
Image courtesy : The Hindu
ఒక్క వాన చాలు (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
వాన మాట విన్పిస్తే చాలు
చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి
మేఘాల నీడలు కదిలితే చాలు
కళ్లు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి
కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై
పైరు చెక్కిళ్లమీద జాలిగా జారుతోంది
ఉత్తర ప్రగల్భాల ఉరుముల్తో ఉత్తర కూడ దాటింది
ఒక్క వాన వొంగితే చాలు
ముక్కాలు పంటన్నా చేతికొస్తుంది
ఎన్ని సాయంత్రాలు రేడియోల ముందు సాగిలబడ్డామనీ !
ఎన్ని సార్లు – జలరేఖల్ని లెక్కగట్టే ముసలాళ్ళ ముందు
బీడీ ముక్కలమై మినుకు మినుకుమన్నామనీ !
ఎన్ని రాత్రిళ్ళు – ఆరుబైట మంచమేసికొని
ముద్ద ముద్దగా తడిసి మంచాన్ని ఇంట్లోకి మార్పించే వాన కోసం
పడిగాపులు కాశామనీ !
రిక్త హస్తాలతో హస్తకారై కూడ దాటింది
ఒక్క పదనయితే చాలు
సగం పంటన్నా చేతికొస్తుంది
వాడి మాడే పైరు | మా గుండెలపై
కదిపిన కందిరీగల పట్టు అవుతోంది
నెర్రెలెత్తి వెర్రిదైన భూమి- మా నొసటిపై
రక్తపింజర్ల కలివెతుట్టె అవుతోంది
ఆకుల మీది మచ్చలు ఏ పోషకాల లోపంవల్లా కాదు
పొడి ఆహారానికి వేరు నోరంతా పిడచగట్టుకు పోవటంవల్లే
చిత్తాన్ని చిత్తు చిత్తుజేస్తూ చిత్తకార్తె కూడ దాటింది
ఒక్క వాన మోదు చాలు
పాతిక పంటన్నా చేతికొస్తుంది
బాగున్న చెరువులుండవు – నీరున్న బోరుబావులుండవు
నదుల గుండె తడిని విన్పించే చిట్టి కాలువలుండవు
ఓట్లకు తప్ప మరెందుకూ పనికిరాని యీ గడ్డమీద
వరుణదేవుడికి కూడ శీతకన్నే
మోరపైకెత్తిన యీ ఆరడుగుల ఆశలకుప్ప
రోజుల తరబడి శిలావిగ్రహమవుతోంది
చురుక్కుమని పొడిచే ఎండముల్లులు తప్ప
ఒక్క చినుకు కూడా రాలదు –
మాడి మసై పోతోన్న పైరు కన్నీటి చుక్కలై
నా కళ్ళు మేఘాల్లోంచి జారటం తప్ప
స్వాతిశయపు నిర్లక్ష్యంలో స్వాతికార్తె కూడా దాటింది
ఇప్పుడయినా ఓ చినుకురాలితే
విత్తనాలయినా దక్కుతాయి
˛˛ ˛˛ ˛˛
ఈ సీమ ఎడారిగా మారినా బావుండు –
రాని వసంతం కోసం ఎదురుచూస్తూ
క్షణ క్షణం చావకుండా ఉండేందుకు
[author image=”https://kadapa.info/wp-content/uploads/2013/01/sannapureddy.jpg” ]
సన్నపురెడ్డి పుట్టిందీ, పెరిగిందీ , ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నదీ – కడప జిల్లా, కలసపాడు మండలం బాలరాజుపల్లెలో – కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు. వీరి ‘పాలెగత్తె’ స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో – ‘చినుకుల సవ్వడి’ చతుర నవలపోటీలో ప్రథమ బహుమతిని సాధించాయి. వీరి తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందింది.2006 ఆటా పోటీలలో వీరి నవల తోలుబొమ్మలాట ప్రథమ బహుమతి పొందింది.
[/author]
1 Comment
బాగున్న చెరువులుండవు – నీరున్న బోరుబావులుండవు
నదుల గుండె తడిని విన్పించే చిట్టి కాలువలుండవు
ఓట్లకు తప్ప మరెందుకూ పనికిరాని యీ గడ్డమీద
వరుణదేవుడికి కూడ శీతకన్నే
మోరపైకెత్తిన యీ ఆరడుగుల ఆశలకుప్ప
రోజుల తరబడి శిలావిగ్రహమవుతోంది
చురుక్కుమని పొడిచే ఎండముల్లులు తప్ప
ఒక్క చినుకు కూడా రాలదు –
Rallaseema rythu vyadhanu kallaku kattinattu vrninchina teeru chakkagaa vundi.. Grameena rythaangam vydhaabaritha jeevana pai enno chakkani kavithalu mee kalam nundi jaaluvaaraalanee, aa kavitha chadivi prakruthi pulakinchi varshinchaalanee asisthoo.. Bhavadeeyudu. Rajendra Prasad . M.