కడప కోటిరెడ్డి
1957లో రెవెన్యూ మంత్రి హోదాలో కడపలో జరిగిన ఒక సభలో (కూర్చుని ఉన్న వ్యక్తి)

కడప కోటిరెడ్డి గురించి వారి కుమార్తె మాటల్లో…

తల్లిదండ్రులను అందరు పిల్లలు ప్రేమిస్తారు. గౌరవిస్తారు. కాని కన్నబిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులు కొద్దిమంది మాత్రమే! బిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక గుణాలు, సంస్కారం ఉండాలి. మహోన్నతమైన ప్రేమ, ఆదరణ, ప్రవర్తన ఉన్నటువంటి పూజ్యులు నా తల్లిదండ్రులు స్వర్గీయులు కడప కోటిరెడ్డి గారు, శ్రీమతి రామసుబ్బమ్మ గారు. నా తండ్రి శ్రీ కోటిరెడ్డి గారు మనోవాక్కాయ కర్మలతో ధర్మము తప్పక ప్రవర్తించారు. వారి ప్రవర్తన, ఆలోచనలు ఉత్తమోత్తంగా ఉండేవి. అతి సున్నితమైన మనస్సు, అబద్ధమాడకూడదు, ఇతరులను నొప్పించకూడదు అన్న వారి ఆలోచన విధానానికి స్ఫూర్తి నిచ్చినవారు వీరి అన్నగారు. వారిని ఆ రోజులలో సత్యహరిశ్చంద్రుడు అనే వారు. నాన్నగారు జీవితాంతం సత్య ప్రవర్తన, ఏక పత్నీవ్రతం, అజాతశత్రుత్వం కలిగినవారు.

నాన్నగారు భారత రామాయణాలు ఎప్పుడూ చదువుతుండేవారు. జైల్లో ఉన్నప్పుడు కూడా చదివేవారు.

ఒరులేయవి యొనరించిన
నరవర! యప్రియము తన మనంబున కగు తా
నొరులకు నవి చేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.

అన్న భారతంలోని పద్యాన్ని నాకు ఎప్పుడూ, వినిపించి దాని భావాన్ని చెప్పేవారు.

మా తల్లిదండ్రుల జీవిత విశేషాలను రాయాలంటే ఏమి రాయాలనే సందేహం కలిగింది. నిదానంగా ఆలోచించిన మీదట వారి జీవితాలలోని కొన్ని ముఖ్య సంఘటనలు గుర్తుకు వచ్చాయి. మా తండ్రి గారి అసలు పేరు కోటిరెడ్డి గారి కోటిరెడ్డి. వారి స్వగ్రామం ఇప్పటి చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా కోటిరెడ్డిగారి పల్లె (అప్పట్లో ఈ ఊరు కడప జిల్లాలోనే ఉండేది). కడపలో స్థిరనివాసం ఏర్పరచుకున్నందున కడప కోటిరెడ్డిగా పేరు స్థిరపడింది. మా తాతగారు సిద్ధారెడ్డిగారు, మా అవ్వగారు నాగమ్మగారు, మా ముత్తాత కోటిరెడ్డిగారి జ్ఞాపకార్థం, మా తండ్రి గారికి కోటిరెడ్డి అన్న పేరు పెట్టారు. మదనపల్లిలో చదువుకునే రోజులలో, ఒక రోజు ఆలస్యంగా రైల్వేస్టేషన్‌కు వచ్చి బయలుదేరుతున్న రైలులో ఎక్కారు. తరువాత స్టేషన్‌లో దిగి అచ్చట స్టేషన్ మాస్టర్‌తో తాను టిక్కెట్టు కొనకుండా ప్రయాణించిన కారణాలు వివరించి మదనపల్లె నుంచి టిక్కెట్టు తీసుకున్నారట.

చదవండి :  'గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా' - సభాపతీయం 1

మద్రాసులో బారిష్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించిన తరువాత ఆ వృత్తిలో అసత్యమాడడంలాంటి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుందని ఒక సంవత్సర కాలం మాత్రమే ఉండి ఆ తరువాత ఆ వృత్తి నుంచి వైదొలగారు. మా తండ్రిగారు చిన్ననాటి నుంచి స్త్రీలపై అత్యంత గౌరవం చూపేవారు. అంతేగాక స్త్రీలకు సమానహోదా కల్పించడంలో అత్యంత శ్రద్ద వహించారు. అందుకు నిదర్శనమే మా తల్లిగారికి ఆంగ్ల భాష నేర్పించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు ప్రోత్సాహం ఇవ్వడం, ఆడబిడ్డలమైన మా చదువులపై శ్రద్ద వహించడటం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలులో ఉన్నప్పుడు నేను ఎస్ఎస్ఎల్‌సి పాసు అయ్యాను. ఈ విషయము తెలుసుకున్న మా తండ్రిగారు నన్ను కాలేజీలో తప్పక చేర్పించవలసిందిగా మా అమ్మకు చెప్పారు.

లండన్‌లో చదువుకునే రోజులలో, క్రిస్‌మస్ పండుగ వేడుకలకు నాన్నగారు హాజరయ్యారట. ఆ క్రిస్‌మస్ సందర్భంగా ఒక ఆడపడుచు క్రిస్‌మస్ ట్రీ దగ్గర నిలుచుంటే, ఒక్కొక్కరు వరుసగా వెళ్లి ఆ ఆడపడుచును ముద్దుపెట్టుకునే ఆచారముందట. ఆ సన్నివేశానికి హాజరైన నాన్నగారు అలా చేయడం తప్పు అని తెలుసుకుని, అలాచేస్తే ఆమెను పెండ్లాడదలచుకున్న అతనికి మోసం చేసినట్లేనని గ్రహించి ఆ ఆచారాన్ని తిరస్కరించారట. మా తండ్రిగారు జీవితంలో ఎన్నడూ మద్యపానం చేయలేదు. ఒక వస్తువు మంచిది కాదు అని తెలిస్తే తరువాత అది ఎట్టిదోచూస్తామనే కుతూహలం కూడా చూపించనవసరం లేదనేవారు. నాన్నగారికి వచ్చిన ఈ సంస్కారం జన్మజన్మల ఫలితమని నా నమ్మకం. మా నాన్నగారు స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి ముఖ్య కారణాలు, వారి ఆలోచన, ప్రవర్తన, ఆనాటి దేశ రాజకీయ ఫలితమని నా నమ్మకం.

చదవండి :  కడప మీదుగా శబరిమలకు వెళ్ళే ప్రత్యేకరైళ్లు

చదువుకునే రోజులలో మదనపల్లి థియసాఫికల్ సొసైటీకి సంబంధించిన డాక్టర్ కజన్, శ్రీమతి మార్గరెట్ కజన్ దంపతులు కడపకు ఎప్పుడు వచ్చినా, మా ఇంటికి వచ్చేవారు. కజన్స్ దంపతులకు ఇష్టమయినటువంటి కేకులు, వగైరా అమ్మగారు స్వయంగా తయారుచేసేవారు. మా అమ్మగారు రాజకీయాలలోకి రావడానికి ముఖ్య ప్రోత్సాహకురాలు శ్రీమతి మార్గరెట్ కజన్, నాన్నగారితో పాటు అమ్మగారు స్వాతంత్య్ర సమరోద్యమంలో పాల్గొన్నప్పటికీ మా చదువుల విషయంలో ఏ మాత్రమూ అజాగ్రత్త వహించలేదు. అటు రాజకీయాలు, ఇటు సంసారం చూస్తూ కూడా మా అమ్మగారు ఎవరికి ఏ విషయంలోనూ కొరత చేయలేదు.

నాన్నగారు రాజకీయాలలో అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించేవారు. ఒకమారు ప్రస్తుత విజయవాహిని స్టూడియో నాగిరెడ్డిగారు ఆ రోజులలో తమ గ్రామమైన కొత్తపల్లిలో ఖాదీ బట్టలు నేయించేవారట. గాంధీ మహాత్ముడు స్థాపించిన ఖాదీ సంఘానికి రాయలసీమ ప్రాంతానికి బాధ్యత నాన్నగారికి అప్పగించారట. ఒకమారు కొత్తపల్లి గ్రామములో ఉన్న ఖాదీ సంఘానికి ముడిసరుకులు సరఫరా చేయలేకపోయారట. తరువాత కొద్ది రోజులకు కొత్తపల్లి వెళ్లి శ్రీనాగిరెడ్డి గారికి క్షమాపణ చెప్పారట. నాన్నగారికి పదవీ వ్యామోహం గానీ, ధన వ్యామోహం గానీ ఏ మాత్రం ఉండేవికాదు.

ఆనాటి జస్టిస్ పార్టీ నాయకులు పానగల్‌రాజుగారు నాన్నగారిని తమ పార్టీలో చేరమని, చేరిన వెంటనే మంత్రిపదవి ఇస్తామని కోరారు. బ్రిటిష్ వారిని పారద్రోలడానికి కంకణం కట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బ్రిటిష్ వారికి దాసోహమనే పార్టీలో చేరడానికి నాన్నగారు నిరాకరించారు. 1934వ సంవత్సరం గాంధీగారు ఆంధ్రదేశ పర్యటనలో భాగంగా కడప పర్యటించి బస చేసినప్పుడు గాంధీగారు ఉదయం ప్రార్థనకు వెళ్లేందుకు మా అమ్మ ఉదయం 4 గంటలకే మమ్ములందరిని లేపి తలంటి స్నానం చేయించి గాంధీగారి ప్రార్థనలకు తీసుకెళ్లేది. గాంధీగారిని దర్శించాలంటే దేవుని దర్శనానికి వెళ్లినట్లు అనిపించేది. గాంధీగారిని మా తాతగారు సుద్దపల్లి రామచంద్రరెడ్డిగారు హరిజన సేవాసంఘానికి విరాళం ఇచ్చేందుకై తన గ్రామానికి ఆహ్వానించాడు. మహాత్ముడు కర్నూలు వెళ్లుతూ సుద్దపల్లి గ్రామానికి వెళ్లారు. ఆ నాటి సభలో గాంధీగారు చెప్పిన మాటలలో మూడు మాటలు మా అమ్మగారు మాకు చెప్పారు.

చదవండి :  కడప - హైదరాబాదు డబుల్ డెక్కర్ చార్జి రూ.570

హింస న కరో (హింస చేయవద్దు), మత్ పీవో (మద్యపానం చేయవద్దు), సత్య బోలో సత్య బోలో (సత్యమే చెప్పవలెను).

నాన్నగారు జీవితాంతం ఎంతో ఉత్సాహంగా జీవించారు. వయసు పెరిగిన తరువాత కూడా ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు. పేపర్లు చదువుతూ సమాజంలో నీతి లోపించింది. ధర్మం తగ్గిపోయిందని బాధపడేవారు. దిగజారిన విలువలు గల మనుషులను చూచి బాధపడేవారు. ఒకసారి నాతో ఇలా అన్నారు – ‘అమ్మా! నాకు ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతకాలని ఉంది. ఎందుకంటే శాస్త్రీయ విజ్ఞానంతో మానవాళి ఎంతో అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో గొప్ప విజ్ఞానం అభివృది కానుంది. దానివలన దేశ ప్రజలు చాలా గొప్ప సౌకర్యాలు పొంది అభివృది చెందగలరు. అది చూడాలని ఉంది’ అని . సత్యవాక్కు, పరోపకారం, దయ, కరుణ గల ఆ పుణ్యదంపతుల కుమార్తెగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం!

– శ్రీమతి ఇందిరాదేవి (కోటిరెడ్డి కుమార్తె)

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: