కార్వేటినగరం ఓ మధుర జ్ఞాపకం – నటి టి.జి.కమలాదేవి

(తవ్వా విజయ భాస్కర రెడ్డి, ఐ. ప్రవీణ్ కుమార్)

 తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ , ఇప్పటికీ నటీనటుల అనుబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని సీనియర్‌ నటి టిజి కమలాదేవి పేర్కొన్నారు. మారిన సినీ వాతావరణంలో తాను ఇమడలేకపోయానని, అందుకే క్రీడలపైనా, నాటకాల పైనా ఏకాగ్రత చూపానని ఆమె చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షిక కోసం కమలాదేవిని చెన్నైలోని ఆమె నివాసంలో కలిసినపుడు ఆమె తన బాల్య  స్మృతులను ఇలా పంచుకున్నారు….

ACtress Kamaladevi

“1930, డిసెంబర్‌ 29వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించాను.మా నాన్న కృష్ణస్వామి నాయుడు వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా పుత్తూరుకు చేరాం. అక్కడ మానాన్న ఫారెస్టు డిపార్టుమెంటులో పనికి చేరారు. నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. థర్డ్‌ఫారం వరకు పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. మళ్ళీ ఐదవక్లాస్‌ క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్లో చదివాను. నా ఏడో ఏట నుండి అమ్మ లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. ప్రముఖ గాత్ర విద్వంసులు చెంచు రామయ్యగారు నా గురువు. సుమారు మూడేళ్ళ పాటు ఆయన వద్ద సంగీతాన్ని అభ్యసించాను. దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడేదాన్ని.

ఓ వైపు సంగీతం, మరో వైపు పాఠశాలకు తోడు నాటకాల్లో నటించేదాన్ని. మొదటినుంచీ నేను తెలివిగలదాన్నే.బాగా చదువుకునేదాన్ని. ఓ సారి ‘జ్ఞాన సుందరి’ నాటకం వేస్తుండగా నాగయ్య గారితో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూడడానికి వచ్చారు. ‘సక్కుబాయి’ నాటకంలో చక్కగా నటించానని పిఠాపురం రాజవారు బంగారపు గొలుసు ప్రదానం చేస్తానని చెప్పారు. కానీ ఆ సమయానికి చైన్‌ మెడలో లేకపోవడంతో మరో కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా అందుకున్నాను. ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌, రాజస్థాన్‌ ర్రాష్టాల్లో ప్రదర్శించిన అలెగ్జాండర్‌ రూక్సానా పాత్రను 25 సార్లు ధరించిన ఘనత నాకే దక్కింది.

చదవండి :  ‘విజయ’ సామ్రాజ్యాధీశుడు నాగిరెడ్డి - పులగం చిన్నారాయణ

ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్‌ తరపున ఓపెన్‌ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా చెన్నయ్‌ వచ్చాను. ‘నేను కనలేని జీవితము…’ పాటను చలపతిరావు గారు సుమారు 20 రోజుల పాటు నేర్పించి పాడించారు.పాట పాడిన వెంటనే పుత్తూరు వెళ్ళి పోయాను. చిన్న వయస్సులోనే ‘కనకతార’, ‘భూపుత్రి’, ‘ఐదు పువ్వుల రాణి’లతో పాటు పలు నాటకాల్లో నటించారు. చిన్నప్పుడు సినిమాలను కూడా చాలా ఇష్టంగా చూసేదాన్ని.

కాంచనమాల, టంగుటూరి సూర్యకుమారి అంటే చెప్పలేనంత అభిమానం. ‘వందేమాతరం’ చిత్రంలో నటించిన చిత్తూరు వి.నాగయ్యగారికి బహుశా 1939లో పుత్తూరులో ఘన సన్మానం జరిగింది. ఆ సభలో నా చేత ప్రార్థనా గీతాన్ని పాడించారు. నా గొంతు విని ముగ్ధులైన నాగయ్యగారు నా గురించి బిఎన్‌ రెడ్డి గారికి సిఫార్సు చేశారు.రెడ్డిగారు నన్ను ‘సుమంగళి’ చిత్రంలో ఓ ముఖ్యపాత్రకు మద్రాసు పిలిపించారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రలో నటించలేక పోయాను. తరువాత ఆ పాత్రను మాలతి చేసింది. 1941లో రాజా శాండో తీసిన ‘చూడామణి’ చిత్రంలో సిఎస్‌ఆర్‌ చెల్లెలిగా మొదటిసారి నటించాను. వాహిని వారు మూడు సంవత్సరాల పాటు నాచేత బాలనటిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా సినీ ప్రస్థానం ప్రారంభమైంది.

చదవండి :  వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

పుత్తూరులోని అమెరికన్‌ మిషనరీ స్కూల్లో చదివేటప్పుడు మా హెడ్‌మాస్టర్‌ గారి అమ్మాయి రాజామణి నా క్లాస్‌మేట్‌. మేమిద్దరం చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం. వాళ్ళు క్రిస్టియన్స్‌. మేము హిందువులము. అప్పట్లో ఎక్కువగా ఆచారాలు పాటించేవారు. మా ఇంట్లో వాళ్ళు, ్రకైస్తవుల ఇంటికి వెళ్ళొద్దని చెప్పేవారు.నేను పట్టించుకునేదాన్ని కాదు. రహస్యంగా రాజామణి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని.ఆదివారం పూట వాళ్ళతో చర్చికి వెళ్ళేదాన్ని.సెలవులు దొరికినప్పుడల్లా కార్వేటినగరం వెళుతుండేవాళ్ళం.

అక్కడ ఓ పెద్ద సరస్సు ఉంది. మేమంతా అక్కడకు చేరుకుని చేపలు పట్టుకొచ్చి కూర వండుకుని తినేవాళ్ళం.అలాగే మా పెద్దనాన్న ఊరికెళ్ళి ద్రౌపదమ్మ ఉత్సవాలలో పాల్గొనేవాళ్ళం. అంతేకాక రాజాగారు కట్టించిన గుంట ఒకటి కార్వేటినగరంలో ఫేమస్‌. ఏ వైపునుంచి చూసినా నీరు సమపాళ్ళల్లో కనిపిస్తాయి. మా అక్క చెల్లెళ్ళంతా అక్కడకెళ్ళి కూర్చొని ఆ గుంటను చూసి సంతోషపడేవాళ్ళం. బాల్యంలోనే నటన, సంగీతంపై ఏకాగ్రత చూపడం వల్ల చదువు పూర్తి చేయలేక పోయాను. మా అక్క చిత్తూరు నాగయ్యను వివాహం చేసుకోవడంతో చెన్నయ్‌లోని మైలాపూర్‌, మాంబళంలలో వారింట్లో బాల్యం కొనసాగింది. అప్పట్లోనే చెన్నయ్‌ ఆల్‌ ఇండియా రేడియోలో మ్యూజిక్‌ డ్రామాలు, పౌరాణిక డ్రామాలు, లైట్‌ మ్యూజిక్‌ కచ్చేరిలలోనూ నటించేదాన్ని, పాడేదాన్ని.

చదవండి :  పి రామకృష్ణ

1945 నుంచే నాకు ఆల్‌ ఇండియా రేడియోలో ‘ఎ ‘ క్లాస్‌ ఆర్టిస్టు హోదా కల్పించారు.1946 అక్టోబర్‌లో మద్రాసు కార్పొరేషన్‌ ఇంజనీరు చంద్రబాబుతో నా ప్రేమ వివాహం జరిగింది. మాంబళంలో వుండే మేము 1947లో షెనాయ్‌నగర్‌ వెళ్ళాము. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాను. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించాను. ఇక్కడే ఎందరో గొప్ప గొప్ప కళాకారులతో పరిచయం ఏర్పడింది. అందుకే ఇప్పటికీ నాకు, ఆంధ్ర మహాసభకు ఎనలేని అనుబంధం ఉంది.”

TG Kamaladevi with Husband Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: