కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప వద్ద పురాతన శాసనాలు, రాతి శిల్పాలు బయటపడినాయి. యెల్లంపల్లె గ్రామానికి చెందిన గవిరెడ్డి నాగ ప్రసాద రెడ్డి,మూలే శంకర రెడ్డి పొలాల వద్దగల భైరవుని బావివద్ద ఈ శాసనాలు,శిల్పాలు ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు అరబోలు వీరాస్వామి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని ఈవిషయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళారు.
దీంతో తిరుపతిలోని ఆ శాఖ అధికారులు శివకుమార్, జయరాం శాసనాలు, రాతిశిల్పాలు ఉన్న ప్రదేశానికి బుధవారం చేరుకుని శాసనాలను, నాగదేవత, భరవుడు, సర్పం చుట్టుకుని ఉన్న పాదాలను ఇతర శిల్పాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రెండు రాతి శాసనాల్లో ఒక శాసనాన్ని నమూనాను సేకరించారు. త్వరలో రెండో శాసనానం నమూనాను కూడా తీసి ఈ నమూనాలను రాష్ట్ర శాఖ అధికారులకు పంపుతామని పురావస్తు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ విషయమై రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీ రెండవ దేవరాయలు పరిపాలిస్తూ ఉండగా విజయనగర సామ్రాజ్య సామంతరాజు సంబెట పిన్నయ దేవ మహారాజు యెల్లంపల్లె సమీపంలో పేరనిపాడు రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ క్రీస్తుశకం 1428 లో ఈ శాసనాలను వేయించారని తెలిపారు.
విజయనగర సామ్రాజ్య సామంతరాజు పిన్నయదేవ మహారాజు తన తల్లిదండ్రులు తిప్పలదేవి, సోమయ్య జ్ఞాపకార్థం గగ్గితిప్పకు సమీపంలో భైరవున్ని నిలిపి, వనం, బావితవ్వించాడని కైఫీయత్తుల ద్వారా తెలుస్తున్నప్పటికీ ఈ వివరాలు పురావస్తు శాఖ రికార్డులలో నమోదు కాలేదని యెల్లంపల్లె పరిసరాల్లోని ప్రదేశాలను గ్రామస్తులు ఇప్పటికీ కోట , పేట అని పిలుస్తారని తెలిపారు.
సంబెట పాలకుల చరిత్రకు సంబంధించిన ఈ శాసనాలను ,రాతిశిల్పాలను పరిరక్షించాలని తవ్వా ఓబుల్ రెడ్డి ప్రభుత్వ్వనికి విజ్ఞప్తి చేశారు.
కడప జిల్లా శిల్పాలు, శాసనాల ఫోటో గ్యాలరీ