జయరాం కథలు..వాడని మల్లెలు!

‘థాకరే బతకడం కోసం రాశాడు, డికెన్స్ రాయాలి కాబట్టి రాశాడు’ అన్నాడు జార్జి శాంప్సన్. సొదుం జయరాం కూడా అంతే. ‘పుణ్యకాలం మించిపోయింది’ అన్న కథలో నాయకుడు గోపాలకృష్ణ కథా రచయితే. అతడి గురించి రాసిన మాటలు జయరాంకూ వర్తిస్తాయి. దీపావళి కథల పోటీకి రాయమని గోపాలకృష్ణ భార్య పోరు పెడుతుంది. బహుమతి మొత్తం ఆశ పుట్టించడంతో ఆమె భర్తను ప్రేరేపిస్తుంది. కానీ గోపాలకృష్ణ ‘డబ్బు కోసమని ఏనాడూ కథలు రాయలేదు. రాయాలని అనిపించినపుడు రాశాడు. సామాజిక బాధ్యత నిర్వర్తించాననే తృప్తి అనుభవించాడు’.

అలాంటి రచయిత తనని కదిలించిన సంఘటనలు తారసిల్లితేనే రాస్తాడు. కానీ బహుమతి కోసమే కలం పట్టడం ఇష్టం లేని గోపాలకృష్ణను అక్క మరణం కదిలిస్తుంది. ఉన్న ఇద్దరు కొడుకులలో పెద్దవాడు ఆస్తి తనకి రాయలేదని కడసారి చూడడానికి కూడా రాలేదు. ఆస్తి తన పేర రాశాక చిన్నవాడు ఆవిడ చావుకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ‘డబ్బు … అది రూపం లేని రాక్షసి. దాని కబంధ హస్తాల్లో మమతలు, మమకారాలు బంధాలు, అనుబంధాలు అన్నీ ఊపిరాడక చస్తున్నా యి. తల్లీ లేదు, తండ్రీ లేదు’ ఆ సంఘటనలతో గోపాలకృష్ణలోని రచయిత మేల్కొన్నాడు. లోపలి మంట బయటకు కక్కాలి. అప్పుడు రచయితకు కలిగే ‘స్పిరిచువల్ శాటిస్ఫాక్షన్’ అర్ధాంగి కూడా అవగాహన చేసుకోలేదు. అటువంటి తృప్తి జయరాం పొందారు.

చదవండి :  శని (కథ) - సొదుం జయరాం

జయరాం కథలలో జీవితం కథలుగా మారు తుంది. ఇంతకీ జీవితం ఎలా ఉంది? సాఫీగా మాత్రం లేదు. ఎత్తుపల్లాలతో ఉంది. ఇలా చేదువిషంగా ఉన్న జీవితాన్ని చిత్రించే రచయిత తన బాధ్యతను గుర్తించినవాడు అయిఉండాలి. సాహిత్య ప్రయోజనం ఏమిటో గుర్తించినవాడు అయిఉండాలి. జీవితాన్ని దర్శింపచేయాలి. జీవితం ఇలా ఎందుకు ఉంది? ఎలా ఉండాలి? అని ఆలోచింపచేయాలి. జీవిత పార్శ్వాలను సాహిత్యం ద్వారా ఎలా రూపు కట్టించాలో తెలిసిన రచయిత ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించగలడు. జయరాం కథలలో మన చుట్టూ ఉన్న జీవితమే ప్రతిబింబిస్తూ ఉంటుం ది. అందుకే జయరాం కథలను ‘అచ్చమైన తెలుగు కథలు, జీవితానికి అత్యంత సన్నిహితమైనవి’ అని కొడవటిగంటి కుటుంబరావు పేర్కొన్నారు.

జయరాం కథలు సూటిగా ఉంటాయి. పొదుపరితనం ఉంటుంది. కథకు అనవసరమైన వేవీ ఉండవు. క్లుప్తత కథాంశాన్ని సూటిగా అంది స్తుంది. అతి క్లుప్తంగా లోతైన భావాన్ని అందచే స్తాడాయన. ఒక్క వాక్యంతోనే పాత్రనీ, పరిసరాన్ని పరిచయం గలడు. సన్నివేశాన్ని కవిత్వీకరించడు. వర్ణనని సాగదియ్యడు. ‘ఈ రచయిత రెక్కలు కట్టుకుని గాలిలో ఎగరడానికి గానీ, మనుషులని పాకే పురుగుల్లా చూడడానికి గానీ ఎలాంటి ప్రయత్నం చేయ లేదు’ అన్నారు కొ.కు. ‘జయ రాంలో ప్రశంసనీయమైన శిల్ప దృష్టి ఉంది. అంతకంటే పటిష్టమైన సామాజిక దృష్టి వుంది… భ్రమలతోనూ, సెంటిమెంట్లతోనూ మానసికం గా నీరసించిపోయిన మధ్య తరగతి జీవులకు యితని కథలు షాక్ ట్రీట్‌మెంట్’ అని రాచమల్లు రామ చంద్రారెడ్డి సమీక్షించారు, అలాంటి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే కథ ‘వాడిన మల్లెలు’. ఈ సందర్భంగా ఈ కథ నేపథ్యం గురించి కొద్దిగా…..

చదవండి :  రెక్కలు (కథ) - కేతు విశ్వనాథరెడ్డి

‘వాడిన మల్లెలు’ కథను ఆనాటి ‘ప్రముఖ’ పత్రికలేవీ ప్రచురించలేదు. ‘సంవేదన’ మొదటి సంచికలో అచ్చువేశారు. అప్పుడే ఒక ప్రయోగం జరిగింది. ‘కథాశిల్పం దృష్ట్యా ఇదే ఇతివృత్తాన్ని ఎన్ని రకాలుగా మలచవచ్చును?’ అన్నదే ఆ ప్రయోగం. జయరాంతో కలిసి నలుగురం (రాచమల్లు రామచంద్రారెడ్డి, టి.సాంబశివారెడ్డి, నేనూ) ఆ ప్రయోగం చేశాం. ఆ నాలుగింటి మీదా కొడవటిగంటి కుటుంబరావు సమీక్ష చేశారు.

‘వాడిన మల్లెలు’ కథలో మూర్తి రొమాంటిక్ రచయిత. హోటెల్ గదిలో బల్లమీద ఉన్న మల్లెలు అతనికి గిలిగింతలు పెట్టే ఊహలని కలిగిస్తాయి. వాస్తవం కంటె ఊహలు మధురంగా ఉంటాయన్న మాట వాస్తవం. వర్షం వెలిసే వరకు ఆ మల్లెదండ చుట్టూ తియ్యటి ఊహాలోకం సృష్టించుకుని అందులో హాయిగా విహరించవచ్చుననుకుంటాడు. వీలయితే ఆ మల్లెదండ ఆధారంగా ఒక కథ రాసి పడేసినా పడేయవచ్చునని కూడా అనుకుంటాడు.

మూర్తి ఊహాలోకంలో విహరిస్తూండగా, హోటెల్ గదిలో ఒక కురవ్రాడు హాజరవుతాడు. ‘‘అప్లికేషన్ తెచ్చాను సార్!’’ అంటాడు. మూర్తికి అంతా అయోమయంగా కనిపిస్తుంది. హోటెల్ బాయ్‌ని అడుగుతాడు. ముందురోజు రాత్రి ఏదో ప్రభుత్వ శాఖ డెరైక్టర్ ఆ గదిలో బస చేశాడు. సరళ అనే అమ్మాయి తన తమ్ముడికి ఉద్యోగం దక్కుతుం దనే ఆశతో ఆ డెరైక్టర్‌తో ఆగదిలోనే గడుపుతుంది. కానీ తెల్లవారే సరికి డెరైక్టర్ మాయమైపోతాడు. అప్లికేషన్ తెచ్చిన కురవ్రాడు సరళ తమ్ముడే. మూర్తి వేరే వ్యక్తి అని, ఆ డెరైక్టర్ కాదని తెలుస్తుంది. ఆ కురవ్రాడు వెళ్లిపోతాడు.

చదవండి :  మన జయరాం, మన సొదుం

మూర్తి ఊహలు పటాపంచలైపోయినాయి. రొమాంటిక్ కథకు బదులు వాస్తవ జీవితం, కటు వైన కథకు ఇతివృత్తాన్ని అందించింది. ఒక కటువైన జీవన వాస్తవ దృశ్యాన్ని జయరాం ఈ కథలో చిత్రిం చారు. తను చిత్రించిన సన్నివేశం, సంఘటనలను బట్టి తను ఏ వ్యాఖ్యా చేయకుండా జీవితం గురించి ఆలోచించగలిగేటట్టు చేయడం నేర్పుగల రచయిత కు మాత్రమే సాధ్యం. ఆ నేర్పు జయరాంలో ఉంది.

రచయిత గురించి

నిజ జీవిత శకలాలనిపించే, అద్భుతమయిన కథలు రాసిన సొదుం జయరాం రచయితల రచయిత. రాయలసీమ జీవితవాస్తవాలను, అసాధారణమయిన శిల్పవిన్యాసంతో కథలుగా మలచిన జయరాం డెబ్బయ్ అయిదో పుట్టినరోజు ఈ మధ్యే -మార్చి పదోతేదీన- జరిగింది. ఇక్కడ జయరాం కథను విశ్లేషించిన ఆర్వియార్ – రాళ్లబండి వెంకటేశ్వరరావు- బహుగ్రంథకర్త, అధ్యాపకుడు, అనువాదకుడు, విమర్శకుడు. ‘యుగసాహితి’ వ్యవస్థాపక సభ్యుడైన ఆర్వియార్ మేస్టారు ‘సంవేదన’ పత్రిక నిర్వహణలో రాచమల్లు రామచంద్రారెడ్డిగారికి కుడిభుజంగా వ్యవహరించారు.

ఇదీ చదవండి!

ఇచ్ఛాగ్ని

కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: