జగనే సమర్థ నాయకుడు!
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డే రాష్ట్రంలో జన హృదయ నేతని.. వచ్చే ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అని 35 శాతం మంది ప్రజలు చెప్తున్నారని ఎన్‌టీవీ-నీల్సన్ ఓఆర్‌జీ మార్గ్ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుని ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని 19 శాతం మంది చెప్తే.. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అవుతారని మరో 19 శాతం మంది.. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భావించే వారు 15 శాతం మంది ఉన్నట్లు సర్వే పేర్కొంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్న వారి సంఖ్య కేవలం ఐదు శాతమేనని చెప్పింది.
రాష్ట్రం మొత్తం ఓట్లర్లలో ప్రతి ముగ్గురులో ఒకరు తాము జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించబోయే పార్టీకి ఓటు వేస్తామని నిర్థారించారు. కోస్తా, రాయలసీమల్లో జగన్ పార్టీ ఎవరికీ అందనంత దూరంలో తిరుగులేని విజయం సాధిస్తుందని.. తెలంగాణ ప్రాంతంలో సైతం కాంగ్రెస్, టీడీపీలకు దాదాపు సమానంగా జగన్ పార్టీ ఓట్లు దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అయితే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభంజనం ముందు మరే పార్టీ ప్రభావం పనిచేయదని సర్వే నిర్ధారించింది. జనవరి ఆరో తేదీ నుంచి 26వ తేదీ మధ్య కాలంలో.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్వే నిర్వహించినట్లు నీల్సన్ వివరించింది. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాలన్న ప్రతిపాదనలు జరుగుతుండటంతో ఈ అంశాన్ని సర్వేలో పరగణనలోకి తీసుకున్నా.. పీఆర్పీ కూడా ఎన్నికల బరిలో ఉంటుందన్న కోణంలోనే సర్వే కొనసాగినట్లు సంస్థ పేర్కొంది.