జానమద్ది హనుమచ్ఛాస్త్రి జగమెరిగిన బ్రౌన్ శాస్త్రిగా మూడు పదుల పుస్తకాలు వెలువరించి, అరువదేండ్ల సాహిత్య జీవితం గడిపి 90 ఏండ్ల పండు వయస్సులో మొన్న (28 ఫిబ్రవరి) తనువు చాలించారు. విషయం, వివేకం, విచక్షణ ప్రోది చేసుకున్న ఆయన క్రమశిక్షణతో, సమయపాలనతో జీవన గమనం సాగించారు. జీవితంలో చివరి మూడు నెలలు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. దానికి ముందు చిర్రుని చీది ఎరగని ఆరోగ్యం వారిది. ‘దురూహలకు, దురాలోచనలకు నా మనస్సులో స్థానం ఉండదు.. ఇదే నా ఆరోగ్య రహస్యం ..’ అనేవారాయన.
రాయదుర్గంలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న శాస్త్రిగారు బళ్లారిలో ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉపాధ్యాయులయ్యారు. ఇప్పటి కర్ణాటక కూడ్లిగిలో ఉద్యోగం చేసే సమయంలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు వయోజన విద్యా ప్రచారం నిమిత్తం ఆ ప్రాంతంలో సంచరించారు. గాడిచర్ల గారి తెలుగు ప్రసంగాన్ని యువకుడైన జానుమద్ది కన్నడీకరించేవారు. గాడిచర్ల వారి వెంట ఉండడం వారి జీవితంలో ఒక మలుపు. వారిద్దరూ మరోమారు అనంతపురంలో కలుసుకోవడం తటస్థించింది. తెలుగుభాష పట్ల, గ్రంథాలయ ఉద్యమం పట్ల ఆ సమయంలో శాస్త్రిగారిలో ఒక కదలిక వచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఆయన తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఎంఎ చేశారు. హిందీ పరీక్షలు పాసయ్యారు. వెరసి ఆయనకు నాలుగు భాషల్లో మంచి పరిచయం ఏర్పడింది. ఉత్తరోత్తరా ఆయన కలం నుంచి తెలుగులోకి ఆదాన రచనలు వచ్చి పడ్డాయి. శాస్త్రిగారిని వస్తుపుష్టి గలిగిన వ్యాస రచనయితగా మార్చాయి.
ఉద్యోగరీత్యా కడప జిల్లాలో ప్రవేశించిన తదుపరి ఆయన కడపను స్థిరనివాసం చేసుకున్నారు. కడప ఒక సాహితీ కేంద్రంగా వికసించడానికి కారణభూతులయ్యారు. కడపలో మా సీమ పక్షపత్రిక ఏర్పటైనప్పటి నుంచి అందులో శాస్త్రిగారు వ్యాసాలు రాసేవారు. సీమ కవుల్ని గురించి ఆయన రాసిన వ్యాసాల సంకలనం ‘మాసీమ కవులు’ పేరుతో తరువాత అచ్చయింది. శాస్త్రికి సారస్వతలోకంలో గుర్తింపు వచ్చింది.
1973లో కడపలో జిల్లా రచయితల సంఘం ప్రారంభమైంది. ఈ సంఘానికి శాస్త్రి 20 సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేశారు. పట్టుసడలని పరిశ్రమతో సాహితీ బంగారాన్ని పండించగల శాస్త్రి ఎనిమిది మహాసభలు నిర్వహించారు. 400కు పైగా సాధారణ సభలు నిర్వహించారు. మహాసభల తర్వాత ప్రత్యేక సంబరాలు ప్రకటించారు. కడప జిల్లా రచయితల సంఘం ఆనాటి తెలుగు సాహిత్యంలోని లబ్ధ ప్రతిష్టులందరూ పాల్గొన్నారు. ఈ సభలు కడపకూ, రచయితల సంఘానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.
తెలుగు భాషకు సూర్యుడుగా వెలిగిన విదేశీయుడైన సి.పి.బ్రౌన్‌కు తెలుగువారు ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించుకోవాలనే బాధ్యతను ఆరుద్ర, బంగోరె, అప్పటి కడప జిల్లా కలెక్టరుగా పి.ఎల్.సంజీవరెడ్డి – జానుమద్ది మీద ఉంచారు. ఇందుకోసం సి.పి.బ్రౌన్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటయింది. ఆ ట్రస్టుకు శాస్త్రి కార్యదర్శి అయ్యారు. గాడిచర్ల వారి స్ఫూర్తితో సి.పి.బ్రౌన్‌కు ఆయన కడపలో నివసించిన చోట గ్రంథాలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ఆ ప్రయత్నం 1990 నాటికి సాకారమైంది. 2005లో గ్రంథాలయాన్ని ప్రభుత్వానికి అప్పగించేనాటికి గ్రంథాలయంలో 20 వేల పుస్తకాలు, మూడంతస్తుల భవనం, రూ.20 లక్షల నిధి సమకూర్చారు. నేడు గ్రంథాలయం సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయం అధీనంలో మూడు పువ్వులూ ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ఒకప్పటి మొండి గోడలున్న చోటు నేడు మహోన్నత సౌధంగా ఆంధ్రదేశంలో అరుదైన గ్రంథాలయంలో రూపుదిద్దుకొంది. 75 వేల గ్రంథాలతో, 300 పరిశోధక గ్రంథాలతో, 300 తాళపత్ర గ్రంథాలతో నిత్య సందర్శకులతో విరాజిల్లుతోంది. ఆ వైభవాన్ని కళ్లారా చూసుకొని హనుమచ్ఛాస్త్రి మురిసిపోయేవారు.
ఇటీవల కాలంలో తెలుగు భాషాభిమానుల సంభాషణల్లో – కడపకు వెళ్తున్నామంటే బ్రౌన్ గ్రంథాలయాన్ని చూసి రండి అని, కడప నుంచి వస్తున్నామంటే శాస్త్రిగారు బాగున్నారా? అని అడగటం సాధారణ నుడి అయిపోయింది. డాక్టర్ సి.నారాయణరెడ్డి కడపలో 1998 నవంబరు 14, 15 తేదీల్లో బ్రౌన్ ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని శాస్త్రికి ‘బ్రౌన్‌శాస్త్రి’ అని కితాబిచ్చారు. అది సార్థక నామధేయంగా మిగిలింది.
శాస్త్రిగారు దాదాపు మూడువేల వ్యాసాలు రాశారు. ఆయన వ్యాసాలు ప్రచురించని తెలుగు పత్రిక లేదు. అవి రసవద్ఘట్టాలుగా, మహనీయుల జీవిత సన్నివేశాలుగా, జీవిత చరిత్రలుగా, ధార్మిక వ్యాసాలుగా పుస్తక రూపంలోకి మారిపోయాయి. మా సీమ కవులు, కన్నడ కస్తూరి, రసవద్ఘట్టాలు, ఎందరో మహానీయులు, నీరాజనం, వ్యాస సభాపతి, సంగీత మేరు శిఖరాలు, గణపతి, సి.పి.బ్రౌన్, డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ, బళ్లారిరాఘవ … ఇలా 30 రచనలు తెలుగు సరస్వతి అలంకరించాయి.శాస్త్రి కృషిని గుర్తించి సంస్థలు, ప్రభుత్వం తగిన విధంగా గుర్తించి, గౌరవించాయి. ఆయన గ్రంథాలయ సేవలకు అయ్యంకి వెంకట రమణయ్య పురస్కారం లభించింది. సాహిత్య సేవకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో ఆయనకు లోక్‌నాయక్ అవార్డు ప్రదానం చేశారు. ఉడుపి పెజావరు పీఠాధిపతి ఆయన్ని ‘ధార్మికరత్న’ అని ప్రశంసించారు.
ఆయన ఆలోచనలతో ప్రారంభమైన గాడిచర్ల ఫౌండేషన్ కాళోజీ, వావిలాల వంటి గ్రంథాలయ మహా సేవకులను సత్కరించింది. 2003 నవంబరులో ఈ ఫౌండేషన్ వారు ‘కడప జిల్లా సంస్కృతి’ పేరుతో డాక్టర్ జానమద్దిహనుమచ్ఛాస్త్రి సారస్వతాన్ని వెలువరించింది. ఇది కడప చరిత్రలో చెరగని సారస్వత పుటగా నిలిచిపోతుంది. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన సాహిత్యకృషి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం తరతరాల తెలుగువారి పుస్తకాల గుడిగా విజ్ఞాన కిరణాలను వెదజల్లుతూనే ఉంటుంది.
చివరగా ఓ మాట
క్రమశిక్షణ, సమయపాలన ఆయన్నుంచి ఈనాటి యువత నేర్చుకోవాలి. ఆయన సభకైనా, సమావేశానికైనా ముందుగా చేరుకునేవారు. ప్రసంగానికి సంబంధించిన అంశాన్ని కాగితంలో భద్రపరచుకుంటారు. అతివ్యాప్తి, అవ్యాప్తి లేకుండా, శాఖా చంక్రమణం చేయకుండా ప్రసంగాన్ని ముగించేవారు. ప్రతిదినం ఆయనకు పదికి తక్కువ కాకుండా ఉత్తరాలు వచ్చేవి. ఏనాటి కానాడు ప్రతి ఉత్తరానికి బదులు రాసి కాని నిద్రపోయేవారు కాదు. కొత్తగా తెలుగు సాహిత్యంలోకి అడుగు పెడుతున్న వారిని ఆదరించి చేరదీయడం, తన సాటి వారిని, తన కంటే గొప్ప వారిని గౌరవించి మన్నించడం ఆయనలో ఉన్న గొప్ప లక్షణం. ఆయన ఆకారంలో ఐదడుగుల ఎత్తున్న వామనుడైనా – సాహిత్య సేవలో, ఆఖరి క్షణం వరకూ సారస్వత సౌభాగ్యాన్ని తీర్చిదిద్దడంలో త్రివిక్రముడు. అందుకే బ్రౌన్‌శాస్త్రికి జేజేలు పలకని తెలుగువాడు ఉండడు.