మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
॥పల్లవి॥ మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ,జయజయ ॥చ1॥ ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున- కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని వేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి- భేదికిని సామాదిగానప్రియవిహారునకు ॥చ2॥ హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్టునకు కరుణా- కరునకునుఁ గాత్యాయనీ నుతకలితనామునకు ॥చ3॥ పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును పంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు | రాగము: లలిత రేకు: 0007-02 సంపుటము: 1-46 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలిత