సోమవారం , 16 సెప్టెంబర్ 2024
అమీన్‌పీర్ దర్గా

కడప దర్గా – అమీన్‌పీర్ దర్గా

కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా లేదా పెద్ద దర్గా లేదా కడప దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’గా పేరుగాంచిన ఈ దర్గాను నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కడప దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుంటారు. అనంతరం అదే ప్రాంగణంలోని హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ మజార్‌తోపాటు ఆ వంశానికి చెందిన ఇతర గురువులందరి మజార్లను దర్శించుకుంటారు. సంపూర్ణ భక్తివిశ్వాసాలతో పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తుంటారు.

దర్గా వెనుక కథ :

16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ తన సతీమణి, ఇరువురు కుమారులు (హజరత్ ఆరీఫుల్లా హుసేనీ, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్), ఫకీర్లు, ఖలీఫాలతో కలిసి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో సిద్ధవటం నవాబైన నేక్‌నామాఖాన్ ఈ గురువుల మహిమల గురించి విని స్వయంగా దర్శించుకుని ప్రియ భక్తునిగా మారారు. గురువుల సన్నిధిలో స్థానం లభించిన తర్వాత ఆయనకు ప్రతి విషయంలోనూ విజయాలే లభించాయి. దీంతో ఆయన కోరికపై గురువులు ఈ ప్రాంతంలోనే ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ స్థిరపడ్డారు.

జీవ సమాధి

ఆధ్యాత్మిక బోధనలతోపాటు హజరత్ పీరుల్లా మాలిక్ ఎన్నో మహిమలు చూపేవారు. దాంతో భక్తుల సంఖ్య నానాటికీ పెరగడంతో గిట్టనివారు ఇంకా గొప్ప మహిమలు చూపాలంటూ కోరారు. సజీవంగా సమాధి కావాలని, మూడవరోజు మజార్ నుంచి బయటికి వచ్చి కనిపించాలని సవాలు విసిరారు. దాన్ని ఆయన చిరునవ్వుతో స్వీకరించి మొహర్రం 10వ రోజు (షహదత్) తన పెద్దకుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీకి బాధ్యతలు అప్పగించి వందలాది మంది భక్తుల సమక్షంలో నేలను చీలమని ఆదేశించి సజీవ సమాధి అయ్యారు. మూడవరోజు ఆయన మజార్‌కు ఓవైపున నమాజు చేస్తూ కనిపించడంతో అందరూ ఆ అద్భుతాన్ని తిలకించి ఆనంద పరవశులయ్యారు. గిట్టనివారు సైతం ఆయన శిష్యులుగా మారారు. అనంతరం దర్గా ఆయన పెద్ద కుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ నిర్వహణలో సాగింది. చిన్న కుమారుడు హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్ నందలూరు కేంద్రంగా బోధనలు సాగించారు.

చదవండి :  కడపలో చిరంజీవి మేనల్లుడు

సయ్యద్‌షా పీరుల్లా మాలిక్

దర్గా వ్యవస్థాపకులు హజరత్ సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ అయినా ఇక్కడ జరిగే పెద్ద ఉరుసు మాత్రం ఆరీఫుల్లా హుసేనీ పేరిటే జరుగుతుంది. ఈయన 40 సంవత్సరాలపాటు తాడిపత్రి అడవుల్లో, తర్వాత కడప ప్రాంతంలోని శేషాచల అడవుల్లో (వాటర్ గండి ప్రాంతంలో) 23 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. ఆయన తపశ్శక్తికి ప్రతీకగానే దర్గాలోని ఆయన మజార్ మిగతా అన్నిటికంటే ఎత్తుగా ఏర్పాటు చేశారు. దర్గాకు వచ్చే భక్తులు ప్రధాన గురువులైన హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్‌ను దర్శించుకున్న అనంతరం హజరత్ ఆరీఫుల్లాహుసేనీ సాహెబ్ దర్గాను కూడా దర్శించుకుంటారు.

సేవా-ప్రజ్ఞల ప్రతిరూపం

ప్రస్తుత పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ బాల్యంలో సకల మతగ్రంథాలను అధ్యయనం చేశారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా దర్గా కేంద్రంగా అమీన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. తమ ఖర్చులతోనే పేద వర్గాలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. దర్గా శిష్యులందరికీ అక్కడే లంగర్ ద్వారా మూడు పూటల భోజనం, వసతి కల్పిస్తున్నారు. ప్రతివారం వందలాది మంది రోగులకు ఉచితంగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. జోధా అక్బర్ సినిమాలో ‘ఖ్వాజా-రే-ఖ్వాజా’ పాటను వినే ఉంటారు కదూ! దీన్ని రాసింది ఏ సినిమా రచయితో అనుకుంటున్నారా? అదేం కాదు.. ఖాసిఫ్ కలం పేరుతో కడప పెద్దదర్గా ప్రస్తుత పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆ పాటను రచించారు. ఆ పాట సూపర్‌హిట్ అయి భారతదేశాన్ని ఉర్రూతలూగించింది. ‘అల్ రిసాలా’ హిందీ సినిమాలో కూడా ఆయన ‘మర్‌హబా…యా ముస్తఫా…’ గీతాన్ని రాశారు. అదికూడా పెద్ద విజయం సాధించింది. ఎవరి నుంచి ఎలాంటి చందాలు స్వీకరించని వీరు… గీత రచన వంటి వాటిపై వచ్చే ఆదాయంతోనే సువిశాలమైన దర్గా సంస్థానాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు.

చదవండి :  వైభవంగా గంధోత్సవం - తరలివచ్చిన సినీ ప్రముఖులు

ప్రత్యేకత :

ఈ దర్గాను మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొంటారు. ఇక్కడ జరిగే ఉరుసు ఉత్సవాలకు దాదాపు సగం మంది ముస్లిమేతరులు హాజరవుతారు. ప్రతిరోజు దర్గాను దర్శించుకునే భక్తుల్లో 30 శాతం మంది ముస్లిమేతరులు ఉంటారు.

అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన ప్రముఖులు:

  • స్వర్గీయ ఇందిరాగాంధీ – భారత ప్రధానమంత్రి
  • స్వర్గీయ పి.వి.నరసింహారావు – భారత ప్రధానమంత్రి
  • స్వర్గీయ నీలం సంజీవరెడ్డి – భారత రాష్ట్రపతి
  • స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
  • నల్లారి కిరణ్కుమార్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
  • నారా చంద్రబాబు నాయుడు – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
  • వైఎస్ జగన్ – విపక్షనేత, ఆం.ప్ర మరియు వైకాపా అధినేత
  • గంటా శ్రీనివాసరావు – రాష్ట్ర మంత్రి, ఆం.ప్ర
  • నారా లోకేష్ – రాష్ట్ర మంత్రి, ఆం.ప్ర
  • మొహమ్మద్ రఫీ – గాయకుడు, బాలీవుడ్
  • సుశీల్ కుమార్ షిండే –  ఆం.ప్ర గవర్నర్
  • ఏ ఆర్ రెహమాన్ – ప్రఖ్యాత సంగీత దర్శకులు
  • ఐశ్వర్య రాయ్ – ప్రఖ్యాత హీరోయిన్
  • అమితాబ్ బచ్చన్ – బాలీవుడ్ హీరో
  • అభిషేక్ బచ్చన్ – బాలీవుడ్ హీరో
  • జయా బచ్చన్ – బాలీవుడ్ హీరోయిన్
  • అమీర్ ఖాన్ – బాలీవుడ్ హీరో
  • అక్షయ్ కుమార్ – బాలీవుడ్ హీరో
  • ఆదిత్యారాయ్‌ – బాలీవుడ్ హీరో
  • చిరంజీవి – టాలీవుడ్ హీరో
  • సూర్య – కోలీవుడ్ హీరో
  • స్నేహ – కోలీవుడ్ హీరోయిన్
  • నందమూరి బాలకృష్ణ – టాలీవుడ్ హీరో
  • నితిన్ – టాలీవుడ్ హీరో
  • రాంచరణ్ తేజ్ – టాలీవుడ్ హీరో
  • అల్లు అర్జున్ – టాలీవుడ్ హీరో
  • కళ్యాణ్ రాం – టాలీవుడ్ హీరో
  • నాని – టాలీవుడ్ హీరో
  • నవదీప్ – టాలీవుడ్ హీరో
  • అల్లరి నరేష్ – టాలీవుడ్ హీరో
  • కరణం మల్లీశ్వరి – క్రీడాకారిణి
చదవండి :  కడప నగరం

దర్గా టైమింగ్స్ :

ప్రతి రోజూ:

ఉదయం : 5-30 AM నుండి 10 AM వరకు

సాయంత్రం : 5-00 PM to 10-00 PM వరకు

పైన పేర్కొన్న సమయానికి అదనంగా శుక్రవారం మధ్యాహ్నం 12-30 PM నుండి 3-00 PM వరకు

‘అమీన్‌పీర్ దర్గా’కు ఎలా వెళ్ళాలి?

వాయు మార్గంలో:

దగ్గరి విమానాశ్రయం: కడప (11 కి.మీ), తిరుపతి (138 కి.మీ), బెంగుళూరు (260 కి.మీ), చెన్నై (275 కి.మీ),  హైదరాబాదు (400 కి.మీ)

రైలు మార్గంలో:

దగ్గరి రైల్వేస్టేషన్: కడప (5 కి.మీ)

రోడ్డు మార్గంలో:

దగ్గరి బస్ స్టేషన్: కడప (4 కి.మీ)

ప్రయివేటు వాహనాలలో:

బెంగుళూరు వైపు నుండి : చింతామణి, మదనపల్లి, రాయచోటి, గువ్వలచెరువు మీదుగా

చెన్నై వైపు నుండి : తిరువళ్ళూరు, ఊత్తుకోట, పుత్తూరు, రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా

హైదరాబాదు వైపు నుండి : జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, మైదుకూరు మీదుగా

విజయవాడ వైపు నుండి : గుంటూరు, ఒంగోలు, కావలి, ఉదయగిరి, బద్వేలు మీదుగా

 

– పంతుల పవన్‌కుమార్

ఇదీ చదవండి!

AR Rahaman

ఏఆర్‌ రెహమాన్‌ కడపకొచ్చినాడు

కడప: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ గురువారం కడపకు వచ్చాడు. దర్శించుకున్నారు. నగరంలోని అమీన్‌పీర్‌ దర్గా (పెద్ద దర్గా)లో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: