
బెంగుళూరులో రాయలసీమ చైతన్య సదస్సు
తరలివచ్చిన ఐటి నిపుణులు, విద్యార్థులు
ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ది సాధ్యమన్న వక్తలు
(బెంగుళూరు నుండి అశోక్ అందించిన కథనం)
తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని రాయలసీమ కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ బెంగళూరు సంఘం ఆధ్వర్యంలో శనివారం (ఈ రోజు) బెంగుళూరు నగరంలోని కుందనహళ్లిలో రాయలసీమ అభివృద్ది పైన నిర్వహించిన చైతన్య సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి శ్రీ పద్మావతి మహిళ వైద్య కళాశాల్లో రాయలసీమ విద్యార్థులకు చెందాల్సిన సీట్లను కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ ఇతర ప్రాంతాల వారికి తెదేపా ప్రభుత్వం కేటాయించటం దారుణమన్నారు. ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలుగా సీమ వాసులే ఉన్నప్పటికీ ఈ ప్రాంతం వెనుకబడటానికి కారణం ఎవ్వరో ఇట్టే అవగతమవుతుందన్నారు. అమరావతి నిర్మాణాంలో రాయలసీమ ప్రాంత మట్టి, నీరును వినియోగించటం సీమ వాసుల కళ్లల్లో దుమ్ము కొట్టటమేనన్నారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత చురుకైన పాత్ర పోషించారన్నారు. అక్కడి విద్యార్థులు, యువత గడప గడపకూ వెళ్లి ఉద్యమ ఆవశ్యకతను ప్రజలకు తెలియచెప్పారన్నారు. ఈ చైతన్యంతో జనం ఉద్యమ బాటలోకి మళ్లారు. రాయలసీమ జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవటానికి ఇదే రీతిలో ఉద్యమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాయలసీమవాసుల స్వయంకృతాపరాధమే సీమ వెనుకబాటుతనానికి కారణమన్నారు.
విభజన తరువాత అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని ఇచ్చిన హామీని పాలకులు అటక ఎక్కించినా సీమ ప్రజాప్రతినిధులు నోరు విప్పకపోవటం దారుణమన్నారు. జనం నిలదీస్తే తప్ప వాళ్లూ పాలకుల్ని ప్రశ్నించబోరని హెచ్చరించారు. పరిపాలన కేంద్రమైన అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరించటం మంచిది కాదన్నారు. ‘బెంగళూరు, ముంబై, చెన్నై నగరాల అనుభవాల నుంచి పాఠాల్ని నేర్చుకోవాలి. రాజధాని నగరాల్లోనే వాణిజ్య సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు, భారీ, మధ్య తరహా పరిశ్రమలు నెలకొనటంతో కాలుష్యం, రవాణా రద్దీ, పారిశుద్ధ్యం సమస్యలకు అక్కడి పాలకులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడి పాలకులు దాన్ని గమనించకుండా అన్ని అమరావతిలోనే అన్నీ కేంద్రీకరిస్తున్నారు. దీనికి బదులుగా పరిశ్రమలు, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థల్ని రాష్టంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయన్నారు.
ఉపాధి కోసం రాయలసీమ నుంచి బెంగళూరుకు వచ్చిన విద్యావంతులకు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన మెళకువలు నేర్పేందుకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని సూచించారు.
రాయలసీమ అభివృద్ది వేదిక కన్వీనర్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి పథకాల్ని వికేంద్రీకరిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అటక ఎక్కించిందని విమర్శించారు. రాయలసీమలో విద్య, పారిశ్రామిక రంగాల ప్రగతికి ఎన్నో అవకాశాలున్నప్పటికీ పాలకులు పట్టించుకోవటం లేదని తప్పుబట్టారు.
బళ్లారి జిల్లాలో పరిశ్రమలు విపరీతంగా ప్రారంభమవుతున్నా, దానికి పక్కన ఉన్న రాయదుర్గంలో పరిశ్రమలు ఎందుకు ఆరంభం కావటం లేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న కడప ఉక్కు కర్మాగారం హామీపై ఇప్పటి వరకూ అతీగతీ లేదన్నారు. ప్రపంచంలో నాణ్యమైన ముగ్గురాయి కడప జిల్లాలో ఉంది. దాని ఆధారంగా ఇరవై ఆరు రకాల పరిశ్రమల్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలేవీ దీనిపై శ్రద్ధ చూపలేదన్నారు.
రాయలసీమకు రావాల్సిన సెంట్రల్ విశ్వవిద్యాలయం చేజారి పోయినా, ఉన్న విశ్వవిద్యాలయాలు సమస్యలతో సతమతమై అధోగతి పాలవుతున్నా ఇక్కడి ప్రాజప్రతినిధులు నోరు మెదపటం లేదన్నారు. సొంత జిల్లాలో ఉన్న సమస్యల్ని పట్టించుకునే దానికి కూడా ముఖ్యమంత్రికి మనసు రావడం లేదన్నారు.
రాయలసీమ బెంగళూరు సంఘం సభ్యుల కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు- పాల్‌రెడ్ టెక్నాలజి సంస్థ ఛైర్మన్ పాలెం శ్రీకాంతరెడ్డి స్పష్టీకరించారు.
శివకృష్ణ చౌదరి, ఆకుల రాఘవేంద్ర, రాయలసీమ నిర్మాణ సమితి అధ్యక్షుడు జనార్దన్, భువనవిజయం పత్రిక సంపాదకుడు సాకే శ్రీహరిమూర్తి, రామకృష్ణ, నవీన్‌రెడ్డి తదితరులు సీమ సమస్యలపైన ప్రసంగించారు.
కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి రాధారావు, రాయలసీమ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ అశోక్, ఫోరం ప్రతినిధి సుదాకర్ కురుబ, సీమ జిల్లాలకు చెందిన ఐటి నిపుణులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు.