
అక్కరకొదగనియట్టియర్థము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అక్కరకొదగనియట్టియర్థము లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే ॥చ1॥ దండితోఁ దనకుఁ గాని ధరణిశు రాజ్యంబు యెండెనేమి యది పండెనేమిరే బెండుపడఁ గేశవునిఁ బేరుకొననినాలికె వుండెనేమి వుండకుండెనేమిరే ॥చ2॥ యెదిరిఁ దన్నుఁ గానని యెడపుల గుడ్డికన్ను మొదలఁ దెఱచెనేమి మూసెనేమిరే వెదకి శ్రీపతిసేవ వేడుకఁ జేయనివాఁడు చదివెనేమి చదువు చాలించెనేమిరే ॥చ3॥ ఆవల నెవ్వరులేనిఆడవిలోనివెన్నెల కావిరిఁ గాసెనేమి కాయకున్న నేమిరే శ్రీవేంకటేశ్వరుఁ జేరనిధర్మములెల్ల తోవల నుండెనేమి తొలఁగినేమిరే |
రాగము: ముఖారి రేకు: 0092-04 సంపుటము: 1-456 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి