
ఆఁకటివేళల నలపైన వేళలను
॥పల్లవి॥ ఆఁకటివేళల నలపైన వేళలను తేఁకువ హరినామమే దిక్కు మఱిలేదు ॥చ1॥ కొఱమాలి వున్నవేళ కులము చెడినవేళ చెఱఁవొడి వొరులచేఁ జిక్కినవేళ వొఱపైన హరినామ మొక్కటే గతిగాక మఱచి తప్పిననైన మఱిలేదు తెరఁగు ॥చ2॥ ఆపద వచ్చినవేళ యారడిఁబడినవేళ పాపపు వేళల భయపడినవేళ వోపినంత హరినామ మొక్కటే గతిగాక మాపుదాఁకాఁ బొరలిన మరిలేదు తెఱఁగు ॥చ3॥ సంకెళఁ బెట్టినవేళ చంపఁ బిలిచిన వేళ అంకిలిగా నప్పులవారాఁగిన వేళ వేంకటేశునామమే విడిపించ గతిగాక మంకుబుద్ధిఁ బొరలిన మరిలేదు తెఱఁగు |
రాగము: ముఖారి రేకు: 0026-03 సంపుటము: 1-158 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి