ఎర్రగుడిపాడు శాసనము

ఎర్రగుడిపాడు కమలాపురం తాలూకాలోని ఒక గ్రామము. ఈ శాసనం క్రీ.శ. 575 నాటికి చెందినది కావచ్చు.

మొదటివైపు

1. స్వస్తిశ్రీ ఎరిక

2. ల్ముత్తురాజుల్ల

3. కుణ్డికాళ్లు నివబుకా

4. ను ఇచ్చిన పన్నన

5. దుజయ రాజుల

6. ముత్తురాజులు నవ

7. ప్రియ ముత్తురాజులు

8. వల్లవ దుకరజులు ళక్షి

9. కాను ఇచ్చి పన్నస్స

రెండవైపు

10. కొట్టంబున పా

11. పాఱకు కుణ్డికాళ్లు

12. ళా ఇచ్చిన పన్నస

13. ఇరవది యాది నా

14. ల్కు మఱుంతుద్లునేల

ఇందు పాఱకు అను మాటలో శకటరేఫము, మఱున్తుద్లు అను మాటలో ఱ తో బాటు ë కూడ వాడబడెను.

ఈ శాసనంలో సమాప క్రియ లేకున్నను క్రియాజన్య విశేషణముతో గూడిన కర్మాంత వాక్యములు మూడు కలవు.శాసనము పూర్తిగా లభించుచున్నది కనుక కొంత పరిశీలింపదగియున్నది.

1.ఎరికల్ముత్తురాజుల్ల కుణ్డికాళ్ళు నివబుకాను ఇచ్చిన పన్నస-అనిమొదటి వాక్యము.ఈ వాక్యములో ‘నివబుకాను’ అను భాగమర్థమగుట లేదు. ‘నివంబుకాను’ ‘నెవంబుకాను’ అని దీనిని ప్రకటించిన పై జెప్పిన విద్వాంసులు కొంత సరిపెట్టిరి.ప్రస్తుతము మనకు వేఱర్థము తోచుటలేదు గనుక దానినట్లే యంగీకరింతము.’ ఎరికల్ముత్తురాజుల్ల’ అనునది ప్రథమాంతమో షష్ఠ్యంతమో తెలియదు. ‘కుణ్డికాళ్లు’ అనునది ప్రథమాంతమే. రాజుయొక్క కుణ్డికాళ్ళు(ఉద్యోగి) నివంబున(=రాజుగారిపేర?) పన్నస(భూమిదానము) ఇచ్చిన భూమి యిది అని ఆశాసనశిలయున్న పొలమును నిర్దేశించును. ఇట్లుకాక ఎరికల్ముత్తురాజుల్ల అనుదానికి ఎరికల్ముత్తు రాజు రాజ్యకాలమున అనివారు చెప్పిరి. అపుడు ‘నివంబున’ అనుదానికర్థము వేరుగ జెప్పవలెను.

చదవండి :  పౌరాణిక భౌగోళిక చారిత్రక ప్రాధాన్యాన్ని నింపుకొన్న ఒంటిమిట్ట

2.దుజయరాజుల ముత్తురాజులు, నవప్రియ ముత్తురాజులు, వల్లవదుక రాజులు అను ముగ్గురు సాక్షిగ ఇచ్చిన పన్నస (ఇది)-అని రెండో వాక్యము సమాప్తమయ్యెను. దుజయ(దుర్జయ) రాజుయొక్క (పుత్రుడగు) ముత్తురాజు ఒకసాక్షి ముత్తు రాజనునది యొకానొక రాజపదవి అంటిమి గనుక ఈయన పేరిందు లేదు. దుర్జయరాజు అనునది తండ్రిపేరు. ఈసాక్షిపేరు వ్రాయ లేదన్నమాట. రెండవ సాక్షి నవప్రియ ముత్తురాజులు. నవప్రియుడనే పేరుగల యొక రాజకుమారుడు. మూడవసాక్షి వల్లవదుక రాజులు.వల్లభుడ నునది మరల బిరుదనే తోస్తుంది. అయినను ఆ బిరుదుగల దుకరాజు (దుగరాజు)అని చెప్పవచ్చును.’క’,’గ’,లకు ‘తద’లకు ఆనాడంత భేదముండెదికాదు. తుగరాజు,దుజరాజు,దుగరాజు అనుపదాలు యువరాజను అర్థములో వాడిన తావులనేకముగలవు. ఈ విధముగ తండ్రి పేరుతో మాత్రమే ఒకసాక్షియు బిరుదు పేర్లతో మిగిలిన ఇద్దరు సాక్షులు జెప్పబడిరి.

3. కొట్టంబున పాఱకు కుణ్డికాళ్లుళా ఇచ్చిన పన్నస ఇరువదియాది నాల్కు మఱుంతుద్లునేల – అని మూడో వాక్యం పరిసమాప్తమయ్యెను.

ఇచట ‘కొట్టము’అనునది బోయకొట్టము వలె నొక దేశవిభాగమని చెప్పి ఆ విభాగములోని భూమిని దానము చేసిరని దీనిని ప్రకటించినవారు చెప్పిరి. కాని ‘కొట్టంబు’ అనునది రాజనగరమను చెప్పి అందుండు ఒక పాఱకు (బ్రహ్మణునికి) దానమొసగిరి యనుట బాగుండును.లేకున్నచో ప్రతిగ్రహీతయగు బ్రాహ్మణుని పేరుచెప్పలేదు,సరికదా ఆయన నివాస స్థలముకూడ చెప్పబడ కపోవును. ప్రతిగ్రహీతల నివాస స్థానములు సాధారణగా శాసనాల్లో చెప్పుట కలదు.అయితే యిచ్చినభూమిగల దేశ విభాగము నిర్దేశింపబడకుండుట లోపమగును కదా యనినచో యీ శాసనశిల యున్నదేశమే అదియగునని సరిపెట్టుకోవచ్చును. అట్లనేక శాసనాలు కలవు. బ్రాహ్మణుని నివాసమే కొట్టము. ఇరువదియాదినాల్కు-అనునది సంఖ్యావాచకము. ఇరువది (రెండుపదులు)అది(=మొదటగల)నాల్కు(=నాల్గు) అనగా 20…4 అని పూర్వము శాసనాల్లో ೨೦ ముందువేసి కొంతవ్యవధి వదలి ೪ అంకెను వేయువారు.అట్లే మిగిలిన అంకెలను కూడవ్రాయువారు.కనుక ఇరువది మొదటగల నాలుగు అని వ్రాయబడెను. దశ, శత, సహాస్రాది స్థానములను బాగుగ వాడుట అప్పటికింకా చేతకాదనిపిస్తుంది. పదులస్థానములో సున్నను మాని ೨ మాత్రమే వేసి దగ్గరలో ೪ నువ్రాయుట తెలిసిన తరు వాత ఇరువదినాలుగు అని ‘ఆది’ని వదలి వ్రాయుట నేర్చిరి. ఈ విధంగా మూడు వాక్యాలతో శాసనం పూర్తి అయినది. రాజును, దానము చేసిన రాజోద్యోగిని చెప్పుటకొక వాక్యము, సాక్షులను చెప్పుటకొక వాక్యము. ఏ వాక్యములోను సమాపక క్రియ లేదు. మూడు వాక్యములలోను ఇచ్చిన పన్నస అని క్రియాజన్య విశేషణముతోనే కర్మ నిర్దేశింపబడినది. అయినను పైజెప్పిన సందేహాలు ప్రతిగ్రహీత పేరులేకుండట, కొందరి సాక్షుల పేర్లు లేకుండుట, మున్నగు లోపములు కొన్ని శాసనంలో కలవు. రచనలో తప్పులు లేవనవచ్చును.

చదవండి :  కడప జిల్లా శాసనాలు 2

ఇవి కొత్తగా భాష నేర్చుకొనేవారి వాక్యములు. ప్రథమా విభక్తిలో ఏక వచన బహువచనములు. ‘పాఱకు’ ‘రాజుల్ల ‘ అనునవి కలవు. సప్తమిలో ‘కొట్టంబున’ అని యున్నది. ఇంతకుమించిన విభక్తి ప్రత్యయములు వాదబడ లేదు. అంటే వాక్యరచనను మెఱుగు పెట్టుటకై కారక విశేషము లంతగా వాడుట యింకా బాగుగ తెలియదనిపించును.

కమలాపురం తాలూకాలోదే యిందుకూరులోని శాసనమొకటి రచనలో కొంత మెఱుగనిపించును.

“స్వస్తిశ్రీ చోటిమహారాజుల్లేళన్ ఎరిగల్ దుగరాజుల్ ఇచ్చిన పన్నస కొచ్చియ పాఱ రేవలమ్మాన్ కారికిన్”.

చదవండి :  కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

అనిఒకే వాక్యములో వక్తవ్యాంసమును పూర్తిచేసెను. అయితే దీంట్లో సాక్షులు లేరు. దానమిచ్చిన భూపరిమితి లేదు. కాని

“తేనిఱచ్చిన వాన్డు(ఇచ్చట డ వత్తును θ గా చదవాలి)వఞచ మహాపాతక సంయుక్తున్డుగు (ఇచ్చట డ వత్తును θగా చదవాలి) . అసివైరువులిఖితం” అని యీ ధర్మమును చేఱిచిన వానికి పాపఫలము. వ్రాసిన వానిపేరు అసివైరువు అని విడిగా రెండు వాక్యాలలో చెప్పబడెను. మొదటి వాక్యములో దాత, ప్రతిగ్రహీతల పేర్లు చెప్పబడినవి. బ్రాహ్మాణుని గోత్రముకూద ‘కొచ్చియ'(కౌశిక) అని చెప్పబడింది.

జి. పరబ్రహ్మశాస్త్రి

(ఆం.ప్ర సాహిత్య అకాడెమీ వారి ప్రచురణ, తెలుగు శాసనాలు  (1975))

ఇదీ చదవండి!

బుడ్డాయపల్లె శాసనము

బుడ్డాయపల్లె శాసనము

బుడ్డాయపల్లె కడప తాలూకాలోని చెన్నూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరికి ఒక మైలు దూరంలో, పొలాలలో విరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: