గురువారం , 21 నవంబర్ 2024
పెద్దపసుపుల - దానవులపాడు

పెద్దపసుపుల – దానవులపాడు (కురుమరి) పొలిమేర కొట్లాట

దండనాయకుడిని హతమార్చిన పెద్దపసుపుల ప్రజలు

పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజు కళ్యాణీ పట్టణాన్నిరాజధానిగా చేసుకుని గండికోటసీమతో సహా పాలన చేస్తున్న (క్రీ.శ.1064) కాలంలో కటకచంద్రనాయకుడు అనే దండనాథుడు జమ్మలమడుగు ప్రాంత రాజ్యపాలనను పర్వవేక్షించేవాడు. ఈ నేపథ్యంలో పెద్దపసుపుల, దానవులపాడు గ్రామాల మధ్య పొలిమేర తగాదా తలెత్తింది. ఇది రెండు గ్రామాల ప్రజల మధ్య పోరాటానికి దారి తీసింది. ఈ విషయం త్రైలోక్యమల్ల మహారాజు దృష్టికి వెళ్ళింది.

దీంతో రాజు ఈ తగాదాను పరిష్కరించాల్సిందిగా కటకచంద్ర దండనాయకున్ని ఆదేశించాడు. చంద్ర దండనాయకుడు రెండు గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు, రెండు గ్రామాల మధ్య పొలిమేరను నిర్ణయించి హద్దులు ఏర్పాటు చేయించి వెళ్లాడు. అయితే దండనాయకుని పంచాయితీ పెద్దపసుపుల గ్రామస్తులకు అంగీకారయోగ్యం కాలేదు. దండనాయకుడు పంచాయితీ చేసి వెళ్ళిపోగానే పసుపుల
గ్రామస్తులు పొలిమేర రాళ్ళను పీకి పడేశారు. రెండు ఊర్ల మధ్య మళ్ళీ వివాదం మొదలయ్యింది. ఈ విషయం మళ్ళీ త్రైలోక్యమల్ల మహారాజుకు తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు.

చదవండి :  దానవులపాడు శాసనాలు

పెద్దపసుపుల గ్రామానికి వెళ్లి పొలిమేర వివాదాన్ని పరిష్కరించాలని ఆదేశించాడు. ఒక వేల గ్రామస్తులు తిరుగుబాటు చేస్తే కఠినంగా అణచివేసి వివాదాన్ని పరిష్కరించాలని రాజు చంద్ర దండనాయకునికి సూచించారు. దండనాయకుడు తన సైన్యంతో తరలివచ్చి మళ్ళీ పొలిమేర హద్దులు
నిర్ణయించి సరిహద్దు రాళ్ళు వేయిస్తుండగా పెద్దపసుపుల గ్రామ ప్రజలు అభ్యంతరం తెలిపి సరిహద్దులు తమకు అంగీకారం కాదని దండనాయకునికి ఎదురు తిరిగినారు. దీంతో వివాదం కాస్తా యుద్ధంగా మారింది. పెద్దపసుపుల , దానవులపాడు పొలిమేర కురుక్షేత్రం అయ్యింది.

చదవండి :  మేడిదిన్నె కైఫియత్

తమ గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నా ఇటు పసుపుల ప్రజలు వెనుకడుగు వేయలేదు. గుర్రాలపై ఉండి యుద్ధం చేస్తున్న దండనాయకుడు కటక చంద్రునితో పాటు అతని బావమరిదిని పసుపుల ప్రజలు బల్లేలతో పొడిచి చంపినారు. తర్వాత జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఊహించవచ్చు. అయితే పసుపుల గ్రామం మాత్రం గత వెయ్యి ఏండ్లుగా అలాగే నిలిచి పోయింది. ఈ సంఘటనకు సాక్ష్యం గా దానవులపాడు సమీపంలోని దేవగుడి గ్రామంలోని తలకంటీశ్వరి అమ్మవారి గుడిలోని రెండు కన్నడ శాసనాలు నిలుస్తున్నాయి. ఈ శాసనాల్లో ఈ పోరాటం వివరించబడి ఉంది.

చదవండి :  కొండపేట కమాల్ - రంగస్థల నటుడు

*రెండు గ్రామాల మధ్య తలెత్తిన పొలిమేర తగాదా రాజ్యాధికారి అయిన ఒక దండనాయకుని ప్రాణాలకు ముప్పు తెచ్చింది.

తవ్వా ఓబుల్‌రెడ్డి

ఇదీ చదవండి!

గండికోట కావ్యం

తొలి ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యం – ‘గండికోట’ – మొదటి భాగం

గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: