గట్టి గింజలు (కవిత)

    గట్టి గింజలు (కవిత)

    పిడికెడంత సీమ
    గుప్పెడంత ప్రేమ
    వేటకుక్కల్నే యంటబడి తరిమిన
    కుందేళ్ళు తిరిగాడిన చరిత్ర!

    రాళ్ళు కూడా రాగాలు పలికిన గడ్డ!
    కాలికింద కరువు ముల్లై గుచ్చుకుంటే
    కంట్లో నెత్తురు కారుచిచ్చై కమ్ముకుంది
    నెర్రెలిగ్గిన ఒళ్ళుపై గుక్కెడు నీళ్ళు సిలకరించు
    ఒళ్లంతా గొర్రుసాల్లో ఇత్తనమై సర్రున మొలకెత్తుతుంది.

    నిద్రబుచ్చేటోడూ,
    నిందలేసేటోడూ
    ఇద్దరూ దొంగలే!

    నిజం మాట్లాడేటోడు,
    నిగ్గుదేల్చోటోడే
    నికార్సైన నాయకుడు

    బువ్వ పెట్టిన సేతినే
    బూడిదపాలు జేసినోనిపై
    భూమి తిరగాబడక మానదు

    చదవండి :  నాది నవసీమ గొంతుక (కవిత)

    భుక్తే భుజాల్ని కలుపుతుంది
    వలసే నిలేసి నిలదీచ్చుంది.

    నదుల్ని నరికేసి
    నాలికల్ని తెగ్గోసి
    సెరువుల్ని బూర్సి
    ఎడారిని పర్సినోన్ని

    నీళ్ళు ఊరకే ఇర్సిపెట్టవ్
    నిప్పుల సుడిగుండాలై
    సుట్టుముట్టి మట్టుబెడతాయ్!

    సిలువైన కాడిమాను
    పాడెలు పచ్చి పుండ్లు
    స్మశానం సలిపే గాయం
    ప్రశ్నలు పుట్టేసోటే
    ప్రయాణం ముందుకు

    ఏది గింజో ఏది తాలో
    తూరిబెత్తితే గదా తెల్సేది, నిల్సేది
    ఇప్పటికైతే అందరూ మాట్లాడనీ
    పోరాటమే బ్రతుకైనోడే
    బతికి బట్టగడతాడు.

    – వేమన సీమ

    చదవండి :  నేను - తను (కవిత) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *