగా తీసుకుని 7 సంవత్సరములు దానిని ఉపయోగించాడు. అయినా అది కొత్త దానివలెయుండెను. నాకు ఇంగ్లాండు వస్తువులు బహుమానంగా ఇచ్చినా తీసుకొనను అని ప్రకటించిన వితరణశీలి మన్రో భారతదేశములో నాగరికత వస్తువు అయితే దానిని మనము దిగుమతి చేసుకోవాలని ప్రకటించాడు.

భారతీయులను గురించి 1817వ సంవత్సరములో మన్రో ఈ విధంగా తెలియచేశాడు. ఇండియాపై, దండెత్తి వచ్చిన విదేశీయులు భారతీయులను హింసకు, వేదనకు గురి చేశారు. కాని మనవలె (కంపెనీవారు) భారతీయులను హీనంగా చూసినవారు ఎవ్వరూ లేరు. భారతీయులు నమ్మదగనివారు గాను, అవినీతిపరులు గాను చిత్రించిన ఘనత మనకే దక్కుతుంది. భారతీయులు లేకుండా క్షణకాలం కూడా గడపలేని మనం భారతీయులను హీనంగా చూడటం న్యాయం కాదు. ఇంతకంటే క్రూరత్వం మరెక్కడా ఉండదు అని మన్రో తెలిపాడు.

– రామావజ్జల నాగభూషణశర్మ

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: