జిల్లాలో డెంగ్యూ భూతం-50కి చేరిన మరణాలు..!

కడప: కడప జిల్లా  వందలాది మంది పాలిట మృత్యువు జిల్లాగా మారింది. వైద్య శాఖ  నిర్లక్ష్యం వల్ల గత కొద్ది రోజులుగా జిల్లాలో మృత్యువు భూతం నాట్యం చేస్తోంది. ఎందరో ప్రాణాలను బలికోంటోంది.  ఎన్నో కుటుంబాలు కన్నీటి పాలవుతున్నాయి. మొన్నటి మొన్న రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కరీంనగర్ జిల్లాలో వికటహాసం చేసి ఎందరో ప్రాణాలను బలికొన్న డెంగ్యూవ్యాధి నేడు కడప జిల్లా కబలించింది. నెల రోజుల్లో సుమారు 50 మంది జిల్లా వాసులు ఈ డెంగ్యూ వ్యాధి బారీన పడి ప్రాణం కోల్పోయారు. ఊహించని విధంగా రోజుకు ఒక ప్రాంతం, ఊరికొక్కరు అన్నట్లుగా డెంగ్యూ వ్యాధి బారీన పడి మృత్యువు బారీన పడిపోతున్న సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. హఠాత్తుగా కబలిస్తున్న ఈ వ్యాధి నుండి తమని రక్షించుకొనుటకు వేల నుండి లక్షల రూపాయలు ఖర్చుపెట్టుతున్నా మృత్యువు ఒడి నుండి కాపాడుకోలేని పరిస్థితి రావడంతో వారి కుటుంబాలు కన్నీటి పర్వమవుతున్నాయి. చక్రాయపేట మండలంలోని బి.ఎం. తాండవలో డెంగ్యూ వ్యాధి సోకి విస్లావత్ సాలమ్మ (22) మృతి చెందగా ఆమె భర్త కుమార్ నాయక్ (25) కూడా ఈ వ్యాధి బారినపడి కడపలోని రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా వ్యాధి ప్రమాదకరంగా మారడంతో అతనిని తిరుపతికి తరలించారు. తల్లి మృతి చెందడం, తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో వారి ఐదు నెలల కుమారుడు అనాథగా మారాడు. ఇక ఇదే ప్రాంతంలోని కల్లూరి తండా, కొట్టతండా ప్రాంతాల్లో సైతం డెంగ్యూ వ్యాధి వికటించింది. దీంతో ఈ ప్రాంతాలకు చెందిన ఈశ్వర్‌నాయక్, కాంతమ్మ, దివాకర్ నాయక్, తిరుపాల్ నాయక్, వెంకట రమణ నాయక్, గోజలమ్మలు రాయచోటి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక చింతకొమ్మదినె్న మండలంలోని 15 మంది పిల్లలు, పెద్దలు తిరుపతిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటికే మైదుకూరులో సుమారు 10 మంది మృత్యువువాత పడ్డారు. ముద్దనూరు, మైలవరం, ఖాజీపేట, చెన్నూరు, పోరుమామిళ్ళ, కడప, వల్లూరు, కమలాపురం, బి.మఠం, రాజంపేట వంటి వివిధ ప్రాంతాల్లో వ్యాధులు వికటిస్తున్నాయి. దీనికి తోడు ఆయా ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకిన పరిస్థితిని గమనించడంలో వైద్యులు కూడా విఫలమవుతున్నారు. డెంగ్యూ వ్యాధి సోకిన వారిని గుర్తించకుండా మలేరియా, టైపాయిడ్ సోకిందంటూ రోజుల పాటు ఆస్పత్రుల చుట్టు తిప్పుకుంటూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇందుకోసం ప్రతి రోజు రోగుల నుండి వేలాది రూపాయలు దండుకుంటూ వాస్తవాన్ని పక్కనపెట్టి రోగ నిర్ధారణ చేయకుండానే బాధితులను పీడిస్తున్నారు. ఇక్కడే వేలాది రూపాయలు ఖర్చుపెట్టుతున్న బాధితులు చివరకు మీకు సోకిన వ్యాధి మలేరియా, టైఫాయిడ్ కాదు డెంగ్యూ అంటూ చావుకబురు చల్లగా చెబుతూ తిరుపతి, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లాలని చెబుతుండడంతో వ్యాధి బారీన పడిన కుటుంబాలు తల్లడిల్లె పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధి నివారణ కోసం దూర ప్రాంతాలకు తరలివెళ్లి భారీ ఎత్తున ఖర్చుపెట్టుకొలేక తల్లడిల్లుతూ ఉన్న ఆస్తులను తాకట్టుపెట్టుకొని అప్పుల పాలవుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ డెంగ్యూ వ్యాధి రోజురోజుకు అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ ఎందరో ప్రాణాలను బలికొంటోంది. అయినప్పటికీ వైద్యశాఖ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

చదవండి :  దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల

ఇదీ చదవండి!

ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

కడప : తమిళ నటుడు రజనీకాంత్‌ (Rajanikanth) హీరోగా నటిస్తున్న వెట్టియన్ (vettaiyan) సినిమా షూటింగ్ కడప జిల్లాలో గత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: