అసమానతలు

ప్రాంతాల మధ్య కాదు, ప్రాంతాలలోనే అసమానతలు

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని “వెనుకబడిన” ఏడు జిల్లాల అభివృద్ధి కోసం ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ప్రకటించింది. ఆ ఏడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. వాస్తవానికి ఆ ఏడు జిల్లాలూ అభివృద్ధి విషయంలో ఒకేలా లేవు. ఈ జిల్లాల మధ్య వివిధ రంగాల్లో అభివృద్ధిలో ఎంత అంతరముందో ప్రభుత్వ గణాంకాల ద్వారానే పరిశీలిద్దాం.

వ్యవసాయ రంగం:

1. వ్యవసాయ ఉత్పాదకత: చిత్తూరు జిల్లాలో హెక్టారుకు 23,500 రూపాయలుండగా కడప జిల్లాలో 12,900/-, కర్నూలు జిల్లాలో 15,800/-, అనంతపురం జిల్లాలో 9,100/- మాత్రమే! (మూలం: శ్రీకృష్ణ కమిటీ నివేదిక). ఇది విశాఖపట్నంలో 23,600, శ్రీకాకుళంలో 22,300, విజయనగరంలో 20,700.

2. వర్షపాతం: రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల సగటు వార్షిక వర్షపాతాలు వరుసగా 553, 636, 747 మి.మీ. ఐతే చిత్తూరు జిల్లాలో అది రాష్ట్ర సగటుతో దాదాపు సమానంగా 934 మి.మీ. ఉంది.

ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వార్షిక సగటు వర్షపాతం వరుసగా 1202, 1131, 1067 మి.మీ.

ఒక ప్రాంతాన్ని అధికారికంగా కరువు ప్రాంతంగా ప్రకటించాలంటే ఆ సంవత్సరంలో అక్కడి సగటు వర్షపాతం కంటే ఎంత శాతం తక్కువ వాన పడిందన్నది ఒక ముఖ్యమైన కారకం (src: https://kadapa.info/downloads/gos/drought/). ఆ లెక్క ప్రకారం విశాఖపట్నం జిల్లాలలో 901 మి.మీ. వాన పడినా, చిత్తూరు జిల్లాలో 746 మీ.మీ వాన పడినా అది కరవు జిల్లాగా ప్రభుత్వసాయం అందుకోవడానికి అర్హత పొందుతుంది కడప, కర్నూలు అనంతపురం జిల్లాలలో 471 మీ.మీ వర్షపాతం నమోదైనా అది కరువు కానట్లే, ఈ జిల్లాలకు ప్రభుత్వ సాయం పొందే అర్హత ఉండదు.

చదవండి :  వైఎస్ అంతిమ క్షణాలు...

3. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి (మూలం: AP Socioeconomic Survey)

3.a. పాల ఉత్పత్తిలో కడప 318.66 వేల టన్నులతో రాష్ట్రంలో అట్టడుగున (తర్వాతి మూడు స్థానాల్లో విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం) ఉండగా, చిత్తూరు 948 వేల టన్నులతో రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో ఉంది.
3.b. మాంసం ఉత్పత్తిలో 13.73, 18.98 వేల టన్నులతో శ్రీకాకుళం, కడప జిల్లాలు అట్టడుగున ఉండగా చిత్తూరు 65.12 వేల టన్నులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది!

3.c. కోడిగుడ్ల ఉత్పత్తిలో శ్రీకాకుళం, కర్నూలు, కడప జిల్లాలు వరుసగా 1240.21, 1249.94, 1387.31 లక్షల గుడ్లతో రాష్ట్రంలోని చివరి మూడుస్థానాల్లో ఉండగా చిత్తూరు జిల్లా అంతకు పదింతలు ఎక్కువగా 15,377.14 లక్షలు ఉంది.

4. పట్టుదారం:
రాష్ట్ర ఉత్పత్తి (70914.85 మీటర్లు) లో దాదాపు 93 శాతం రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచే (33608.18 & 32372.49 మీటర్లు) వస్తోంది! ఉపాధిలో సైతం రాష్ట్రం మొత్తమ్మీద 70812 ఉత్పత్తిదారులుండగా ఈ రెండు జిల్లాల్లోనే అనంతపురంలో 33551 మంది, చిత్తూరులో 32328 మంది ఉన్నారు.

పారిశ్రామిక రంగం:

భారీ/మధ్యతరహా పరిశ్రమల సంఖ్యను బట్టి చూస్తే చిత్తూరు జిల్లాలో ఒక్క శ్రీసిటీ సెజ్ లోనే 106 భారీ పరిశ్రమలు పనిచేస్తుండగా మొన్న ఏప్రిల్ మూడో తేదీన పెప్సితో సహా 11 పరిశ్రమలకు ప్రారంభోత్సవం, ఇంకో 11 పరిశ్రమలకు భూమిపూజ జరిగింది. సెజ్ వెలుపల పాత గణాంకాలను బట్టి చూసినా 102 భారీ, మధ్యతరహా పరిశ్రమలుండగా పొరుగునే ఉన్న కడప జిల్లాలో వాటి సంఖ్య 11 మాత్రమే. ఇవి కాక చిత్తూరు జిల్లా ఏర్పేడులో కొత్తగా ఏర్పాటౌతున్న NIMZ లో 30.000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు రానున్నాయి.

(పరిశ్రమల సంఖ్యను బట్టి కాక ఉత్పాదక విలువను బట్టి చూస్తే A.P. Socioeconomic Survey 2014-15 ప్రకారం మొత్తం రాష్ట్రంలో పారిశ్రామికోత్పత్తి 96563 కోట్లు కాగా ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 19811 కోట్లు. అంటే మొత్తం రాష్ట్రంలోని పారిశ్రామికోత్పత్తిలో దాదాపు ఐదో వంతు విశాఖపట్నం జిల్లాలోనే జరుగుతోంది! అది వెనుకబడిన జిల్లా ఎలా ఔతుందో ప్రభుత్వాలకే తెలియాలి.)

చదవండి :  ఆ రోజుల్లో రారా..

సేవారంగం:

ముంజేతి కంకణానికి అద్దమేలా అన్నట్లు తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, తలకోన మొదలైన దర్శనీయ స్థలాల మూలంగా పర్యాటక రంగంలో రాష్ట్రంలో అత్యధికాదాయాన్ని గడిస్తున్న జిల్లా కూడా చిత్తూరే. అంతేగాక ఉన్నత విద్యలో చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 8 విశ్వవిద్యాలయాలుండగా ఇంకో నాలుగు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను తిరుపతిలోనే ఏర్పాటు చెయ్యడం ద్వారా ఆధ్యాత్మిక/పర్యాటక కేంద్రంగా ఉన్న తిరుపతినే విద్యాకేంద్రంగానూ, పారిశ్రామిక కేంద్రంగానూ, ఐటీ కేంద్రంగానూ అభివృద్ధిచెయ్యజూడడం ఏరకంగా సమన్యాయమో అర్థం కావడం లేదు. తిరుపతిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేసి, రాయలసీమలోని ఇతర జిల్లాల్లో ఒక జిల్లాను విద్యా కేంద్రంగానూ, ఇంకొక జిల్లాను పారిశ్రామిక కేంద్రంగానూ, వేరొక జిల్లాను ఐటీ/సేవారంగ కేంద్రంగానూ అభివృద్ధి చెయ్యొచ్చు కదా? I always see the excessive concentration of development at one place as the deprivation of the same in other places.

స్థూలస్థానిక ఉత్పత్తి

పై సమాచారాన్నంతా క్రోడీకరిస్తే జిల్లాలవారీగా స్థూలస్థానిక ఉత్పత్తి ఇలా ఉంది (మూలం: A.P. Socioeconomic Survey 2014-15):

స్థిరధరల ప్రకారం: రాయలసీమలో చిత్తూరు (16144), అనంతపురం (16563) జిల్లాల స్థూల ఉత్పత్తి కడప (12057), కర్నూలు (14569) జిల్లాలేకాక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు (14774), ప్రకాశం (16507) కంటే కూడా ఎక్కువ. ఉత్తరకోస్తాలో శ్రీకాకుళం (9144), విజయనగరం (8780), విశాఖ (33524).

ప్రస్తుత ధరల ప్రకారం: ఇక్కడ కూడా చిత్తూరు (30593), అనంతపురం (29133) జిల్లాల స్థూల ఉత్పత్తి కడప (21440), కర్నూలు (25963), నెల్లూరు (25569) జిల్లాల కంటే ఎక్కువ. ఉత్తరకోస్తాలో విజయనగరం (15858), శ్రీకాకుళం (16050), విశాఖ (56668).

చదవండి :  చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

గమనించవలసిన ఇంకో విషయమేమిటంటే ఈ రెండు పద్ధతుల్లో కూడా రాష్ట్రం మొత్తమ్మీద అగ్రస్థానంలో ఉన్న జిల్లా విశాఖపట్నం! కానీ కేవలం ఉత్తరకోస్తాలో ఉందన్న ఒకేఒక్క కారణం వల్ల అది కూడా “వెనుకబడిన జిల్లా”గా మారి కేంద్రసాయానికి అర్హత పొందింది.

ఇలా అభివృద్ధిలో అంతరాలున్నప్పుడు ఆ అంతరాలను వీలైనంతవరకు తగ్గించడం (అంటే ఇప్పటికే అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న జిల్లాలను వదిలేసి వెనుకబడిన జిల్లాలకు మాత్రం ప్రోత్సాహకాలు ఇవ్వడం) ఉత్తమమైన పద్ధతి. అలా కాకుండా మధ్యేమార్గంగా రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన జిల్లాలకూ వాటి వెనుకబాటు స్థాయిని బట్టి సాపేక్ష నిష్పత్తిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇంకో పద్ధతి. తద్వారా జిల్లాల మధ్య అభివృద్ది స్థాయిలో ఉండే అంతరాల్ని తగ్గించడానికి వీలౌతుంది.

ఇవి రెండూ కాకుండా అభివృద్ధిలో మిగతా జిల్లాలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్న (చిత్తూరు, విశాఖపట్నం) జిల్లాలు కేవలం వెనుకబడిన “ప్రాంతాల్లో” ఉన్న కారణంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను అనుభవించడం ఏరకంగా “సమన్యాయం”? చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల బదులు ఆ సొమ్మేదో పూర్తిగా వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, కడప లాంటి జిల్లాల అభివృద్ధికే ఖర్చుచెయ్యడం న్యాయం కాదా?

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

జిల్లా కేంద్రంగా కడప

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: