కడప : అన్నమాచార్య సంకీర్తనలపై విశేష పరిశోధనలు చేసిన ప్రముఖ పండితుడు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.
కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు (జూన్ 25, 1941) అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసిన వారిలో ప్రముఖుడు. ఇదే రంగంలో కీలకమైన పరిశోధన చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ శిష్యుడు.
ఆయన జూన్ 25, 1941 తేదీన లక్ష్మీదేవి, కామిశెట్టి వెంకటసుబ్బయ్య దంపతులకు కడపలో జన్మించారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1963లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి తెలుగుసాహిత్యంలో ఎం.ఏ పూర్తి చేశాడు. తరువాత భాషాశాస్త్రంలో పీజీ డిప్లోమా చేశాడు.
ఆయనకు చదువుతున్నప్పుడే అన్నమాచార్య కీర్తనలపై ఆసక్తి కలిగింది. వెంటనే రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ దగ్గర శిష్యుడిగా చేరారు. అన్నమాచార్య కీర్తనలపై ఆయన ఆసక్తిని, కృషిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1978లో అన్నమాచార్య ప్రాజెక్టుకు డైరెక్టరుగా నియమించింది. ఆడియో, వీడియో రికార్డింగులలో ఆయన ప్రతిభను గమనించిన తితిదే వారు శ్రీవెంకటేశ్వర రికార్డింగ్స్ అనే ప్రాజెక్టుకు కూడా ఆయన్నే డైరెక్టరుగా నియమించారు. ఆ భాద్యతలో భాగంగా ఆయన భారతరత్న ఎం.ఎస్ సుబ్బులక్ష్మిచే పాడించి శ్రీవేంకటేశ్వర పంచరత్నమాలను రికార్డింగు చేయించారు. దేశమంతటా సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయించాడు. పేరు పొందిన సంగీత విద్వాంసులంతా ఇందులో పాల్గొన్నారు.