గురువారం , 21 నవంబర్ 2024
నేను - తను
భార్యాభర్తల తైలవర్ణ చిత్రం

నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు
మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది
చేయి చాచితే అందే ఆమె దూరం
మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది

ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి
నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది
మౌనంగా మామధ్య చెలియలికట్టలా పడుకొని వున్న పాపకు ఇటువైపు
నా గుండె కల్లోల సాగరమై ఎగిసి పడుతుంటుంది
నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకొంటూ
ఆమె కత్తివాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది

చదవండి :  సీమ రైతన్న (కవిత) - జగదీశ్ కెరె

టైంకి డ్యూటీకొచ్చి తట్టి సైగచేసే నిద్రను
మెలకువ కసరుకొంటుంది
ఎంతకూ నిద్ర లేవని ఆమెలోని దాసిత్వాన్ని
నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది
అప్పుడు – అభిప్రాయం కాదు సమస్య
అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వటం

అంకంతకూ ఆమె నిశ్చల మౌనతటాకమవుతోంటే
నేననుకొంటోన్న ఆమెలోని అహం కరిగి
నా పాదాలకేసి ప్రవహించనందుకు
నాలోని మరోనేను అసహనాన్ని పిచ్చిగా కౌగిలించుకొంటుంటాను
ఇప్పడు – భేదభావం కాదు ప్రశ్న
ఆమె అబలత్వం తీవై సాగిసాగి
చివురుల అరచేతుల్తో నా అహాన్ని స’మర్థిస్తూ’
నాపైకి ఎగబాకలేదనే.

చదవండి :  వీర ప్రేక్షకులు (కవిత)

క్షణక్షణానికి ఆమె మౌనం మీద వేయించబడుతోన్న నా అహం
బేలగా మారి బీటలు వారేందుకు సిద్దమవుతుంది
ఆమె – చలిగాలి అలై నా ఒంటరితనాన్ని స్పర్శిస్తే
జలదరించి వర్షించాలని వుంటుంది

మనో గవాక్షాలలోంచి దూకివచ్చిన చంద్రబింబం
కన్నీటి బిందువై మామధ్య ‘కేర్’మన్నపుడు
ఆమెలోని మాతృత్వం పాపకేసి నదిలా కదిలి
అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా –
నేను నీటి బుడగనై పేలిపోతాను
ఎర్రనీటి ఏటినై ఉరకలెత్తుతాను
ఆమెను నా గుండెల సుడిగుండాలలో పసిపాపలా తిప్పుతాను
నేనే ఆమెనై, అబలనై, పసిపాపనై గారాలు పోతాను.

చదవండి :  అతడికి నమస్కరించాలి (కవిత) - నూకా రాంప్రసాద్‌రెడ్డి

ఇదీ చదవండి!

chidambarareddy

వీర ప్రేక్షకులు (కవిత)

వాడి కాగితాల చూపుల్నిండా టన్నుల కొద్దీ వ్యూహాలు. తన తల్లో వండిన కలలుగానే కొత్త రంగులు పూస్తుంటాడు కొలతలేసి చూపుతుంటాడు. …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: