ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట కోదండ రామాలయం

అపర అయోధ్య.. ఒంటిమిట్ట

అపర అయోధ్యగా కొనియాడబడుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి పురాణ, చారిత్రక విశేషాలున్నాయి. బహుళ ప్రచారంలో ఉన్న కథనాల కన్నా మరింత ఆసక్తిదాయకమైన విశేషాలు కూడా ఉన్నాయి. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు …

ఒంటిమిట్టలో మాత్రమే…

రాత్రిపూట కల్యాణం

సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ దేవతామూర్తుల కల్యాణోత్సవాలను పగలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రం లో మాత్రమే రాత్రి 11 గంటల తర్వాత నిర్వహిస్తారు. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గురువారం ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణం సందర్భంగా ఆ విశేషమేమిటో తెలుసుకుందాం..

క్షీరసాగర మథనంలో శ్రీలక్ష్మీతోపాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు. శ్రీలక్ష్మిని చేపట్టిన మహావిష్ణువును తననూ కరుణించాలని చంద్రుడు అడిగాడు. దశావతారాల్లో అప్పటివరకు స్వామి జననం జరిగింది పగలేనని, రాత్రులు మాత్రమే తిరిగే తనకు పరమ మంగళకరమైన ఆయన జననం, కల్యాణాలను తిలకించేలా అనుగ్రహించాలని, శ్రీలక్ష్మిని వక్షస్థలంలో ధరించినట్లు తనకూ అలాంటి అదృష్టమేదైనా ప్రసాదించాలని కోరాడు. సరేనన్న విష్ణువు.. రాత్రి సమయాల్లో చంద్రుడు చూసేందుకు అనుకూలంగా అష్టమిరోజు రాత్రి శ్రీకృష్ణునిగా అవతరించాడు. మరొక వరంగా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రాత్రిపూట కల్యాణం చూడవచ్చని అనుగ్రహించాడు.

చదవండి :  ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?

అలాగే రాముడు చంద్రుడి పేరును కలుపుకొని ‘శ్రీరామచంద్రమూర్తి’గా వ్యవహరింపబడతాడని వరమిచ్చాడు. ఆ ప్రకారం.. ఒంటిమిట్టలో రామయ్య కల్యాణాన్ని రాత్రివేళనే నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతి దేశంలో ఇంకెక్కడా లేదు. ఒంటిమిట్టలో షోడ శ కళానిధి శ్రీరామచంద్రుడి క ల్యాణం సమయంలో పౌర్ణమి ఘడియలుంటాయి. చంద్రుడు షోడశ కళలతో నిండు వెలుగులను కురిపిస్తూ లోక కల్యాణమూర్తి శ్రీకోదండరాముని కల్యాణాన్ని తిలకిస్తాడు.

ఇద్దరు మామలనిచ్చిన ఒంటిమిట్ట

ఒంటిమిట్ట క్షేత్రం రామునికీ, కృష్ణునికీ కూడా ‘మామ’లను అందించింది. త్రేతాయుగంలో శ్రీరాముడిచ్చిన వరం మేరకు జాంబవంతుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి తన కుమార్తె జాంబవతిని ఆయనకు ఇచ్చి ‘మామ’ అయ్యా డు. ఆ జాంబవంతుని ప్రతిష్టగా చెప్పబడే ఒం టిమిట్ట కోదండరామునికి పోతన తన ‘మహా భాగవత’ కావ్య కన్యను ఇచ్చి కన్యాదాన ఫలం దక్కించుకుంటాడు. జాంబవంతుడు, పోతన ఇద్దరూ ఒంటిమిట్ట కోదండరాముని భక్తులే.

చదవండి :  అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం

సాహిత్యాలయం

పాత తరంలో దేవాలయాలు సకల కళలకు ఆటపట్టుగా నిలిచేవి. మన జిల్లాలో గోపవరం మొల్లమాంబ శ్రీకంఠమల్లేశ్వరుని దయతో రామాయణాన్ని రాయగా, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో ఆ స్వామి ఆశీస్సులతో శివతాండవం రాశారు. కానీ ఒంటిమిట్ట రఘురాముని కటాక్షంతో ఇక్కడ ఎందరో కవులు ప్రతిభావంతమైన కావ్య సృష్టి చేశారు.

పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఆయన తాత అయ్యలరాజు తిప్పకవి, అయ్యలరాజు నారాయణరాజు, వాసదాసు – వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్టకు చెందిన కవులుగా విశిష్ట కావ్యాలు రచించారు. అయ్యలరాజు రామభద్రుని తం డ్రి అయ్యలరాజు నారాయణరాజుకు మహాభాగవతమంటే ఎంతో ఇష్టం. ఒంటిమిట్ట ఆలయంలో తరచూ ఆయన భాగవత పారాయ ణం చేస్తుండేవారు. ఓ మారు అలా చెబుతూ ‘పలికించెడివాడు రామభద్రుడట’.. అన్న పద్యం చదివి చెబుతుండగా కుమారుడు పుట్టాడన్న సమాచారం తెలుస్తుంది. అందువల్ల ఆయన ఆ బిడ్డకు రామభద్రుడని పేరు పెట్టారు.

చదవండి :  అన్నమయ్య దర్శించిన ఆలయాలు

ఈ నిర్మాణాలు ఎప్పటివి?

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం అద్భుత శిల్ప సంపదకు ఆలవాలం. ఈ కట్టడంలో అడుగడుగునా శిల్పి చాతుర్యం కనిపిస్తుంది. కడప కైఫీయతుల్లో ఒంటిమిట్టకు సంబంధించిన అంశాన్ని చారిత్రక పరిశోధకులు విద్వాన్ కట్టా నరసింహులు ఇటీవల పరిష్కరించారు. దానినిబట్టి ప్రస్తుతమున్న ఈ ఆలయ నిర్మాణాలను 1336 ప్రాంతానికి చెందిన సంగమ వంశీయుడైన నలకంపమరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. ఒంటిమిట్ట చెరువును కూడా ఆ సమయంలోనే నిర్మించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ వివరాలు తెలిపే శాసనాలు అంతరాలయం, గర్భాలయం లేదా ఆలయ ప్రాంగణంలోని ఇంకొకచోటనో ఉండవచ్చంటున్నారు.

(సాక్షి దినపత్రిక)

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట రథోత్సవం

కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన  కోదండరాముడు పుర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: