
కొండపేట కమాల్ – రంగస్థల నటుడు
కొండపేట కమాల్
“నేను మా ఇంట్లో పెద్ద ఆద్దాలను అమర్చుకుని స్త్రీపాత్రల హావభావాలను, వివిధ రసాభినయాలాలో ముఖకవలికలను, ముస్తాబు తెరగులను, నవ్వులను, చూపులను, నడకలను కొన్నేళ్ళపాటు సాధన చేశాను. ఈ కమాల్ ఈ సౌకర్యాలను సమకూర్చుకునే ఆర్ధిక స్తోమత లేని వాడయినప్పటికీ హావభావ ప్రదర్శనలో నన్ను ముగ్ధుణ్ణి గావించాడు. ఈయన గానమాధుర్యం అసమానమైనది. ఈయన నిజంగా వరనటుడు.. ఈయనను గౌరవించుటకెంతో సంతోషిస్తున్నాను’’
ప్రఖ్యాత స్త్రీ పాత్రల నటుడు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు తాడిపత్రిలోని ఒక రంగస్థల సమావేశంలో చేసిన పై ప్రశంస “రాయలసీమ స్థానం”గా పేరొందిన (ఆధారం: కడప జిల్లా రంగస్థల నటులు) కొండపేట కమాల్ నటనకు, గాత్ర మాధుర్యానికి గీటురాయిగా నిలుస్తుంది.
తెలుగు నేలపై రంగస్థల నాటకాలకు విశిష్టమైన చరిత్ర ఉంది . మట్టిలో మాణిక్యాల్లాంటి ఎందరో నటశేఖరులు రంగు పూసుకుని రంగస్థలంపై ఆడి,పాడి ప్రేక్షకలోకాన్ని రంజింపజేశారు. కొందరు స్త్రీ పాత్రలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఇరవయ్యో శతాబ్దపు ప్రథమార్థంలో నటులుగా , గాయకులుగా రాణించిన నటనటీమణులెందరో సినిమారంగంలో సైతం పాదం మోపి తమ ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అలాంటి వారిలో కడప జిల్లాకు చెందిన కొండపేట కమాల్ ఒకరు.

కొండపేట కమాల్‌సాహేబ్ కడపజిల్లా చెన్నూరు మండలం కొండపేటలో ఫిబ్రవరి 2, 1915 వ సంవత్సరంలో దూదేకుల కుటుంబంలో జన్మించారు. తండ్రి హుసేన్ సాహెబ్ గ్రామతలారిగా పనిచేస్తూ ఏడున్నర రూపాయల నెలజీతంతో అయిదుగురు పిల్లలను పోషించేవాడు. కమాల్ సాహెబ్ చదువు ఐదవ తరగతితోనే ముగిసింది.
నాటకరంగ ప్రవేశం
తొమ్మిదేళ్ళ వయసులోనే కమాల్ చక్కగా పాడేవాడు. కమాల్ ప్రతిభను గుర్తించిన నాటక గురువు గాజుల లక్షుమయ్య కమాల్‌ను, అతని సోదరున్ని చేరదీసి లవకుశులుగా తీర్చిదిద్ది నాటకాల్లో ప్రవేశ పెట్టాడు. ఆతర్వాత ఫిడేలు విద్వాంసుడు రాజయ్య , నటుడు డి.వి నరసింహారావు గారి వద్ద అయిదేళ్ళపాటు సంగీతం, ఆభినయం సాధనచేసి పదమూడేళ్ళ వయసులోనే కృష్ణలీల, కృష్ణ తులాభారం, రామదాసు వంటి నాటకాల్లో నటించడం నేర్చుకుని, ప్రదర్శనల ద్వారా ప్రేక్షకుల ప్రశంసలను కమాల్ అందుకున్నాడు.
అప్పట్లో రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన తురిమెళ్ళ వారి మాథవవిలాన నాటక సమాజం కమాల్ ప్రతిభను గుర్తించి తమ బృందంలో చేర్చుకున్నారు. అయితే ఎలాంటి పారితోషికం లేకుండా కేవలం భోజన వసతి కల్పించే ఒప్పందంపై వారు కమాల్‌గారిని తీసుకొని వెళ్ళారు. కమాల్ గానమాధుర్యం, అభినయకౌశలం నాటక అభిమానులను బాగా ఆకర్షించింది. కానీ తురిమెళ్ళ వారి నాటక సమాజంలో చీలిక ఏర్పడింది. వెంకటాద్రి యాజమాన్యంలోని కంపెనీలో కమాల్ పనిచేసేవాడు. ఈ కంపెనీలో వేమూరి గగ్గయ్య , రఘురామయ్య, సూరిబాబు, రామకృష్ణశాస్త్రి, పారుపల్లి సుబ్బారావు, వి. విశ్వనాథం, మాస్టర్ అవధానం లాంటి లబ్దప్రతిష్టులైన నటుల సరసన చిన్నపాత్రల్లో నటిస్తూ కమాల్ తన నటనా కౌశలాన్ని మరింతగా మెరుగులు దిద్దుకున్నాడు. చింతామణి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడి లాంటి నాటకాలను ఈ కంపెనీ ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేది.
1935లో కడపలో ‘రామవిలాసనభ’ స్థాపింపబడింది. అప్పటి కడప కలెక్టరు శ్రీ వి.యస్.హేజ్మాది రామవిలాససభ కార్యక్రమాలకు ప్రోత్సాహమిచ్చేవారు. బళ్ళారి రాఘవ, కే. దొడ్డన గౌడ, పద్మావతి దేవిగార్ల బృందం రామదాను, చండిక, పాదుకా పట్టాభిషేకం మొదలైన నాటకాలను ప్రదర్శించారు. .కమాల్‌సాహెబ్ ఆ నాటకాలలో స్త్రీ పాత్రలలో నటించి బళ్ళారి రాఘవ తదితర ప్రముఖ నటులచేత ప్రశంసలను అందుకొన్నాడు. ఆతర్వాత కొన్నాళ్ళకు సాహితీగానకళాకోవిదులైన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కడప రామవిలాననభవారు నత్కరించారు. ఆ నభలో కమాల్ సాహెబ్ “సక్కూబాయి” పాత్రలో నటించి రాళ్ళపల్లి వారి ప్రశంసలనుపొందారు.

1952 ఆగస్ట్ 10న మద్రాసు ఆంధ్రమహానభ రిపబ్లిక్ హాలులో జరిగిన శ్రీకృష్ణతులాభారం నాటక ప్రదర్శనలో కొండపేట కమాల్ సత్యభామగా నటించారు. ఈ ప్రదర్శనలో కృష్ణుడుగా టి.జి.కమలాదేవి, నారదుడుగా. బి.యన్. రాజు, వసంతకుడుగా వంగర వెంకటసుబ్బయ్య నటించారు. సత్యభామ పాత్రలో కమాల్ తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. మద్రాసు శానననభ మాజీ స్పీకర్ మహర్షి బులును సాంబమూర్తి ప్రదర్శనానంతరం జరిగిన నభలో నటులను అభినందిన్తూ కమాల్ సాహెబ్ ను కౌగలించుకొని ప్రసంశల జల్లు కురిపించారు.
నెల్లూరు టవున్ హాలులో సినీగాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి , రాజేశ్వరి , సూరిబాబు, వంగర వెంకట సుబ్బయ్య గార్లతో ప్రదర్శింపబడిన కాళిదాసు నాటకంలో కమాల్ సాహెబ్ ‘విలాసవతి’గా నటించి డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డిగారి సత్కారాన్ని అందుకున్నారు. “మీరజాలగలడా ..అనే పాటలో కమాల్ సాహెబ్ అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేది. సక్కుబాయి గా భక్తితత్వాన్ని , చింతామణి గా రక్తి విశేషాన్ని కమాల్ జనరంజకమైన రీతిలో అద్భుతంగా అభినయించేవాడు. అలాగే ‘కైక’గా, చంద్రమతిగా , సావిత్రి గా, తారగా , ‘పద్మావతి’గా అయన నటన తెలుగునాట మన్ననలు అందుకుంది.
నటనా దురంధురులైన సి.ఎస్.ఆర్ ఆంజనేయులు, పాతకోట కృష్ణారెడ్డి, నాగలింగ భాగవతార్, బైరెడ్డి నరసింహారెడ్డి, రాజేశ్వరి, పూర్ణిమలతో పాటుగా దాదాపు ముప్పైఐదు ఏళ్ళపాటు కమాల్ తన నటనాకౌశల్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయాడు. అనంతపురం, బెంగళూరు, బళ్ళారి, కర్నూలు, మద్రాసు లాంటి నగరాలతోపాటు వందలాది గ్రామాలో కమాల్ నాటక ప్రదర్శనల్లో నటించాడు . రాజమండ్రికి చెందిన గండికోట జోగినాథం, సూరవరపువారి నాటక సమాజంలో పనిచేస్తూ చింతామణిగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. తెలంగాణా లో వనపర్తి, మహబూబ్ నగర్, గద్వాల పట్టణాలలో కూడా కమాల్ నటించాడు. 1957 నుండి 1962 వరకు సురభి నాటక నమాజం ద్వారా వందలాది ప్రదర్శనలను కొండపేట కమాల్ ఇచ్చారు.
సినీ రంగంలో …
1938 లో కడపకు చెందిన పుల్లగూర శేషయ్య అనే వ్యాపారి, రాజకీయ నాయకుడు మద్రాసులో శారదా రాయలసీమ ఫిలిం కంపెనీని స్థాపించి “జయప్రద” అనే సినిమాను నిర్మించారు. చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా సాలూరి రాజేశ్వరరావు పనిచేశారు . రాజేశ్వరరావుకు సంగీత దర్శకుడిగా తొలి చిత్రం. ఈ చిత్రంలో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు, బళ్ళారి లలిత , పూర్ణిమ, యశోద , జే.వి.సుబ్బారావు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో కొండపేట కమాల్ ఋషి వేషం వేయడంతో పాటు ‘మార్గమదేదో గాంచుడీ..దేహము నిత్యమూ కాదది వినుడీ ’ అనే తత్వ గేయాన్ని పాడారు.
1967లో ఉదయ భాస్కర్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘యమలోకపు గూడాచారి’ నారదుడిగా నటించిన హరినాథ్ కోసం కమాల్ ఒక పద్యం పాడారు. అయితే ఆ తర్వాత సినీరంగంలో ఇమడలేక సినిమాలోకానికి స్వస్తి చెప్పారు.
సత్కారాలూ , సన్మానాలూ
కొండపేట కమాల్ కు అనేక సంస్థల వారు సత్కారాలూ , సన్మానాలూ చేసి బిరుదులందించారు. ఆంధ్రపదేశ్ నాట్య సంఘం అనంతపురంలో కమాల్ సాహెబ్ ను ఘనంగా సన్మానించి “రాయలసీమ నాటక కళాధురీణ ” అనే బిరుదుతో సత్కరించారు. 1955 లో కడప శ్రీనివాస నాటక కళాపరిషత్ వారు కొండపేట కమాల్ తో పాటు ప్రముఖ సంగీత విద్వాంసుడు సుంకేసుల కమల్ రాజ్ ను కూడా ఘనంగా సత్కరించారు. 1958 లో వినుకొండలో జరిగిన సారంగధర నాటక ప్రదర్శనకు ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ కవి గుర్రం జాషువా కొండపేట కమాల్ సాహెబ్ ను తమ ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
కొండపేట కమాల్ సాహెబ్ రేడియోలో పాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పట్లో కడపలో రేడియో స్టేషన్ లేదు. ఇందుకోసం ఆయన హైదరాబాదు, విజయవాడ నగరాలకు వెళ్లి ప్రయత్నించారు. రాయలసీమ కళాకారుల పట్ల సాగిన చిన్న చూపు కమాల్ పట్ల కూడా సాగింది. రేడియోలో పాడే అవకాశం ఆయనకు రాలేదు. అనేక సంస్థలు ఏర్పాటుచేసిన నాటక ప్రదర్శనలలో కమాల్ ఉచితంగా కూడా నటించారు. పెద్ద సంసారం కావడంతో కమాల్ సాహెబ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. తనపేరుతో చందాలు వసూలు చేసుకున్న నాటక సంస్థలు తనకు ఆ డబ్బు అందించలేదని అప్పట్లో జానమద్ది హనుమచ్చాస్త్రి గారితో కమాల్ సాహెబ్ వాపోయారట.! ప్రభుత్వాలు కూడా ఆయనకు ఎలాంటి ఆర్ధికసాయం అందించక పోవడంతో కష్టాల పాలయ్యారు.
మరణం
1974 అక్టోబర్ 31వ తేదీన కొండపేట –చెన్నూరు మధ్య పెన్నానదిని దాటుతూ కమాల్ ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యారు.