
కేసీ కాలువ కోసం 25కోట్లడిగితే 4.9కోట్లిస్తారా?
కడప: కడప – కర్నూలు కాలువ ఆధునికీకరణ పనుల కోసం రూ.25కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుందని అధికారులు చెబితే ప్రభుత్వం రూ.4.9కోట్లు కేటాయించడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, నికర జలాలు సాధించి సకాలంలో పూర్తిచేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం సీమ ప్రయోజనాలను గాలికొదిలేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజోలి ఆనకట్ట పరిశీలనకు ప్రతినిధి బృందం వెళ్లి వచ్చింది.
ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ కేసీ కాలువ ఆధునీకరణ జరగక చివరి ఆయకట్టుకు నీరందడంలేదన్నారు. జిల్లాలోని పది మండలాలకు నీరందాలంటే రాజోలి, ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని, పంట కాలువల నిర్మాణం జరగాలని అందుకు కనీసం రూ.25కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుందని అధికారులు లెక్కగట్టారన్నారు. వారి అంచనాలపై నీళ్లు చల్లేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.4.9కోట్లు కేటాయించడం దారుణమన్నారు.
కేసీ కాలువ చివరి ఆయకట్టుకు నీరందాలంటే బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ వద్ద నుంచి కడప వరకూ కాలువ ఆధునీకరణ పనులు, వెడల్పు పూర్తిచేయాలన్నారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పది టీఎంసీల సామర్థ్యానికి పెంచాలన్నారు.
ప్రాజెక్టు పరిశీలనలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర, కార్యనిర్వాహక అధ్యక్షుడు రమణ, ఉపాధ్యక్షులు మనోహర్‌రెడ్డి, అంకిరెడ్డి, వెంకటరమణ, చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.