
ఇతఁడు చేసిననేఁత లెన్నిలేవిలమీఁద
॥పల్లవి॥ ఇతఁడు చేసిననేఁత లెన్నిలేవిలమీఁద యితఁడు జగదేకగర్వితుఁడౌనో కాఁడో ॥చ1॥ కుడువఁడా ప్రాణములుగొనుచుఁ బూతకిచన్ను తుడువఁడా కపటదైత్యులనొసలి వ్రాలు అడువఁడా నేలతో నలమి శకటాసురుని వడువఁడా నెత్తురులు వసుధ కంసునివి ॥చ2॥ పెట్టఁడా దనుజారిబిరుదు లోకమునందు కట్టఁడా బలిదైత్యు కర్మబంధముల మెట్టఁడా కాళింగు మేటిశిరములు, నలియఁ- గొట్టఁడా దానవులఁ గోటానఁగోట్ల ॥చ3॥ మరపఁడా పుట్టువులు మరణములుఁ బ్రాణులకు పరపఁడా గంగఁ దనపాదకమలమున చెరుపఁడా దురితములు శ్రీ వెంకటేశుఁడిదె నెరపఁడా లోకములనిండఁ దనకీర్తి |
రాగము: శ్రీరాగం రేకు: 0021-02 సంపుటము: 1-126 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం