జమ్మలమడుగులో తమిళ హీరో విజయ్
కడప జిల్లాలో సినిమా షూటింగ్ ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు తమిళ, కన్నడ చిత్రాలు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుర్రప్పనికొట్టాలలో (మైలవరం మండలంలోని లింగాపురం పంచాయతీ) తమిళ సినిమా ‘కత్తి’ చిత్రీకరణ జరుగుతుండడంతో సందడి నెలకొంది. తమిళంలో అగ్రకధానాయకుడు విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
మంగళవారం హీరో విజయ్‌పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం పలు సెట్టింగులు వేశారు. కరవుతో అల్లాడుతున్న గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు విషయమై గ్రామస్థులు, కథానాయకుడికి మధ్య జరిగే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు.
గుర్రప్పనికొట్టాలలో రెండు రోజుల పాటు, అనంతరం జమ్మలమడుగు, పెద్దపసుపుల దారిలోని పొలాల్లో చిత్రీకరణ సాగుతుందన్నారు.
లేక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత అయినాగారన్ కరుణామూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేనేజర్లు తిరుపతి శీను, సుధాకర్, జెమినీ గణేశన్, శ్రీనివాసులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.