రేనాటి చోళుల పాలన

రేనాటి చోళుల పాలన – ఇతర విశేషములు

రేనాటి చోళులు మొదట పల్లవుల తరువాత బాదామి చాళుక్యుల సామంతులుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయినప్పటికి పల్లవ మహేంద్రవర్మ కాలమునందు పుణ్య కుమారుడు స్వతంత్ర ప్రతిప్రత్తితో రేనాటి రాజ్యమును పాలించినట్లు అతడు వేయించిన తామ్ర శాసనములు, రామేశ్వరం శిలాశాసనం సూచిస్తున్నవి.

రేనాటి చోళరాజులు తమను ప్రాచీన చోళరాజు కరికాలునికి చెందినవారుగా చెప్పుకొనుటవలన, కొందరి రాజుల పేర్లు చోళ మహారాజులని ఉండుట చేతను, వీరు కావేరి తీరమున గల ఆది చోళ వంశమునకు చెందినవారని స్పష్టమగుచున్నది. వీరిలో మొదటి వాడుగా మనకు తెలియుచున్న ధనంజయవర్మకు పూర్వమే వీరు తెలుగు దేశమునకు కడప ప్రాంతమునకు వలస వచ్చి, తెలుగు వారితో కలసి తెలుగు భాషనే మాతృభాషగా స్వీకరించినట్లు వారు తెలుగు భాషలో మొదటి నుండియు తెలుగులో వేయించడాన్ని బట్టి రుజువగుచున్నది. రాజులు సాధారణముగా తమ మాతృభాషలోనే తామ్ర పట్టికలందు వాడుతారు.

రేనాటి చోళుల మొదటి శాసనము ఎరికల్ ముత్తురాజు అను బిరుదము గల ధనంజయవర్మ కమలాపురం తాలుకాలో కలమళ్ల గ్రామములో వేయించిన శిలా శాసనము – ఆ వంశపు వారికే కాక, తెలుగు భాషకే మొదటి వాక్య రచనయై తొలి తెలుగు శాసనముగా గుర్తించబడినది. ప్రస్తుతం ఆ శాసనము పగిలి ఉన్నది. ఉన్న భాగములో ఎరికల్ముత్తురాజు ధనంజయుడు రేనాణ్డు ఏళన్ అను ఒక వాక్య భాగము పూర్తి అర్ధమిచ్చుచున్నది. తరువాత చిరుంబూరి రేవణకాలు పంపె చెనూరు కాజ అరికాళా ఊరిణ్ణివారు ఊరి.. అను వాక్యము కలదు. దీని లిపిని బట్టి ఆరవ శతాబ్దము రెండవ సగ భాగం నాటిదని చరిత్రకారుల అభిప్రాయము. రేనాటి చోళరాజులలో కొందరికి ఎరికల్ ముత్తురాజు దుగరాజు అను బిరుదులు కనిపిస్తున్నవి. వీటిలో దుగరాజు అనగా యువరాజు అని అర్ధమవుతుంది. కాని ముత్తురాజు అనగా సరియగు అర్ధం తెలియుట లేదు. ఎరికల్ లేక ఏరిగల్ అను పదము అనంతపురం జిల్లా మడకశిర తాలుకాలో ఉన్న నిడుగల్ అనునొక ప్రాచీన నగరాన్ని తెలుపునని పూర్వ పరిశోధకులు నిర్ణయించారు. అనగా తమ తండ్రుల కింద ఈ బిరుదులున్న రాజులు నిడుగల్లు రాజ్యాన్ని కుమారవృత్తిగా పాలించు వారనియో లేక యువరాజుకు తక్కువ అధికారముతో ఉన్నవారనియోనని వారు సూచించిరి. కాని నిశ్చితమైన అర్ధము తెలియదు.

చదవండి :  తిప్పలూరు శాసనము

ధనంజయవర్మ తనయుడగు చోళమహారాజగు బిరుదుగల మహేంద్ర విక్రమవర్మ వేయించిన శిలాశాసనములు సుమారు పది లభించుచున్నవి. అవి అన్నియు భూదానములను తెలుపును. అందులో ఒక దానిలో ఆ రాజు భార్య మఞ్చపోరి అను పేరుగల ఆమె చేసిన భూదానమును తెలుపుచూ మహేంద్రవర్మ శబ్దశాస్త్ర విద్యానేక పారంగతుడని కీర్తించబడింది.

మహేంద్రవర్మ కొడుకు పుణ్య కుమారుడు – రేనాటి చోళరాజులందరిలోను మిక్కిలి గొప్పవాడు. ఇతనివి రెండు తామ్ర శాసనము, మూడు శిలా శాసనములు లభిస్తున్నవి. ఇతనికి గణ్యమాండు, మారున్రప్పిడుగు, ముదముదితుణ్ణి, పోర్ముఖరామ, పురుషశార్దుల అను బిరుదులు ఉన్నాయి. రామేశ్వర శిలా శాసనమున పృథ్వీవల్లభ అను విశేష బిరుదు కూడా చెప్పబడెను. యిది బాదామి చాళుక్యుల చక్రవర్తుల బిరుదము. దీనిని బట్టి పుణ్యకుమారుడు తన ఐదవ రాజ్యపాలనా నాటికి బాదామి చాళుక్యులను తిరస్కరించుచు ఈ బిరుదును స్వీకరించెనని తెలుస్తోంది. ఇతని భార్య పేరు వసన్త పోరి. పుణ్యకుమారుడు హిరణ్య రాష్ట్రమును (కడప ప్రాంతము) ఏలుచూ పొదటూరి వారిని ఉద్దేశించి (దొమ్మరి నంద్యాల) నందిగామ శాసనంలో గ్రామములో కొంత భూమి దానము చేసినట్లు ఒక తామ్ర శాసనం తెలుపుతోంది. ఇతని మనుమడైన సత్యాదిత్యుడు రేనాండు ఏడు వేలకు తోడుగా సిద్ధివేయి (సిద్ధవటం) వేయి గ్రామ పరిమిత దేశమును కూడా పాలించెను. ఈ శాఖకు చెందిన రాజుల తరువాత సుందరనందుని వంశములోని శ్రీకంఠచోళ రాజులవి రెండు తామ్ర శాసనాలు మాత్రమే లభించినవి. ఇతని తరువాత వైదుంబరాజులు రేనాడును ఆక్రమించుకున్నారు. తరువాత రేనాటి చోళులు పొత్తపి ప్రాంతమునకు మరలినట్లు తెలుస్తోంది. కాని పొత్తపి చోళులు రేనాటి చోళులు ఒకే శాఖవారని చెప్పుటకు ఆధారము లేదు.

చదవండి :  నాటి 'తిరువత్తూరై' నే నేటి అత్తిరాల !

రేనాటి చోళ రాజ్య నిర్వహణలో పరిపాలన సౌకర్యము కోసం దేశము, రాష్ట్రములుగా విభజింపబడ్డాయి. అందు హిరణ్య రాష్ట్రము (ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలుకాలు), కురుమరము, సిద్ధివేయి (సిద్ధవటం) అను విభాగములు ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని నిడుగల్లు కూడా వీరి రాజ్యములోనిది. ఈ విభాగముల పరిపాలనకై రాజులు తమ వంశములోని వారిని గాని యువరాజులను గాని నియమించేవారు. ముఖ్యోద్యోగులకు దుగరాజు లేక దుకరాజు బిరుదునిచ్చి మండలాధిపతులుగా నియమించువారు. క్రింది ఉద్యోగులలో కౌలు అనే వారు కొన్ని శాఖలకు అధ్యక్షులైనట్లు కనిపిస్తుంది. రేవణకాలు, పుద్దనకాలు అని మనుష్య పేర్లు తుదిలోను మేషికాడు, ఎడ్లకాలు, చేలకాలు మొదలగు ఉద్యోగ నామములు తుదిలోను కనిపిస్తాయి. అంటే మేకలు, గొర్రెలు, చేలు, ఎడ్లు మొదలైన పశువులపై పన్నులు వసూలు చేయువారో లేక ఆనాడు రాజులకు పశుధనం విస్తారముగా ఉండేది కనుక వాటిపైన ప్రత్యేక అధికారులో లేక ఉద్యోగులై ఉంటారు. తరట్లకాలు అను ఉద్యోగి నేరస్తులను కొరడాతో కొట్ట శిక్షించు పోలీసు వంటి అధికారి.

భూమి కొలతలకై ప్రత్యేకించి రాచమానములు ఉన్నట్లు శాసనములు తెలుపుచున్నవి. పుణ్యకుమారుని తండ్రియగు మహేంద్రవర్మ శబ్దశాస్త్ర విద్యాపారంగతుడని శాసనమందు కీర్తింపబడింది. వేరొక రాజులకు ఇట్టి ప్రశంస కనబడదు. కనుక రేనాటి చోళులందరిలోను ఇతడు గొప్ప విద్యావంతుడని తెలియుచున్నది. ఇతనికే ముదిత శిలాక్షరుడను బిరుదు కూడా కలదు. అనగా ఆనాటి తెలుగు శాసనములు రచించుటలో ఇతనికి విశేషాదరము ఉన్నట్లు తెలియుచున్నది. తన తండ్రి ధనంజయవర్మ ప్రారంభించిన తెలుగు భాషోద్యమాన్ని ఇతడు కొనసాగించాడు.

చదవండి :  'రాయలసీమ సంస్కృతి'పై చిత్రసీమలో ఊచకోత

పుణ్యకుమారుడి తిప్పలూరు శాసనములో ఆనాటి తేదిని తెలుపుచు కాత్త్ిక (కార్తీక), చీకు (బహుళ) విదియ, సోమవారము, పునరుష్యమి (పునర్వసు ) సోమవారము, బృహస్పతిహోర చెప్పబడింది. వారమును పేర్కొనుట తెలుగు దేశములో ఆకాలమున అరుదు. రేనాటి చోళుల నాటి వాస్తు విధానములకు సంబంధించి, ప్రొద్దుటూరు దగ్గర పెన్నానది ఒడ్డున రామేశ్వరాలయమును పోర్ముఖరామ అను బిరుదు నామముతో పుణ్యకుమారుడే కట్టించినట్లు తెలుస్తోంది. అక్కడి శాసనమునందు అతడు పృథివీ వల్లభ అనే బాదామి చాళుక్య చక్రవర్తి పులకేశి బిరుదమును స్వీకరించినట్లు తెలియుచున్నది. కనుక తాను స్వయంగా చాళుక్య రెండవ పులకేశితో తలపడినట్లుగానో లేక పల్లవ నరసింహవర్మతో కలసి పులకేశిని ఓడించినట్లుగాను చరిత్రకారులు నిర్దారించారు. ఈ విజయంతో తన బిరుద నామంతో రామేశ్వరాలయంను నిర్మించెను. అతని భార్య వసంత పోరి వసంతేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించి అనేక దానముల చేసెను. కానీ విజయనగర రాజుల కాలం నందు ఈ ఆలయములు తిరిగి నిర్మించబడినవి. రేనాటి చోళరాజుల వాస్తు చిహ్నములు కొద్దిగా ఉన్నవి.

రాజంపేట సమీపంనందలి అత్తిరాల యందలి త్రేతేశ్వరాలయం రేనాటి చోళరాజులచే నిర్మించబడి, పరశురామేశ్వరాలయంగా మార్పు చెందింది. ఇది గజపృష్ఠాకారములో 8,9 శతాబ్దాల వాస్తువును, కొన్ని శిల్పములు కలిగినవి. ఇట్టి వాస్తువు గల ఆలయాలు రేనాటి చోళుల రాజ్యంనందు చిలమకూరు, పొత్తపిలందు కనిపిస్తాయి.

ఇదీ చదవండి!

నోరెత్తని మేధావులు

నన్నెచోడుడు

నన్నెచోడుడు కడప జిల్లాలో తూర్పు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా పాలించిన అర్వాచీన చోళవంశికుడైన మహారాజు. ప్రాచీన చోళులలో ప్రసిద్ధుడైన కరికాలచోళుని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: