అతడికి నమస్కరించాలి (కవిత) – నూకా రాంప్రసాద్‌రెడ్డి
అతడి చెమట స్పర్శతో సూర్యుడు నిద్ర లేస్తాడు
అతడి చేతిలో ప్రపంచం పద్మమై వికసిస్తుంది
దుక్కి దున్ని నాట్లేసి కలుపుతీసి చెమట పరిమళాల్తో తడిసి
ప్రపంచం ముఖంపై వసంతాల్ని కుమ్మరిస్తు నాడు
అతడి శరీరం అగ్ని గోళం
ఒక ప్రపంచ స్వప్నం
మనకింత అన్నం పేట్టే నేల
మన స్వప్నాలు మొలకెతే వడ్ల గింజ
మన కొర్కెల్ని తీర్చే చెట్టు
వసంతా ల్ని పంచే వనం
అతడి హృదయం మంచుతో తడిసిన వెన్నెల లోయలు
వానలో తడిసిన రోడ్ల మీద,చిన్న చిన్న కాలువల మీదా నిలచిన నీళ్ళల్లో
పరమా నందంగా గంతులేసే పసివాళ్ల నవ్వులు
అతడు చేలో పాదం మోపగానే
భూమి,చినుకులు పడినంత సంబరంగా పులకి స్టుంది
పంటల బిడ్డలు పలుకరింపుగా తలలూపూతాయి
అతడి ముందు ప్రకృతంతా అబ్థుత సంగీత కచేరి అవుతుంది
కాడెద్దులు అతడి కాయకష్టం ముందు తలొంచుతాయి
మేఘాలు అతడిని వెక్కిరిస్తూ యేడిపిస్తూ పొలాల గట్లు దాటుతాయి
అతడి గుండెలు పర్వతాలకు ధైర్యాన్ని యిస్తాయి
ఐనా
అతడి పొలంలో అతడొక కూలీ
అతడి పల్లెలో అతడొక బీడు భూమి
అతడు నగరాన్ని భుజాల మీద మోసినవాడు
అతన్ని ఆప్యాయంగా పలుకరించదు,స్పర్శిం చదు
బహుశా నాగరికత అంటే తనను తాను నమ్ముకోక పోవడమే నేమో
తనను నమ్ముకున్న వాళ్ళను అమ్ముకోవడమెనేమో !!
నగరాలన్నీ కరెన్సీ కాగితాల ని అతడికి నిజంగా తెలీదు
తన పొలంలో తన రెక్కల కస్టాన్న్ంతా
అదృశ్య ముఖాలేవో డాలర్లు డాలర్లుగా మూటలకు యెత్తుకోవడం అతడికి అర్థమే కాదు
యిది కాగిటప్పూల ప్రపంచమని
యిది పాచి పట్టిన దిగుడుబావి ప్రపంచమని
అతడికి నిజంగా తెలీనే తెలీదు
ఒక పచ్చి అబద్దం శాసనమై అతడిని మోసం చేస్తూంది
హఠాత్తుగా కమ్ముకున్న పెనుతుపానులా
అధికార వార్త అతడిని మెస్మరిజంలోకి విసురుతుంది
అతడు పచ్చగా వున్నాడని
పచ్చ కామెర్ల ప్రభుత్వం ప్రకటించడం ఒక పెద్ద కుట్ర
అతడి గురించి నేనే కాదు, మట్టి మాట్లాడుతుంది
నేల లోని ప్రతి రేణువూ కోటానుకొట్ల ప్రశ్నల్ని లేవనె తుంది
తమను తాము కోల్పోయిన
చెట్లూ చే మలూ వాగులూ వంకలూ ప్రశ్ని స్తాయి
అతడి గురించి నేనే కాదు, మట్టి మాట్లాడుతుంది
మట్టి కౌగిళ్ళ లో వొదిగిన నాగళ్లు మాట్లాడుతాయి
ప్రపంచమంతా అతడి గురించే గానం చేయాలి
సమస్త ప్రపంచమంతా అతడికే చేతులెత్తి నమస్కరించాలి
– నూకా రాంప్రసాద్ రెడ్డి
(13,ఆక్టోబర్,1996,ఆదివారం వార్త)