కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలోని ఆది మానవుల శిలా రేఖా చిత్రాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం. తొలిసారిగా ఇర్విన్ న్యూ మేయర్ అనే ఆస్ట్రియా దేశస్థుడు ” లైన్స్ ఆన్ స్టోన్ – ది ప్రి హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా“ అనే పుస్తకంలో చింతకుంట రేఖా చిత్రాల గురించి సచిత్రంగా, సవివరంగా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొదటి పెద్దదైన, ప్రముఖమైన మిసోలిథిక్ కాలానికి (బిసి 8000-1500) చెందిన రేఖా చిత్రాల స్థావరంగా చింతకుంటను 1981లో గుర్తించారు. 1993లో దీనిపై పుస్తకాన్ని ప్రచురించారు.
యూరపులోని రాతికళ ఆవిష్కరణకు ముందే భారతదేశంలో చరిత్ర పూర్వ శిలా చిత్ర లేఖనాల ఆవిష్కరణ జరిగింది. ఎప్పుడో 1867-68లోనే చరిత్ర పూర్వ కళగా భారతదేశంలో రాతి మీద చిత్రించిన చిత్రాలను గుర్తించారని ఎర్విక్ పేర్కొన్నారు. 1957లో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ” భింభేత్కా”లో శిలా చిత్రలేఖనంగల స్థావరాల సముదాయాన్ని ఆవిష్క రించారు. భారతదేశంలో దాదాపు వంద శిలా చిత్రలేఖన ప్రాంతాలున్నాయి.
కర్ణాటకలో ఇలాంటి రాతి కళాస్థలాలు దాదాపు 60 ఉన్నాయి. కేరళలో 3, తమిళనాడులో 25, ఆంధ్రప్రదేశ్‌లో 28 ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇవి 12 జిల్లాలలో వ్యాపించి ఉన్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మహబూబ్‌నగర్, ప్రకాశం, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్నాయి. కడప జిల్లాలో చింతకుంటతోపాటు దొప్పల్లెలో కూడా శిలారేఖా చిత్రాలున్నాయి. అయితే దొప్పల్లె మైలవరం జలాశయంలో మునిగిపోయింది.
ఈ రాతి కళలు క్రీ.పూ. 25000నుండి 5000 కాలానికి చెందినవని ఇర్విన్ పేర్కొన్నారు. ఆది మానవ్ఞడు ఆకులు, పసర్లతోనో, రాళ్ల పొడితోనో రాళ్ల మీద వేసిన బొమ్మలను చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగక మానవ్ఞ. వేలాది సంవత్సరాలు గడిచినా వాళ్లు వేసిన చిత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయంటే వారి అపరిమిత ప్రతిభ ఏమిటో మనకు తెలుస్తున్నది.
మన రాష్టంలో మధ్య శిలాయుగం (మిసోలిథిక్) నాటి రాతి కళాస్థావరాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్య శిలాయుగంలోని చిత్రాల్లో జింకల చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. కడపజిల్లా ముద్దనూరు మండలంలోని చింతకుంటలోనే అన్ని రకాల శైలులు, శైలీ వైవిధ్యమున్నదని ఇర్విన్ అంటారు.
“Only at the site of chintakunta in the cuddapah district of Andhra Pradesh are all the South Indian Rock-Art Styles and stylistic variations available” – అని ఇర్విన్ గ్రంథంలో పేర్కొన్నారు.
చింతకుంటలో మధ్య శిలాయుగానికి చెందిన శిలాశ్రయాలు నేలకు 3 నుంచి 5 మీటర్ల ఎత్తులోనే ఉన్నాయి. అందులో జింకల బొమ్మలున్నాయి. అలాగే మానవాకృతి చిత్రాలున్నాయి. వాటికి శిరోవేష్టనం ఉంది. రేఖలు చెదిరి శరీరభాగం మీద అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఇవి ఆరాధనా ప్రతీకలయి ఉంటాయి. మధ్య శిలాయుగంతోపాటు నవీన శిలాయుగ శిలా చిత్ర లేఖనాలు చింతకుంటలో ఉండటం చాలా అరుదైన విషయం. అంతేకాక చారిత్రక దశలోనే శిలా చిత్రలేఖనం కూడా ఉండటం ఇంకా గొప్ప విషయం.
ఇక్కడి చిత్రాల్లో పునరుత్పత్తి అవయవాల్ని కూడా చక్కగా చిత్రించారు తొలిమానవులు. మరో గమనించాల్సిన విషయం ఏమిటంటే విల్లంబులు కలిగి ఉన్న మానవాకృతులు మూపురం ఎద్దుల పక్కనే వ్ఞండటం. శిలల మీద గంట్లు, గీట్లు పెట్టినట్లు చెక్కడాలు కూడా మూపురం ఎద్దులకే ఎక్కువగా వున్నవి. ఈ మూపురం ఎద్దులకు శైలీపరమైన పోలికలున్న శిలా చిత్రలేఖనాలు కర్ణాటకలోగాని, మధ్య భారతదేశంలోగానీ లేవు . ఎద్దులకు ఉన్న ఆకర్షణ ఇంతాఅంతా కాదు.
చింతకుంటలోని శిలాశ్రయాలు ఎర్రమల కొండల్లో వున్నాయి. అవి ఎత్తు తక్కువ. చదును ఉపరితల విస్తీర్ణంతో వున్నాయి. మొత్తం పదిహేను శిలాశ్రయాలున్నాయి. వీటిలో పదింటిలో చిత్రాలు బాగున్నాయి.
Nice information on the age old caves and arts. Please keep up the good work.