
రైల్వేకోడూరులో ముఖ్యమంత్రి పర్యటన
రైల్వేకోడూరు : వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డు బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. తర్వాత ఓబులవారిపల్లి మండలం బి.కమ్మపల్లి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటలకు రుణాలను మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. ఎకరాకు రూ.10వేల పరిహారం మాత్రమే ఇస్తామన్నారు.
హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.45 గంటలకు కోడూరుకు వచ్చిన ఆయన తొలుత గుంజన నదిని పరిశీలించారు. నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడారు. వరదల వల్ల ఎదురైన ఇబ్బందులను ప్రజలు సిఎం వివరించారు. చిట్వేలి రోడ్డులోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం, బొమ్మవరం కమ్మపల్లె గ్రామాల్లో పర్యటించారు. వరదతో దెబ్బతిన్న అరటి, బొప్పాయి తోటలను పరిశీలించారు. కోతకుగురైన రోడ్లు, వంతెనలను పరిశీలించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం భుజాన వేసుకొని బాధ్యతగా పనిచేస్తోందన్నారు. రైల్వేకోడూరు ప్రాంతంలో పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ రైతుల కోసం కావాల్సినన్ని కోల్డ్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. గుంజనేరుపైన కిలోమీటరుకు ఒకటి చొప్పున వంద చెక్ డ్యాములు ఏర్పాటు చేస్తామన్నారు.
వరదల్లో పంట నష్టపోయిన రైతులకు సాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. కోడూరు ప్రాంతంలో ఐదు వేల ఎకరాల్లో వరి, 1000 ఎకరాల్లో అరటి, ఐదు వేల ఎకరాల్లో బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం ముందస్తుగా వరద నిరవారణ చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం సంభవించ లేదన్నారు.
సీఎం వెంట మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఉన్నతాధికారులు ఉన్నారు.
చంద్రన్నకు ప్రేమతో …
Saturday, March 3, 2018