1400 – జిల్లాలోని ప్రైవేటు వ్యక్తుల దగ్గరున్న తుపాకులు
ప్రాణాపాయం, ఆత్మరక్షణ కోసమని జిల్లాలోని చోటా మోటా నాయకులు, పలువురు వ్యక్తులు అధికారిక లెక్కల ప్రకారం 1400 తుపాకులు కలిగి ఉన్నారు. ఇందులో 77 తుపాకులు బ్యాం కులకు భద్రత కల్పిస్తున్న సిబ్బంది కలిగి ఉన్నారు. వీటిని మొత్తం సంఖ్య నుండి మినహాయిస్తే 1323 తుపాకులు అనధికార వ్యక్తులు అధికారికంగా (లైసెన్స్) కలిగి ఉన్నారు.
వీటిలో అధిక భాగం రాజకీయాలతో సంబంధం కలిగిన వ్యక్తుల చేతిలో ఉండడం పోలీసు వర్గాలకు సైతం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఆయా గ్రామాలలో తలెత్తే కొట్లాటలలో వీరు తుపాకులను ఉపయోగించే ప్రమాదముందని అంచనాకొచ్చిన పోలీసు శాఖ జిల్లా ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా ఆదేశాలననుసరించి ఈ అధికారిక తుపాకులను అనధికార వ్యక్తుల నుంచి వెనక్కు తీసుకుంది.
ప్రచారం ముగిసిన తర్వాత, ఎన్నికలకు ముందు స్థానికేతరులు ఎవరూ పంచాయతీ పరిధిలో ఉండకూడదు. ఆయా పంచాయతీ ఓటర్లు, స్థానికులు మాత్రమే గ్రామాల్లో ఉండాలి. స్థానికులు కాని నేతలు, ప్రముఖులు స్వగ్రామాలకు వెళ్ళిపోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
– మనీష్ కుమార్ సిన్హా, జిల్లా ఎస్పీ
మొత్తం మీద అధికార కాంగ్రెస్ అనుకూలురైన నాయకులు లేదా వ్యక్తుల అధికంగా లైసెన్స్డ్ తుపాకులను కలిగి ఉన్నట్లు జిల్లా పోలీసుల వద్దనున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి కాకుండా అక్కడక్కడా అనదికరక తుపాకులు లేదా తపంచాలు ఉండే అవకాశాన్ని పోలీసులు సైతం తోసిపుచ్చడం లేదు. అంతేకాక ఇటీవల చోటుచేసుకొన్న అంబకం పల్లె ఘటన పోలీసులు జాగురూకతతో పాటు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
ఈ నేపధ్యంలోనే వారు నిరంతరం సమస్యాత్మక గ్రామాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1208 కేసులకు సంబంధించి 13వేల మందిని బైండోవర్ చేశారు. అలాగే మద్యం, డబ్బు పంపిణీ నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 19 చెక్‌పోస్టు లు ఏర్పాటు చేశారు. ఇటీవల చిన్నమండెం చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీలో వేలూరుకు చెందిన దొంగల ముఠా పట్టుబడడం విశేషం. వేలూరులో దొంగతనం చేసి నలుగురు ఇన్నోవా కారులో వస్తుండగా, తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ అనంతరం వీరిని వేలూరు పోలీసులకు అప్పగించారు.
మొత్తం మీద ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా పోలీసులు భారీ కసరత్తే చేస్తున్నారు. ఏదిఏమైనా జిల్లాలో మూడు దశ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయగలమని జిల్లా పోలీసు సూపరిండెంట్ మనీష్ కుమార్ సిన్హా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే ముందస్తు అరెస్టులూ, మితిమీరిన పోలీసు పహారా ఓటరును ఎన్నికల కేంద్రాలకు దూరం చెయ్యకుండా చూడాల్సిన భాద్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.