Gandikota

ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలి…

దక్షిణ భారతదేశంలో విశిష్టమైన చారిత్రక ప్రదేశం గండికోట. నాటి విదేశీ పర్యటకుల నుంచి నేటి చరిత్రకారుల దాకా రెండో హంపీగా కొనియాడిన ప్రాంతమిది. ఈనెల 8 నుంచి రెండురోజులపాటు గండికోట వారసత్వ ఉత్సవాల నిర్వహించాలని జిల్లా పాలనాధికారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో యంత్రాంగం చిత్తశుద్ధి, గండికోట అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు, పర్యటక వికాసం వంటి అంశాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గండికోట చరిత్ర, పర్యాటక విశేషాలపై ‘గండికోట’ పేరుతో పుస్తకాన్ని రచించిన కథా రచయిత తవ్వాఓబులరెడ్డి (www.www.kadapa.info గౌరవ సంపాదకులు)తో ఈనాడు దినపత్రిక జరిపిన ముఖాముఖి.

తవ్వా ఓబుల్‌రెడ్డి
తవ్వా ఓబుల్‌రెడ్డి

ప్ర : గండికోట వారసత్వ ఉత్సవాలపై మీరేమంటారు?

జ : వారసత్వ ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించటానికి సిద్ధమవటం హర్షణీయమే. ఉత్సవాల నిర్వహణలో చిత్తశుద్ధి ఎంత అన్నదే ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న.

ప్ర : ప్రజాప్రతినిధుల చొరవ ఎలా ఉంది?

చదవండి :  నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక

జ : కాకతీయ, గోల్కొండ, ఫ్లెమింగో ఉత్సవాలపై ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉత్సవాల నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధుల్లో చొరవ కరవైంది. సంస్కృతి, వారసత్వాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఇక్కడి నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

ప్ర : వారసత్వ ఉత్సవాలతో ప్రజలకు ఒరిగేదేముందంటారు?

జ : అలా అనుకోవడం చాలా తప్పు. సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయకూడదు. నాటి చరిత్రను వారసత్వంగా అందించాలి. ఉత్సవాల నిర్వహణతో పర్యటక రంగం అభివృద్ధి చెందుతుంది. మౌలిక వసతులు సమకూరుతాయి.

ప్ర : వారసత్వ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు చేయాల్సిన కృషి?

జ : జిల్లా నలుమూలల నుంచి చరిత్రకారులు, కళాకారులను భాగస్వామ్యం చేయాలి. ఏటా గండికోట వారసత్వ ఉత్సవాలను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలి.

ప్ర : గండికోటను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మీరిచ్చే సూచనలు?

చదవండి :  గండికొటలొ ఉదయభాను హల్‌చల్‌

జ : మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఏడాడి కిందటే కేంద్ర పురాతత్వశాఖ డైరెక్టరుకు తెలుగుసమాజం తరపున లేఖ రాశా. కోట ప్రదేశాల పేర్లు, కోట చిత్రం ఏర్పాటు చేశారేగాని ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో చొరవ లేదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా సరైన దారి లేదు. కోట నుంచి అగస్త్యేశ్వర కోనకు రోప్‌వే నిర్మించాలి. గండికోట రిజర్వాయరుకు, గురిగింజకోనలో వెంకటేశ్వర దేవాలయం మీదుగా మంగపట్నం వరకు దారిని నిర్మిస్తే నలుమూలల నుంచి పర్యటకులు చేరుకునే అవకాశం ఉంది.

ప్ర : గండికోటకు ఎలాంటి గుర్తింపు దక్కాలి?

జ : గండికోట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం కృషి చేయాలి. యునెస్కో గుర్తింపునకు కావాల్సిన లక్షణాలు గండికోటకు ఉన్నాయి. పర్యటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి కృషి చేయాల్సిన అవసరం ఉంది.

చదవండి :  రోంత జాగర్తగా మసులుకోర్రి సోములారా ! (కవిత)

ప్ర : పురావస్తు ప్రదర్శనశాల ఆవశ్యకత?

జ : గండికోటకు సంబంధించిన శాసనాలు, శిల్పాలు, ఖడ్గాలు, నాణేలు ఇతర వస్తువులు మైలవరం, చంద్రగిరి, హైదరాబాదులోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. వాటిని అన్నింటిని గండికోటకు తెప్పించి పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలి.

ప్ర : గండికోట పుస్తకరచన నేపథ్యం?

జ : చాలా ఏళ్ల కిందట గండికోటను చూడగానే ప్రత్యేక అనుభూతి కలిగింది. ఎతైన కోటగోడలు, అద్భుత శిల్ప సౌందర్యంతో ఉట్టిపడే ఆలయాలు, పెద్దమసీదు పక్కనే ప్రకృతి సోయగాలతో పెన్నాలోయ. మళ్లీ మళ్లీ గండికోటను సందర్శించేలా చేసింది. రెండేళ్ల కిందట ఓరుగల్లు, రామప్ప దేవాలయాన్ని దర్శించాను. వీటి విశిష్టతకు గండికోట ఏమాత్రం తీసిపోదు. గండికోట గొప్పదనాన్ని, చరిత్రను చరిత్రకారులకు, పర్యటకులకు అందించాలనే సంకల్పంతో పుస్తకరచన చేశా.

(సౌజన్యం : ఈనాడు దినపత్రిక, ౦౪.౦౨.౨౦౧౪ )

ఇదీ చదవండి!

సూర్య విగ్రహం

నిడుజువ్విలో సుందర సూర్య విగ్రహం!

భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: