మానందిరెడ్డి లేదా మహానందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతని మంచి ఎందరికో మేలు చేసింది. అది కొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతని ధీనగాధను తలుచుకుని జానపదులు ఇలా విలపిస్తున్నారు…
వర్గం: భిక్షకుల పాట
ఈ పాటకు అనువైన తాళం : సావేరి స్వరాలు – చావు తాళం
పచ్చశత్రీ సేతబట్టీ…
కిర్రు సెప్పూలేసుకోని
కట్ట మీదా పోతావుంటేరో…
నా కొడకా మానందీరెడ్డీ
నువ్వు కలకటేరనుకొంటిరో…
మల్లు పంచా కట్టుకోనీ
నల్లకోటు ఏసుకోని
సందు ఎంటా పోతావుంటేరో…
నా కొడకా మానందీరెడ్డి
రాజా మానందీరెడ్డీ
నువ్వు సందమామనుకొంటిరో…
నున్నంగ తలదువ్వి
నూగాయ జడఏసి
పడమటీధిన పోతావుంటేరో…
నా కొడకా మానందీరెడ్డి
రాజా మానందీరెడ్డీ
నువ్వు పాలేగాడనుకొంటిరో…
పచ్చీ పసుపుకొమ్మా వంటీది నీ భార్య
నీ మాటలనుకోని శానా దుఃఖమూరో…
నా కొడకా మానందీరెడ్డి
అయ్యా మానందీరెడ్డీ
నువ్వు పాలేగాడనుకొంటిరో…
తండ్రీ సావూ నీకు
తనవూ తప్పకుండా
నీకు వలెనూ కొడకా
నేతాలలేనూరో
నా కొడకా మానందీరెడ్డి
రాజా మానందీరెడ్డీ
నువ్వు పాలేగాడనుకొంటిరో…
వచ్చీపోయే దావాలోనా
దానిమ్మా సెట్టుకింద
ఎండికుచ్చే నేలబడితీరో
నా కొడకా మానందీరెడ్డి
ఏటూకే తెగనరికీరో
పాటను సేకరించిన వారు : కీ.శే. కలిమిశెట్టి మునెయ్య