
ఎల్లువ (కథ) – దాదాహయత్
‘యెంకటేస్వర సామీ, కాపాడు తండ్రీ’ కోర్టుహాల్లోకి వెళ్తూ తిరుపతి కొండ వున్న దిక్కుకు తిరిగి దండం పెట్టుకున్నాడు గొల్ల నారాయణ. దావా గెలిస్తే కొండకొస్తానని మొక్కుకున్నాడతను. ఆరోజే తీర్పు. కొద్దిసేపటి క్రితమే అతని వకీలు అతనికి ధైర్యం చెప్పాడు. ”మరేం ఫరవాలేదు. దావా గెల్చేది మనమే. నువ్వు నిమ్మళంగా వుండు” అన్నాడు.
గొల్లనారాయణ అలాగేనని బుర్రూపాడు. అయితే అంతటితో అతనికి ధైర్యం చిక్కలేదు. ”అన్నింటికీ నువ్వే వుండావు సామీ” తిరుపతి వెంకన్నను తల్చుకుని అప్పుడే మనసులో దండం పెట్టుకున్నాడు. అతని భార్య కూడా అతను కోర్టు బయల్దేరే ముందు అదే చెప్పింది. ”సామి సల్లంగా సూడాల్నేగాని, ఈ వకీల్లతో యేమైతాది? కోరటుకాడ నిన్ను బిల్సినప్పుడు యెంకటేస్వర సామిని తల్సుకో” అని హితబోధ చేసింది. గొల్ల నారాయణ ఇప్పుడలాగే చేశాడు. దాంతో మనసుకు కొంత ధైర్యం చిక్కింది. ‘అన్నింటిక బగమంతుడే వుండాడు’ అనుకున్నాడు. దాంతో మరికొంత ధైర్యం చిక్కింది. జడ్జిగారి ముందు వణక్కుండా నిలబడగలిగాడు.
”గొల్లనారాయణ నువ్వేనా?” అడిగాడు బెంచి గుమాస్తా.
”నేనే సామీ” అన్నాడు నారాయణ.
”నీ దావా కొట్టేసినారు పో” అన్నాడు బెంచి గుమాస్తా. నారాయణకి అతనేం చెబుతున్నాడో తెలీలేదు.
దావా కొట్టేసినారంటే గెల్చినట్టో ఓడినట్టో అర్థం కాలేదు.
”అంటే దావా గెల్సినానా సామీ?”
ఆ ప్రశ్నకు కోర్టు హాలంతా గొల్లున నవ్వింది.
”ఓడి పోయినావు పోవయ్యా. నీ దావా పోయింది” అన్నారెవరో.
గొల్లనారాయణ కళ్ళముందు చీకటి వ్యాపించినట్లయ్యింది.
”అన్యాలం సామీ, ఆ భూమి నాదే” మొరపెట్టుకున్నాడు.
జడ్జి మొదటిసారిగా నోరు విప్పాడు. ”భూమి నీదేనంటే అప్పీలు చేస్కో. ఇంక నేను చెయ్యగలిగిందేం లేదు.”
నారాయణ ఎలా కోర్టు హాల్లోంచి బయటికొచ్చాడో అతనికే తెలీదు.
”యెంకటేస్వర సామీ, నువ్వు గూడ్కా మోసం జేస్తివా!” బిగ్గరగానే అనుకున్నాడు.
అతని వకీలు ఎక్కడా కనిపించలేదు. మాల ఈరిగాడు మాత్రం కనిపించాడు.
”ఈరిగా, మీకేం జేసినాననిరా నన్నీమైన సతాయిస్తావుండారు?” కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అడిగాడు.
ఈరిగాడు అతనివైపు జాలిగా చూశాడు.
”మాదేం లేదన్నా. గవర్నమెంటోల్లు ఆ భూమి మాకిస్తామంటే తిరుగుతాండాం” అన్నాడు.
”ఆ భూమి నాదిరా” వాపోయాడు నారాయణ.
”గవర్నమెంటుదంట గదన్నా! నీది కాందానికెందుకు గస పెట్టుకుంటా తిర్గుతావ్? లెక్కంతా కొండబోయి వకీల్ల నోట్లో యెందుకు బోస్తావ్? దావా వదిలేయ రాదా?” సలహా ఇచ్చాడు ఈరిగాడు.
”యెంత మాటంటివిరా ఈరిగా! ఆ భూమినాదన్న” ఏడుపొక్కటే తక్కువగా అన్నాడు నారాయణ.
ఈరిగాడు అతని మొహంలోకి చూడకుండా కళ్ళు తిప్పుకున్నాడు.
”వస్తాన్నా. నే బోతాండా.ఈ పొద్దు ఎమ్మార్వో రమ్మన్న్యాడు”అంటూ మళ్ళీ అతనివైపు చూడకుండా వెళ్ళిపోయాడు.
నారాయణ హతాశుడై ఒక చెట్టుకింద ముడుచుకుని కూర్చుండిపోయాడు. ఎదురెండకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి భుజంమీది పై గుడ్డ దులిపి నెత్తికి చుట్టుకున్నాడు. సూర్యకిరణాలు అప్పటికీ అతన్ని వదలకపోవడంతో నుదుటి మీద అరచేతులు చేర్చుకుని కూర్చున్నాడు.
కాసేపటికి అతని వకీలు అటుగా వెళ్తుండడం కనిపించింది. గొల్లనారాయణ చెట్టు కిందనుంచి లేచి అతనివైపు పరిగెత్తాడు.
”సామీ!”
పరబ్రహ్మేశ్వర శాస్త్రి ఆగి అతనివైపు తిరిగాడు.
గొల్లనారాయణ ఆయనకు రెండు చేతులూ జోడించాడు.
”దావా గెలుస్తామంటిరి గద సామీ! ఓడిపోతిమి”
పరబ్రహ్మేశ్వరశాస్త్రి ఇబ్బందిగా మొహం పెట్టాడు. ఆయనకు బదులు ఆయన వెనుకే దావా కట్టలు పట్టుకొస్తున్న వకీలు గుమస్తా చండ్రాయుడు నోరు తెరిచాడు. ”సారుదేం తప్పులేదు నారాయణా! మనకేసు బలంగా వుండింది. ఆ మాల నాకొడుకులే జడ్జీకి లంచమిచ్చారు” అన్నాడు.
పరబ్రహ్మేశ్వరశాస్త్రి ఆ ట్రిక్కుతో కొంచెం తేరుకున్నాడు.
”అవునవును. చేసిందంతా వాళ్ళే. అందులోనూ ఆ జడ్జీ పరమనీచపు ముండాకొడుకు. లంచమిస్తే చాలు లొంగిపోతాడు” అన్నాడు.
”ఆ మాలోల్ల కాడ లంచమిచ్చినంత లెక్క యాడిది సామీ? అదే వుంటేగిన ఉద్దరగొచ్చే భూమి కోసరం యెంపర్లాడతారా?” ఆశ్చర్యం ప్రకటించాడు నారాయణ.
”వెర్రి గొల్లోనివి నీకేం తెలుసులే నారాయణా! వెనకటి కాలం కాదు. ఈ కాలం మాలోళ్ళకాడ ఎంత డబ్బుందో నీకేం తెలుసు. ఉద్యోగాలు వాళ్ళవే. ఊళ్ళో భూములు వాళ్ళవే. అన్ని సదుపాయాలు వాళ్ళకే. అంత దూరం ఎందుకు, నీ భూమికూడా వాళ్ళకే పోతోంది చూశావా? అడిగే నాధుడేడి? కోర్టులు కూడా వాళ్ళకు అనుకూలంగానే తీర్పులు చెబుతున్నాయి” తన వాదన వినిపించాడు పరబ్రహ్మేశ్వరశాస్త్రి.
”ఇప్పుడేం చేయాల సామీ?” అడిగాడు నారాయణ.
”ఏం చేసేదేముంది? సబ్ కోర్టులో అపీలు చేసుకోవాలి” అన్నాడు చండ్రాయుడు.
”అలా చేస్తే నా భూమి నాకు తిరిగొస్తాదా సామీ?”
”ఎందుకు రాదు? మన కేసులో బలం వుందని చెప్తిని గదా.”
”అందుకెంతైతాది సామీ?” పరబ్రహ్మేశ్వర శాస్త్రి వైపు తిరిగి అడిగాడు నారాయణ.
”ఆ విషయం చంద్రాయుడు చెప్తాడు. నాకవతల ఇంకో కేసుంది” అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు పరబ్రహ్మేశ్వరశాస్త్రి.
నారాయణ చంద్రాయుడివైపు చూశాడు.
”ముందో పది రూపాయలు త్యా, చెప్తాను” అన్నాడు చంద్రాయుడు.
”ఇప్పుడు లేవు సామీ, జేబులో లెక్క లేదు.”
”అయితే సాయంత్రం ఆఫీసుకురా, ఆడ చెప్తాను” అంటూ వెళ్ళిపోయాడు చంద్రాయుడు.
నారాయణ కాసేపు దిక్కు తోచని వాడిలా అక్కడే తచ్చాడి నెమ్మదిగా కోర్టు ఆవరణలోంచి బయటికొచ్చాడు.
”ఏం నారాయణా, యేమైంది కేసు?” అడిగాడు రాముడు.కోర్టు వెలుపల టీ బంకు అతనిదే. అక్కడికి వచ్చినప్పుడల్లా నారాయణ రాముని టీయే తాగుతాడు.
”పోయిందన్నా, దావా కొట్టేసినారు” దిగులుగా అన్నాడు నారాయణ.
రాముడు అతని మొహం చూసి ఆ మాట ముందే గ్రహించాడు. ఏళ్ళ తరబడి కోర్టు ముందు టీ బంకు నడుపుతుండటంవల్ల ఎవరికేసు ఏమైందో మొహం చూసి చెప్పగల అనుభవం సంపాయించుకున్నాడతను. నారాయణ ఆ మాట చెప్పగానే గమ్మున గ్లాసులో టీ పోసి అతనివైపు చాచాడు.
”ఇదో టీ తాగు.”
”వద్దులే,” అన్నాడు నారాయణ.
”ఫరవాలేదు తీస్కోన్నా. కోర్టులో కేసు గెలవాల్నంటే అంత సులభంగా అయితాదా? అవసరమైతే హైకోర్టుగ్గుడ్కా పోవాల్సొస్తాది. ముందు టీ తాగు.”
నారాయణ టీ గ్లాసందుకున్నాడు. అతనికి టీ తాగాలని లేదు. కడుపులో దహించుకుపోతోంది. అయినా నెమ్మదిగా టీ చప్పరించడం మెదలెట్టాడు.
రాముడు పిస్టన్‌కొట్టి కిరసనాయిలు స్టవ్ మంట ఎక్కువ చేస్తున్నాడు. బుస్‌మని శబ్దం చేస్తూ మంట క్రమంగా పెరుగుతోంది. స్టౌమీదున్న పాత్రలో టీ మరింత వేగంగా మరగనారంభించింది.
నారాయణ ముభావంగా స్టౌమంట కేసి చూస్తూ కూర్చున్నాడు. తన పరిస్థితి ఆ స్టౌమీద మరుగుతున్న టీ పరిస్థితి ఒకటేననిపించిందతనికి. చూస్తుండగానే చేజారిపోతున్న తన నాలుగెకరాల భూమి గుర్తుకొచ్చింది. ఇక టీ తాగబుద్ధి కాలేదు. గ్లాసు పక్కనే బల్లమీద పెట్టేసి శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు.
ఆ నాలుగెకరాల భూమినే నమ్ముకు బతుకుతున్న సన్నకారు రైతు అతను. వాన సరిగ్గా వస్తేగానీ అది కూడా సరిగ్గా పండదు. చాలాకాలం క్రితం అతనికా భూమికి పంపుసెట్టు వేయించాలనే ఆలోచన వుండేది. తన భూమికి పక్కనే వున్న రామిరెడ్డి పంపుసెట్టు కోసం బ్యాంకు రుణం ఇప్పిస్తానని కూడా చెప్పాడు.
అయితే రుణం తీసుకుని పంపుసెట్టు వేయిస్తే ఏమవుతుందో నారాయణకు తెలుసు. రామిరెడ్డి ఆ వూళ్ళోకెల్లా పెద్ద పాలెగాడు. ముప్ఫయి ఎకరాల ఆసామి. తన పల్లెలో పెత్తనమంతా అతన్దే. అతని మాట విని తను పంపుసెట్టు వేయించుకుంటే రుణం ఇప్పించిన నెపం మీద పంపు నీళ్ళు తన భూమిలోకి మళ్ళించమంటాడు. తన నాలుగెకరాల సంగతేమో కాని అతని ముప్ఫయి ఎకరాలకు నీళ్ళు సప్లయి చేయడానికే తన జీవితకాలం సరిపోతుంది. ఆ భయంతో పంపుసెట్టు గురించి ఆలోచన మానుకున్నాడు. నీళ్ళ సదుపాయం వుంటే వరిసైతం పండే పొలం అతన్ది. వేరు సెనగ, పొద్దుతిరుగుడు పూలు అలాంటి వ్యాపార పంటలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. అంతలోనే పొలాన్ని వదిలిపెట్టి పొమ్మని గవర్నమెంటు ఆర్డరు పిడుగులా వచ్చి పడింది.
ఫలానా సర్వే నంబరు ప్రకారం గవర్నమెంటు పోరంబోకుగా వుంటూవున్న భూమిని చట్టవ్యతిరేకంగా నువ్వు దురాక్రమణ చేసి సాగు చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది కావున వెంటనే భూమిని వదిలిపెట్టి పోవలసింది. అట్లు కాని యెడల నీ పై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును-అదీ ఆర్డరు.
అలాంటి ఆర్డరు రావడంతో నారాయణకు మతిపోయినట్లయింది. ఇదేం అన్యాయం! తను సాగు చేస్తున్న భూమి గవర్నమెంటు పోరంబోకు కాదు. తాత తండ్రులనుంచి తనకు సంక్రమించింది. లబోదిబోమంటూ అతనా ఆర్డరు పట్టుకుని ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్ళాడు. వాళ్ళకాళ్ళు పట్టుకుని వీళ్ళకాళ్ళు పట్టుకుని ఎలాగో తన భూమికి సంబంధించిన రికార్డులు బయటికి లాగించాడు.
”రికార్డుల్లో ఆ భూమి గవర్నమెంటు పోరంబోకనే వుంది. కాబట్టి నువ్వా భూమి వదులుకోవలసిందే,” అన్నారు వాళ్ళు.
ఆ రికార్డులు పుట్టక ముందునుంచీ ఆ భూమిని వంశానుగతంగా తామే సాగుచేస్తూ వస్తున్నారు. అలాంటిది రికార్డుల్లోకి ఆ భూమి గవర్నమెంటు పోరంబోకని ఎందుకు ఎక్కిందో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అతనికి అర్థం కాలేదు.
”ఇదంతా కరణమయ్య పనే అయ్యుండాల. మీ నాయన బతికుండగా చానా పితలాటకం చేసిందాయప్పే కదా. ఇప్పుడంటే ఈ ఎమ్మార్వోలూ వీల్లంతా వచ్చినారు. అప్పుడంతా కరణమయ్యేగదా. పోయి అడుగు” అని సలహా ఇచ్చింది నారాయణ భార్య.
లక్ష్మమ్మ చెప్పింది నిజమే. ఇది కరణమయ్య చేసిన పితలాటకమే అయ్యుండాలి. నారాయణ పిల్లప్పుడు నారాయణ తండ్రికి తీవ్రంగా జబ్బు చేసింది. దాంతో భూమి సాగు చేసే వాళ్ళెవరూ లేకపోయారు. అప్పుడు కరణమయ్యే ఒక ప్రతిపాదన తెచ్చాడు.
”చూడు శేషన్నా! ఈ పరిస్థితిలో భూమి నువ్వెలాగా సాగు చేసుకోలేవు. కాబట్టి నాకు గుత్తకిచ్చేయ్. వచ్చిన పంటలో ఎంతోకొంత నీకిస్తాను. దాంతో నీకు దిగులుండదు,” అన్నాడు.
నారాయణ తండ్రికి కూడా ఆ పరిస్థితిలో అంతకంటే చేయగలిగిందేం లేదనిపించింది. దాంతో కరణమయ్యకే ఆ పొలం గుత్తకిచ్చేశాడు. కరణమయ్య ఒక రెండేళ్ళు బాగానే వున్నాడు. ఆ తర్వాత మనిషే మారిపోయాడు. ఆ భూమి తనదేనని ప్రచారం చేసుకోవడం మొదలెట్టాడు. గుత్త ఎగ్గొట్టేశాడు.
అలా కొన్నేళ్ళు గడిచాయి. ఈలోగా నారాయణ తండ్రి జబ్బునుంచి కోలుకున్నాడు. కరణమయ్య సంగతి పదిమంది పెద్దల్లో పంచాయితి పెట్టించాడు. ఆ భూమి తనదేనని కరణమయ్య మంకుపట్టి కూర్చున్నాడు. ఒకసారి అది తన తాతలకాలంనాటిదని బుకాయిస్తాడు. ఒకసారి శేషన్నే అది తనకు అమ్మేశాడంటాడు.
ఆ సమయంలో ఆ ఊరి రెడ్డిగా వున్న భూమిరెడ్డి శేషన్న పక్షాన నిలిచాడు. అంతకుముందు కొద్దిరోజులుగా కరణమయ్యకూ రెడ్డికీ ఏదో విషయమై కీచులాట జరిగింది. అదే శేషన్నని రక్షించింది. లేకపోతే భూమి కరణమయ్యదేనని తీర్పు చెప్పేసేవాడు రెడ్డి. శేషన్న భూమి శేషన్నకు ఆ విధంగా తిరిగి ఇవ్వక తప్పలేదు కరణమయ్యకు. అప్పట్నుంచీ శేషన్న కుటుంబం మీదగుర్రుగానే వుంటూ వచ్చాడు. ఎలాగైనా ఆ భూమి కాజేయాలని ఆ తర్వాత కూడా పథకాలు వేస్తూనే వున్నాడు.
శేషన్న తదనంతరం ఆ భూమి నారాయణకు వచ్చింది. ఆ తర్వాత కరణమయ్య పరిస్థితి కూడా మారిపోయింది. ప్రభుత్వం రెడ్డి కరణం పోస్టులు రద్దు చేసి మండల కార్యాలయాలు తెరిచింది. కరణం తన కొడుక్కి విలేజ్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆయనకు పక్షవాతం కూడా వచ్చింది. నారాయణకు శ్రీముఖం చేతికొచ్చే సమయానికి కరణమయ్య మంచాన పడున్నాడు. నారాయణ గవర్నమెంటు ఆర్డరు పట్టుకుని కరణమయ్య దగ్గరికి వెళ్ళాడు.
”చూడు కరణమయ్యా, ఏందిది?” అన్నాడు నారాయణ. కరణమయ్య పరిస్థితి దారుణంగా వుంది. కుడిచెయ్యి, కుడికాలు పడిపోయాయి. మూతికూడా వంకర తిరిగింది. అయినా మాట్లాడగలిగే స్థితిలోనే వున్నాడు. నారాయణ పట్టుకొచ్చిన ఆర్డరు చూసి వంకరమూతితో అసహ్యంగా నవ్వాడు.
”ఇలాంటిది ఏదో రోజున జరుగుతాదని నాకు తెలుసురా. నేనే ఆ పని చేసింది,” అన్నాడు ఏమాత్రం సిగ్గుపడకుండా.
నారాయణ గుడ్లు మిటకరించి ”ఏం చేసినావు కరణమయ్యా?” అన్నాడు.
”మీ నాయన నాకు చేసిందానికి రెండింతలు చెయ్యాలనుకున్నా. రికార్డుల్లో ఆ భూమి గవర్నమెంటు పోరంబోకని నేనే నా స్వహస్తాలతో రాసినా”
‘న్యాయంకోసం పోట్లాడ్డమే మా నాయన చేసిన నేరమా కరణమయ్యా?’ అని నారాయణ అడగలేదు.
”నీ కోపం మా నాయనమిందైతే నేనేం జేసినా కరణమయ్యా? బీద నా కొడుకుని నన్నన్యాయం చేస్తివే!” అన్నాడు గుండె బాదుకుంటూ.
”నువ్వు మాత్రం మీ నాయన కొడుకువి కావేమిరా?” అన్నాడు కరణమయ్య.
”ఎప్పటిదో పగ ఇప్పుడు నామీద ఎందుకు తీర్చుకుంటావు కరణమయ్యా? ఈ కుడిసేత్తో ఎన్ని దొంగరాతలు రాసి ఎందరి కొంపలు ముంచినావో బగవంతుడా చెయ్యి పడిపోయినట్టు చేశ. ఇంకనైనా కనికరించి ఈ భూమి గొల్ల నారాయణదని సాచ్చెం చెప్దూ రా.” కడుపుమంట ఆపుకోలేక అనేశాడు నారాయణ.
కరణమయ్య తల అడ్డంగా వూపాడు. ”నువ్వన్నట్టు ఎన్నో పాపాలు చేసిన చెయ్యి పడిపోనే పడిపోయింది. అయితే మాత్రం నీకు నేనెందుకు సాయం చెయ్యాల? నా చెయ్యి నాకు తిరిగొస్తాదా? ఇప్పుడీ భూమి నీదని సాక్ష్యం చెబితే దొంగ రికార్డులు రాసినందుకు నా గొంతు మీదికొస్తాది. పో, పోయి కోర్టులో కేసేసుకో,” అన్నాడు.
”అంతేనంటావా కరణమయ్యా?” ఖిన్నుడై అడిగాడు నారాయణ.
”అంతే పో, నేనేం చేయలేను”నారాయణ వకీల్ని చూడ్డానికి వెళ్ళాడు.
ఈలోగా మరొకటి జరిగింది.
ముప్ఫయి సంవత్సరాల క్రితం ఎప్పుడో కుందేరు పొంగి చుట్టప్రక్కల పల్లెలు కొన్ని మునిగిపోయాయి. ఆ ముంపులో బాగా దెబ్బతిన్నవి హరిజన కుటుంబాలు. వాళ్ళంతా కూడబలుక్కుని ఆ పల్లెలు వదిలేసి ఎగువ ప్రాంతాలకు వలసవెళ్ళారు. వాళ్ళంతా నారాయణ వుండే వూరు చివర కొట్టాలు వేసుకున్నారు. అప్పట్లో వాళ్ళని కొట్టాలు వేసుకోనిచ్చింది ప్రస్తుతం నారాయణ భూమికి పొరుగువాడైన రామిరెడ్డి తాతగారే. అప్పట్లో ఆయన పంచాయితీ బోర్డు ప్రెసిడెంటుగా వుండేవాడు. ఆ వూరి రెడ్డి అయిన భూమిరెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడాయన.
”మరేం ఫర్వాలేదు. ఇవన్నీ మన స్థలాలే. మీరంతా కొట్టాలు బేస్కోండి. మీ పేర్లు ఓటర్ల జాబితాలో ఎక్కిస్తాను. ఓట్లు నాకు బేయండి,” అన్నాడు రామిరెడ్డి తాత.
హరిజనులు సరేనన్నారు.
రామిరెడ్డి తాతగారి రాజకీయాస్త్రం బ్రహ్మాండంగా పనిచేసింది. కొత్తగా తెచ్చుకోగలిగిన ఓట్లతో పంచాయితీ బోర్డు ఎన్నికల్లో ఆయన భూమిరెడ్డి అభ్యర్థిని చిత్తుగా ఓడించాడు. అప్పట్నుంచి హరిజనులు అక్కడే వుంటున్నారు. వాళ్ళ ఓట్లన్నీ ఎప్పుడూ రామిరెడ్డితాతకే పడేవి. దాంతో ఆయన జీవితకాలంలో రాజకీయ పలుకుబడికి తిరుగు లేకపోయింది.
ఆయన తదనంతరం రామిరెడ్డి హయాం వచ్చింది. అతనూ పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు కావాలని ఆశపడ్డాడు. అయితే చాలాకాలం పాటు ప్రభుత్వం ఎన్నికలు జరపనే లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయనే అలికిడి వినిపించసాగింది.
ఈసారి ఎన్నికల్లో హరిజనుల ఓట్లు రామిరెడ్డికి పడవనే విషయం ముందే తేలిపోయింది. రామిరెడ్డి హరిజనుల్ని ఎప్పుడూ మనుషులుగా చూసినవాడు కాదు. మాలనాకొడుకులు అనే పదం తప్ప వాళ్ళను గురించి అతని నోటివెంట మరో మాట దొర్లిపడదు. దానికి తోడు అతని మనుషులు కూడా హరిజనుల పట్ల నీచంగా ప్రవర్తించడం మొదలెట్టారు. హరిజనుల ఆడవాళ్ళు కనిపిస్తే ఏడిపించడం, ఒంటరిగా దొరికితే పైటలాగడం వంటివి నిత్యకృత్యాలయ్యాయి. దాంతో హరిజనులు ఈసారి ఎన్నికల్లో రామిరెడ్డికి బాగా బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో వున్నారు.
రామిరెడ్డితో ఎవరు పోటీ చేస్తారో ఇంకా తేలలేదు. అతని తాతగారి కాలంలో గట్టిపోటీ ఇస్తూ వచ్చిన భూమిరెడ్డి ఇప్పుడు లేడు. అతను బతికుండగా తన కుటుంబంనుంచి ఎవర్నో ఒకర్ని పోటీగా నిలబెట్టే వాడు. వాళ్ళలోనే ఎవరైనా పోటీకీ నిలబడవచ్చు. అదే జరిగితే ఈసారి ఎన్నికల్లో హరిజనుల ఓట్లు అవతలకి పోవడం ఖాయం. రామిరెడ్డి ఓడిపోవడము ఖాయమే.
దాంతో హరిజనుల్ని, స్థలాలు ఖాళీచేయమని పట్టుబట్టాడు రామిరెడ్డి. ”మాయబ్బ ఉద్దరకిచ్చిన స్థలాలు. ఎల్లకాలం ఆడనే వుంటారేమిరా మాల నాకొడుకుల్లాలా? ఖాళీచేయండి,” అంటూ తాఖీదు ఇచ్చాడు.ఆ తర్వాత చాలా కథ జరిగింది. విషయం కలెక్టరు దాకా వెళ్ళింది. ఎప్పుడో ముప్ఫయి సంవత్సరాల క్రితం ఆక్రమించుకున్న స్థలాలు ఇప్పుడు హరిజనులు వదలడమేమిటని కలెక్టరు అడగలేదు. అలా అడగటానికి బదులు ఒక నిర్ణయం చేశాడు. హరిజనులకు వేరేచోట స్థలాలు చూపిస్తానన్నాడు. వాళ్ళూ అందుకు ఒప్పుకున్నారు.
ఇక వాళ్ళకు వేరే స్థలం చూపించే విషయం వచ్చేసరికి ఎమ్మార్వోగారికి గబుక్కున దొరికింది నారాయణ సాగుచేస్తున్న భూమే. దాన్ని హరిజనులకు అలాట్ చేస్తూ ఆర్డర్లు కూడా జారీ అయిపోయాయి.
నారాయణ దాంతో మరీ బెంబేలెత్తి పోయాడు.
వకీలు పరబ్రహ్మేశ్వరశాస్త్రి నారాయణకు అభయం ఇచ్చేశాడు. ”మరేం ఫరవాలేదు, నీ భూమి ఎక్కడికీ పోదు. టైటిల్ డిక్లరేషన్‌కి సూటుపడేద్దాం. దాంతో అటు గవర్నమెంటువాళ్ళూ ఇటు మాలవాళ్ళూ ఇద్దరూ అణిగిపోతారు. నీ భూమి నీకొస్తుంది,” అన్నాడు.
నారాయణ సరేనన్నాడు.
కోర్టులో దావా మూడున్నర సంవత్సరలు నడిచింది. నారాయణ ఓడిపోయాడు. తన కళ్ళముందే తన భూమి అన్యాక్రాంతమైపోయే పరిస్థితి దాపురించింది.
”ఏమన్నా, ఇంకో టీ ఇమ్మంటావా?” అన్నాడు రాముడు.
స్టౌమంటకేసి చూస్తూ కూర్చున్న నారాయణ నిట్టూర్పుతో లేచి నిలబడ్డాడు ”వద్దులే” అంటూ.
అక్కడ్నించి అతను తన వూరికి వెళ్ళలేదు. ఆ పూట భోజనం కూడా చేయలేదు. భోంచేయడానికి ఆకలిగా కూడా అనిపించలేదు.
సాయంకాలందాకా పిచ్చివాడిలా అటూఇటూ తిరిగి పరబ్రహ్మేశ్వరశాస్త్రి ఆఫీసుకు వెళ్ళాడు.
”రా రా, కూర్చో” అన్నాడు పరబ్రహ్మేశ్వర శాస్త్రి.
”అపీలు చేసుకుంటావా?” అడిగాడు చంద్రాయుడు.
నారాయణ బుర్రూపాడు.
”సరే, రేపు లెక్క తెచ్చీ, ముందు కాపీ స్టాంపులు పడేయాల. జడ్జిమెంటు కాపీ వచ్చినాక సబ్‌కోర్టులో అపీలు చేసుకోవాల,” అన్నాడు చండ్రాయుడు.
”అపీలుకెంతైతాది సామీ?” అడిగాడు నారాయణ.
”ఎంతవుతుంది, సూటుకెంతైందో దాదాపు అంతే అవుతుంది,” అన్నాడు పరబ్రహ్మేశ్వరశాస్త్రి.
నారాయణ గుండె గుభేల్మంది.
”అంతనా?” అన్నాడు నోరు తెరుచుకుని.
”అంతే మరి, కోర్టా మజాకా,” అన్నాడు పరబ్రహ్మేశ్వరశాస్త్రి.
నారాయణ మొహం వేలాడేసుకుని తన వూరు తిరిగొచ్చాడు.
వస్తూనే అతను నేరుగా తన ఇంటికి పోలేదు. కరణమయ్య ఇంటికి వెళ్ళాడు.
ఈ మూడు నాలుగేళ్ళలోనూ కరణమయ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఇది వరకు మాట్లాడగలిగేవాడు. ఇప్పుడదీలేదు. అతనికి అన్నీ మంచంమీదనే జరుగుతున్నాయి.
నారాయణ వెళ్ళే సమయానికి కరణమయ్య మంచందగ్గర ఎవరూ లేరు. నారాయణ తిన్నగా వెళ్ళి ఆ మంచం పక్కనే నేలమీద కూర్చున్నాడు.
”నీ పగ తీరినాది కరణమయ్యా! కోర్టు కూడా నువ్వు రాసిన దొంగ లెక్కే ఒప్పుకున్నాది. ఇంగ మాలోల్లు నా భూమి ఇగ్గుకుంటారు,” అన్నాడు.
కరణమయ్య కదల్లేదు. గాజు కళ్ళతో నారాయణకేసి చూస్తూన్నాడు.
”మీరంతా ఒకటే కరణమయ్యా. రెడ్డి కూడా యాపొద్దూ నాకాడ పన్ను తీసుకున్నాక రసీదు యిల్యా. ఒక పనికిమాలిన నోటు పుస్తకంలో రాసిస్తా వున్న్యాడు. ఆ రెడ్డీ సచ్చినాడు. ఇంక నువ్వు సస్తావ్,” కసిగా అన్నాడు నారాయణ.
కరణమయ్య గాజుకళ్ళతో ఇంకా చూస్తూనే వున్నాడు.
”ఎర్రిగోల్లోన్ని చేసి ఈ భూమ్మీద నాకింత అన్యాయం చేస్తే బగమంతుడు మాత్రం మిమ్ముల్ని చమిస్తాడా కరణమయ్యా? మీరంతా సక్కంగా నరకానికి పోతారు.”
నారాయణ గొంతులో క్రమంగా దుఃఖంగా చోటు చేసుకోసాగింది.
”నా భూమి నాక్కాకుండా చేస్తావా కరణమయ్యా? భూమి పోయినాక కూలిపన్జేసి నా బిడ్డల్ని సాక్కుంటా. కానీ నాకింత చేసినావు నీ బిడ్డలు మాత్తరం అడక్కదింటారు. చేతిలో చిప్పపట్టుకోని ఇంత ముద్ద కోసరం ఇల్లిల్లూ తిరిగేరోజు నీ పిల్లలకి వచ్చి తీర్తాది కరణమయ్యా! నా ఉసురు నీ పిల్లలకి తగుల్తాది,” నారాయణ గుండె దబదబా బాదుకున్నాడు. ”నా ఉసురు తగుల్తాది కరణమయ్యా, ఇంగా తగుల్తాది. ఇంగా తగుల్తాది. ”
అతని మంచం దగ్గర్నించి దిగ్గున లేచి పోబోతూ మళ్ళీ ఆగాడు. వెనక్కొచ్చాడు. కరణమయ్య మొహంలో మొహం పెట్టి చూశాడు.
”ఇప్పుడు నీ మంచం కాడ యెవులూ లేరు కరణమయ్యా! ఇప్పుడు నీ గొంతు పిసికి సంపినా నాకడ్డమోచ్చేటోల్లు ఎవులూ లేరు,” రెండు చేతులూ కరణమయ్య గొంతు దగ్గరికి తీసుకెళ్ళాడు.
కరణమయ్యలో మొదటిసారిగా కొంత చలనం కనిపించింది. ఎడం చెయ్యి ఎడంకాలు ఆడించడానికి ప్రయత్నిస్తూ గొంతులోంచి కీచుమనే శబ్దం మాత్రం తేగలుగుతున్నాడు.
నారాయణ అతని గొంతు దగ్గరగా పోనిచ్చినవాడల్లా మళ్ళీ చేతులు వెనక్కి తీసుకున్నాడు.
”ఛీ” అంటూ ముప్పావు వంతు నిర్జీవంగా వున్న ఆ మొహంకేసి అసహ్యంగా చూసి చరచరా అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
ఇంటికెళ్ళాక భార్యాబిడ్డల్ని దగ్గరికి తీసుకుని ఏడ్చాడు నారాయణ.
”ఉండే ఆధారం పాయ. ఇంగ మనం ఎవల్దగ్గర్నో కూలి చేసి బతకాల,” అంటూ బావురుమన్నాడు.
అతని భార్య అతనంత బేల కాదు.
”ఛా, వూర్కో! పిల్లలు బెదిరి పోయి సూస్తుండారు. మిందికోరటుకు దావా తీస్కెల్లాలని వకీలు సెప్పినాడంటివి గదా! మన భూమి యాటికీ పోదులే,” అని ధైర్యం చెప్పింది.
ఆమె ప్రోద్భలం మీదనే ఆ మర్నాడు నారాయణ మళ్ళీ టౌనుకు వెళ్ళి కాపీ స్టాంపులు పడేయించి వచ్చాడు.
అతన్లో ఇప్పుడేమాత్రం ఉత్సాహం లేదు. అపీల్లో కూడా తను గెలుస్తాడని నమ్మకం కుదరడం లేదు. దేవుడే తననింక రక్షించాలి.
ఇంట్లోంచి బయటికి రావడం కూడా అతను మానేశాడు.
అతని భార్య అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించి ప్రయత్నించి విఫలమై ఇక తన చేత కాదని వూరుకుండిపోయింది.
ఒక వారం రోజులు గడిచాయి.
నారాయణ ఇంట్లో మంచంమీద పడుకొని పైకప్పు కేసి చూస్తూ భూమి తన చేయి దాటిపోయాక ఏం చేయాలని ఎడతెగని ఆలోచనల్లో మునిగిపోయివున్నాడు.
అదే సమయంలో బయట్నించి ఒక పిలుపు వినిపించింది-
”నారాయణా!”
నారాయణ లేచి కూర్చున్నాడు.
”ఎవరు?”
”నేను రామిరెడ్డిని”
ఆ పేరు వింటూనే నారాయణలో బద్దకం వదిలిపోయింది. గబగబా బయటికి పరిగెత్తాడు.
”నువ్వా అన్నా! రా, లోపలికి రా,” అన్నాడు కంగారు కంగారుగా.
”ఏం లేదు, నీతో మాట్లాడేదుంది,” అన్నాడు రామిరెడ్డి.
”రాన్నా, లోపలికి రా,” అంటూ లోపలికి దారితీసాడు నారాయణ.
చెట్టంతమనిషి రామిరెడ్డి, ఎత్తుకు తగ్గ లావు. నారాయణ ఇంటి పొట్టి గుమ్మంలోంచి బాగా వంగి లోపలికొచ్చాడు.
నారాయణ నులకమంచం మీద దుప్పటి పరిచాడు.
”కూకోన్నా.”
రామిరెడ్డి హుందాగా కూర్చున్నాడు.
మంచం కీళ్ళు కరకరమన్నాయి.
నారాయణ అతని ఎదురుగా నేలమీద కూర్చున్నాడు.
”మరేం లేదు నారాయణా, నీ భూమి నాకమ్ముతావేమోనని వచ్చినా,” రామిరెడ్డి మాట్లాడుతుంటే గొంతు ఖణేల్ ఖణేల్‌మంటుంది.
నారాయణ తన చెవుల్ని తానే నమ్మలేక నోరు తెరిచేశాడు. రామిరెడ్డి నుంచి ఇలాంటి ప్రస్తావన వస్తుందని అతను కల్లోకూడా అనుకోలేదు.
”అది కాదన్నా…” అంటూ ఏదో చెప్పబోయాడు.
రామిరెడ్డి అతన్ని మాట్లాడనివ్వకుండా చెయ్యి అడ్డుపెట్టాడు.
”నువ్వేసిన దావా కొట్టేసినారు నాకు తెల్సు. అందుకే నేనొచ్చినా నారాయణా! ఆ భూమి నువ్వు నిలుపుకోలేవు. నువ్విస్తానంటే ఎకరా పదివేలకు నేను రాపిచ్చుకుంటా. ఏమంటావు?”
నారాయణకు వెంటనే నోటివెంట మాట వూడిపడలేదు. బుర్రగోక్కుంటూ వుండిపోయాడు.
”నాకు తెల్సు నారాయణా!” మళ్ళీ చెప్పనారంభించాడు రామిరెడ్డి.
”నీ భూమి ఎకరా పదైదు వేలు పలుకుతాది. పదివేలు ధర అగ్గువే. కానీ దావాలో ఇరుక్కోనిపోయిన భూమికి పదిరూపాయలు పెట్టయినా ఎవులు కొంటారు? నా మాటిని ఒప్పుకో, ఆ లెక్కతో ఇంగోచోట యాడైనా భూమి కొనుక్కో. నాకు మాత్రం ఈ నాలుగెకరాలు ఇచ్చేయి. నీ మంచికోరే చెప్తాండా.”
అది కాదన్నా…” మళ్ళీ బుర్రగోక్కున్నాడు నారాయణ.
”నాకు తెల్సులే నువ్వేందనాలనుకుంటాండావో! చెప్తా, యిను. నీ భూమి పక్కనే నా భూమి వుండాది. నీ భూమి కొంటే నా భూమి ఇంగా పెరుగుతాది. అవునా? అందుకే నీ భూమి కొందామనుకుంటాండా.”
కొద్ది క్షణాలు నిశ్శబ్దం.
”అసలు కారణం ఇంగోటుండాదిలే నారాయణా! సరే, అది గుడ్కా చెప్తా, యిను. నీ భూమి గవర్నమెంటోల్లకు బోతే ఆల్లు మాలోల్లకిస్తారు. ఇంతకాలం ఈ మాలనాకొడుకుల్ని ఊరవతల బరిస్తావస్తిమి. ఇప్పుడు నా భూమి పక్కకే వస్తానంటాండారు కొడుకులు. సూడు నారాయణా, నవ్వు గొల్లోనివి, నేను రెడ్డిని. ఉంటే ఈ భూమి మనమద్దనే ఉండాల. మద్దెన ఈ మాలనాకొడుకులెవరంట? ఈల్లకు మల్లా ఓట్లు! వాల్లు నా పక్కకు రానీకి లేదు. నేను రానివ్వను. ఇంక కోర్టు అంటావా? కోర్టంటే నాకేం భయంలేదు. కావాల్నంటే మండలాఫీసులో రికార్డులే తిరగరాపిస్తా. అదంతా నీకు తెల్వదులే. చెప్పుమరి భూమి నాకమ్ముతావా? ఎప్పుడో ఎల్లువొచ్చి ఈ వూరి మిందొచ్చి పడితే ఈ మాలనాకొడుకులందర్కీ మాయబ్బ కొట్టాలేపిచ్చుకోనిచ్చినాడు. అయ్యి బట్కోని ఇప్పుడాల్లు నామింద ఎగుర్లాడతాండారు. నువ్వుగిన భూమి నాకమ్మితే యెట్లా ఎల్లువొచ్చి యీల్లంతా పూర్వం పల్లెల్నొదిలేసి లేచినారో అట్టే మల్లా లేపిస్తా. నీ భూమి మాత్రం నాకు ఉద్దరగొద్దులే. ఎకరాకి పదివేలు ఇస్తానంటాండా. చెప్పు, న్యాయమైన మాటేనా?”
నారాయణ ఏదో అనడానికి మళ్ళీ నోరు తెరిచినాడు.
అప్పటికీ పెరట్లో వున్న అతని భార్య తలుపుచాటుకొచ్చి ఆ సంభాషణంతా వింటోంది. మొగుడు నోరు తెరుస్తూనే ఏం అనేస్తాడోనని గబగబా ఆమె వాళ్ళ ముందుకొచ్చేసింది.
”అన్నా, రామిరెడ్డన్నా! ఆ దేముడే మిమ్మల్ని మాకాడికి పంపినాడు. నా మొగునికి ఒకటంటే ఒకటి తెల్వదు. అట్నే తీస్కోన్నా. ఎకరా పదివేలకిచ్చేస్తాం,” అంది.
రామిరెడ్డి ఇంకేమనడానికీ నారాయణకు అవకాశం ఇవ్వలేదు.
”అదీ మాట, నీకంటే మీ ఇంటిదానికి తెలివి జాస్తిగా వుండాది. యాడున్నా బతికిపోతావు పో, ఇంకేమనాకు. ఎకరా పదివేలు. రేపే రిజిస్టరు చేయించుకుంటా. అగ్రిమెంటూ గిగ్రిమెంటూ యేమొద్దు. ఈ అడ్వాన్సు నీకాడుంచు,” అంటూ జేబులోంచి పదివేలరూపాయల కట్టలు రెండు తీసి నారాయణ చేతిలో వుంచేశాడు.
నారాయణ వెర్రివాడిలా ఆ కట్టల వంక చూస్తూండగా ఎలా వంగి లోపలికొచ్చాడో అలాగే వంగి గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయాడు రామిరెడ్డి.
ఆ రాత్రి నారాయణకు కలొచ్చింది.
కల్లో పెన్నానది పొంగింది. తమ ఊళ్ళోకి ఎల్లువొచ్చింది. ఆ ముంపులో తనూ హరిజనులూ కొట్టుకుపోతున్నారు. ఈరిగాడు గూడ తన పక్కనే కొట్టుకుపోతుండడం నారాయణకు స్పష్టంగా గుర్తు.
[author image=”https://kadapa.info/wp-content/uploads/2013/05/dada.jpg” ]
దాదాహయత్ ప్రసిద్ధ తెలుగు కథారచయిత, అనువాదకుడు, సమీక్షకుడు మరియు కవి. 1960 అక్టోబరు 10 న కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన వీరు ప్రస్తుతం అక్కడే న్యాయవాదిగా పనిచేస్తున్నారు. “మొదట్లో రాయించింది రచనా కుతూహలం – ఇప్పుడు రాయిస్తున్నది మనషి జీవితం” అనే దాదా హయత్ 1983లో ‘అహింస’ కథతో రచనావ్యాసంగం ప్రారంభించారు. ‘అహింస’ కథ ఇతరభాషల్లోకి కూడా అనువాదమైంది. సున్నితమైన భావవ్యక్తీకరణతో జీవితానుభవాలను కథలుగా మలచడంలో హయత్ సిద్ధహస్తుడు. ఇప్పటిదాకా 60 కథలు. 10 కవితలు, అనేక పుస్తక సమీక్షలు రాశారు. వీరి కథలు తెలుగులో వచ్చిన ప్రసిద్ధ కథాసంకలనాల్లో చోటుచేసుకున్నాయి – విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మసీదు పావురం, ఎల్లువ, ఏటిగట్టు చేపలు, సెగమంటలు వాటిలో కొన్ని.
[/author]