కవయిత్రి మొల్ల

కవయిత్రి మొల్ల – మా ఊరు

చిన్నతనంలో అమ్మ పిన్ని అత్త ముగ్గురూ రొకళ్ళతో వడ్లు దంచుతూవుంటే ఒకామె ముగ్గురి రొకటిపోట్లు చాకచక్యంగా తప్పించుకుంటూ రోట్లోకి వడ్లు ఎగతోసేది. ఆమె అలా రోట్లోకి వడ్లు ఎగదోస్తూనే తమ రైతు స్త్రీలకు కష్టం తెలియకుండా రామాయణం మొత్తంపాడి వినిపించేది. నాకప్పుడు తెలియదు అవి స్త్రీలరామాయణపు పాటలని.

దంచిన వడ్లు చాటలతో చెరిగి బియ్యం, నూక, తవుడు, ఊక వేరువేరు చేసేసరికి శ్రీరాములవారి పట్టాభిషేకం పూర్తయిపోయ్యేది.

మళ్లీ వడ్లు దంచేరోజు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూసేవాణ్ని , ఆయమ్మనోట రాములవారి పాట వినడంకోసం. ఇలా రామాయణం వినడం గమనించిన మాతాతగారు రామాయణం రాసిన కవయిత్రి ‘మొల్ల’ది మీఊరేనని చెప్పడం నాకుఇంకా గుర్తే.

ఇదంతా ఎందుకు చెవుతున్నానంటే మొన్న వీరజేజి మనమడు రామసుబ్బమామ ”నెల్లూరు జిల్లావాళ్ళు మొల్లది మా ఊరేనని ఫేస్బుక్ లో పెట్టిన్రు మామో!” అనడంతో ఇదంతా గుర్తుకొచ్చింది.

వీరమ్మజేజిది కవయిత్రి మొల్ల సామాజిక వర్గమే! తనకు కలిగిందే ఇతరులకు పెట్టె గొప్పగుణం వీరజేజిది. “రామయ్య కథను రాసినామె మాయింటి బిడ్డే”నని గొప్పగా చెప్పేది. కవయిత్రిమొల్ల రాసిన రాతలు ఇక్కడే ఎక్కడో కుండలు కాల్చే ఆముకు చుట్టుపక్కల పూడ్చి వుండొచ్చని ఆమె బలంగా విశ్వసించేదని ఆమె మనవడు నాతో చెప్పాడు.

చదవండి :  తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

ఆమెతో వివరాలు కనుక్కోవాలంటే అయ్యే పనేనా మమ్మలి కోవేటికి పంపి ఆమె దేవుణ్ణి చేరుకుంది మరి.

ఆయన పేరు శ్రీ కాల్వ బలరామి రెడ్డి గారు. నాకు పెదనాన్న వరుస. మాగ్రామ మునసబుగా చేసేవారు. వారి వ్యక్తిత్వాన్ని అప్పటి తహసీల్దార్లు కూడా ఎంతో గౌరవించేవారు. మా గ్రామంలో ఎవరూ ఆయన ఎదురుగా వెళ్లి మాట్లాడడానికి సాహసించేవారు కాదు.

నాన్నకు ఆయనదగ్గర చనువు. ఆయన తాగే చార్మినార్ సిగరెట్ ఖాళీ పెట్టెలకోసం నాన్నతో కూడా భయం భయంగా వెళ్ళేవాన్ని. ఓసారి నాన్నతో వారు ” కవయిత్రి మొల్లది మనవూరేనని మనం కోర్టులో పిటీషన్ వెయ్యాలబ్బీ” అన్నారు. ఆయన కోరిక తీరకుండానే సమాధిలో గుర్తుగా మిగిలి పోయారు.

ఇదంతా ఎందుకు ఏకరువు పెడుతున్నానంటే, తిరపతి నాలుక్కాళ్ల మండపం కాన్నించి సకలపనులవాళ్ళు పొద్దున్నే కదిలిపోయినట్లు, కోవెట్లో వున్న మాఊరి వాళ్ళము ఖైతాన్ స్టార్ హోటల్ దగ్గరనుండి సింగిల్ చాయ్ తీసుకుని ఎవరి బతుకుదెరువు వెతుక్కుంటూ వాళ్ళము ఉదయాన్నె బయలుదేరిపోతుంటాము. కరువు కాటకాలే కాకుండా నేనూ, జయరాం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము.

చదవండి :  కడప జిల్లాలో నేరాలు - ఒక పరిశీలన

మా బద్వేలువాసి అయిన సుమతీశతకకారుడు బద్దెన పేరుమీద ‘బద్దెనకళాపీఠం’ బద్వేలులో వుంది. ఈ మధ్య ‘ కవయిత్రి మొల్ల సాహితీపీఠం’ కూడా ఏర్పాటు కావడం సంతోషం.

ఈ రెంటీల్లో కూడా బద్వేలువాసి, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ గానుగపెంట హనుమంతరావు మాస్టారు కృషి వుంది.

‘మొల్ల మనూరి బిడ్డారా’ అని నేను జైరాం తో అంటే, వాడు ‘నువ్వెప్పుడూ ఇంతే సిన్నాయినా! అంతా ఐపోయినాక చెప్తావు, ఇప్పుడు ఆ గొప్ప మొత్తం గోపవరం వాళ్లు కొట్టేసారు గదా! ముందు చెప్పివుంటే హనుమంతరావు సారు దగ్గర మన వాదన కూడా వినిపించి ఉండేవాళ్ళం కదా! ఆయన నాకు బాగా తెలుసు కూడా!’ అన్నాడు.

‘ఆవేశమెందుకురా! భాగవతకర్త మహానుభావుడు పోతన జన్మస్థలం గురించికూడా వివాదం వుంది కదా’ అన్నాను. దానికి వాడు బదులు చెప్పకుండా మౌనంగా నిరసన వ్యక్తం చేశాడు.

చదవండి :  కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

మొల్ల గోపవరం గ్రామానికి చెందినామేనని ఆగ్రామస్తులు ఆధారాలు చూపి ఉండవచ్చు కానీ, మా అభిప్రాయం ఏమిటంటే మొల్ల మావూరి బిడ్డ అని మా పూర్వీకులు చెప్పినదానికి తోడు,

మావూరు బేతాయపల్లి గ్రామంలో తప్ప, ఆ చుట్టుపక్కల వేణుగోపాల స్వామి గుడి వున్న గోపవరంతో సహా ఏ వూరిలోను ‘ కుమ్మరి’ సామాజికవర్గం వారు లేకపోవడం.

ఇప్పటికీ గోపవరం గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలలో సాంప్రదాయంగా మావూరినుండి వీరమ్మ కుమారుడు ‘పోకూరి సుబ్బారాయుడు’ హక్కుదారునిగా కార్యక్రమాలకు హాజరవుతూ ఉండడం.

వారికి మాఊరిలో వేణుగోలగోపాల స్వామి ఆలయం తరుపున మాన్యాలు వుండటం.

ఈ కారణాల వల్ల కవయిత్రి మొల్ల మావూరి బిడ్డ అనేది నిర్వివాదాంశం అని చెప్పలేను కానీ, మా విశ్వాసం మాత్రం బలమైనది.

(ఫొటోలు పంపిన తమ్ముడు నరసింహారెడ్డికి ధన్యవాదాలు.)

– వెంకటరెడ్డి గంటా 

(facebook: venkatreddy.ganta.5)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: