బదిలీపై వెళ్తున్న ప్రస్తుత ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా నుండి జీవీజీ అశోక్ బుధవారం సాయంత్రం 4.20 గంటలకు కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ …
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తాను ఎస్పీగా మొదట కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల సంక్షేమానికి ఎస్పీ మనీశ్‌కుమార్ సిన్హా తీసుకున్న చర్యలను కొనసాగిస్తానని చెప్పారు.
కానిస్టేబుల్ స్థాయినుంచి అధికారి స్థాయి వరకు అహర్నిశలు పనిచేస్తూ తమ ఆరోగ్యాన్ని సక్రమంగా పట్టించుకునే పరిస్థితుల్లో ఉండరన్నారు. అందువల్ల పోలీసు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో ఎస్పీతోపాటు ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
జీవీజీ అశోక్‌కుమార్‌ను కడప జిల్లా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకూ మునుపు అశోక్‌కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అధికారిగా విధులు నిర్వర్తించారు.
1995 గ్రూపు-1 బ్యాచ్‌కు చెందిన అశోక్‌కుమార్ అనంతపురం జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఆపై కౌంటర్ ఇంటెలిజెన్స్‌లో ఉన్న సమయంలో ఐపీఎస్ హోదా లభించింది. ఆ తర్వాత టీటీడీలో విజిలెన్స్ అధికారిగా పనిచేస్తూ, జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.
అశోక్ కుమార్ కర్నూలు జిల్లా నందికొట్కూరు వాసి.